ఐపీఎల్ క్రికెట్ టోర్నీ ఆసక్తికరంగా సాగుతోంది. నిన్నటి వరకు పాయింట్ల పట్టికలో దిగువన ఉన్న ముంబై ఇప్పుడు సెంకడ్ ప్లేస్‌కు చేరుకుంది. ఫైనల్ బెర్తులు ఖరారు ఆసక్తిగా మారింది. ఈ సమయంలో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో మెరుపు మెరిసింది. నిన్నటి వరకు ఒక లెక్క… ఇప్పుడు ఒక లెక్క అన్నట్లుగా ఓ 14 ఏళ్ల కుర్రాడు మెరుగు ఇన్నింగ్స్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. భారీ లక్ష్యాన్ని సైతం ఊఫ్ అని ఊదేశాడు. ఇషాంత్ శర్మ, సిరాజ్, రషీద్ ఖాన్, వాషింగ్టన్ సుందర్ వంటి మేటి బౌలర్లను సైతం ఆశ్చర్యానికి గురి చేశాడు. 130 కిలోమీటర్ల వేగంతో మిస్సైల్‌లా దూసుకువచ్చిన బంతులను సైతం అలవోకగా బౌండరీ అవతలకి పంపేశాడు. అలా చూస్తుండగానే హాఫ్ సెంచరీ, సెంచరీ పూర్తి చేశాడు. అసాధ్యం అనుకున్న లక్ష్యాన్ని కూడా సుసాధ్యం చేసి.. ఎవడ్రా వీడు అని అందరి దృష్టి ఆకర్షించాడు.
Also Read : చంద్రబాబు “మైక్రోసాఫ్ట్” స్ట్రాటజీ వర్కౌట్ అయిందా..?
జైపూర్ వేదికగా జరిగిన గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లో అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది ఎవరు అంటే.. ఠక్కున చెప్పే పేరు వైభవ్ సూర్యవంశీ. 14 ఏళ్ల 33 రోజుల వయసున్న ఈ బుడ్డొడ్డు.. ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించాడు. అతి చిన్న వయసులో ఐపీఎల్‌లో సెంచరీ చేసిన క్రికెటర్‌గా రికార్డుకెక్కాడు. అది కూడా కేవలం 35 బంతుల్లోనే శతకం బాదేసి.. జస్ట్ కూల్‌గా బ్యాట్ పైకెత్తేశాడు. బీహార్ రాష్ట్రానికి వచ్చిన వైభవ్ సూర్యవంశీ 2011 మార్చి 27న జన్మించాడు. ఇండియా అండర్ 19 జట్టు తరఫున ఆడిన వైభవ్.. 13 ఏళ్ల వయస్సులోనే 2025 ఐపీఎల్ వేలంలో పాల్గొన్నాడు. వైభవ్‌ను రాజస్థాన్ రాయల్స్ జట్టు రూ.1.1 కోట్లకు కొనుగోలు చేయడంతో.. అతి పిన్న వయస్సులోనే భారీ ధరకు అమ్ముడుపోయిన క్రికెటర్‌గా రికార్డుకెక్కాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో తొలి మ్యాచ్ ఆడిన వైభవ్.. తొలి బంతినే సిక్సర్‌గా బాది అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. తొలి మ్యాచ్‌లో 20 బంతుల్లోనే 34 రన్స్ చేశాడు. ఆ తర్వాత బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 12 బంతుల్లోనే రెండు సిక్సర్లతో 16 రన్స్ చేసి అవుటయ్యాడు. దీంతో అందరి నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఇలా వచ్చి అలా వెళ్లేందుకు కోటి అవసరమా అనే కామెంట్లు వచ్చాయి. చిన్న కుర్రాడు కదా.. బాల్ బాయ్‌గా సరిపోతాడనే మాటలు కూడా వచ్చాయి.
Also Read : అడ్డంగా దొరికిన సజ్జల, రిపోర్ట్ రెడీ
అయితే తనపై వచ్చిన విమర్శలను సైలెంట్‌గా విన్న వైభవ్.. బ్యాట్‌తో వైలెంట్‌గా జవాబిచ్చాడు. రాజస్థాన్ రాయల్స్ తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో జూలు విదిలించాడు. గుజరాత్ టైటాన్స్ విధించిన 210 పరుగుల లక్ష్యాన్ని అలా పక్కన పడేశాడు. 12 ఓవర్లకే రాజస్థాన్ గెలుపు ఖాయం చేసేశాడు. ఫస్ట్ బాల్ నుంచే ప్రత్యర్థిపై విరుచుకుపడ్డాడు. దూకుడుగా ఆడే యశస్వీ జైస్వాల్ సైతం వైభవ్‌కు స్ట్రైకింగ్ ఇచ్చేసి.. ప్రేక్షకుడిలా ఇన్నింగ్స్ చూస్తూ ఉన్నాడు. 6 సిక్సర్లు, 3 బౌండరీలతో 17 బాల్స్‌కే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాత మరో 18 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసేశాడు. 11 సిక్సర్లు, 7 ఫోర్లతో 35 బంతుల్లోనే శతకం బాదేసిన వైభవ్.. టీ20 హిస్టరీలోనే సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా రికార్డుకెక్కాడు. అలాగే ఐపీఎల్‌లో తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన రెండో బ్యాట్స్‌మెన్ కూడా వైభవ్. బెంగళూరు తరఫున 30 బంతుల్లో సెంచరీ చేసిన గేల్ ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు.
Also Read :బూమ్రా ప్రవర్తనపై అభిమానులు ఫైర్.. కాస్త తగ్గు..!
వైభవ్ ఆడుతున్నంత సేపు రాజస్థాన్ కోచ్ రాహుల్ ద్రావిడ్ బాగా ఎంజాయ్ చేశాడు. అటు గుజరాత్ బౌలింగ్ కోచ్ ఆశిష్ నెహ్రా తెగ కంగారు పడిపోయాడు. ఎన్నడూ లేనట్లుగా ఏడుగురు బౌలింగ్ చేశారు. కరీం జనత్ వేసిన ఒకే ఓవర్‌లో 3 సిక్సర్లు, 3 ఫోర్లు బాదిన వైభవ్.. ఏకంగా 30 పరుగులు రాబట్టడంతో జనత్ మళ్లీ బాల్ పట్టుకోలేదు. వైభవ్ ఇన్నింగ్స్ చూసిన వారంతా.. త్వరలోనే టీమిండియాకు ఆడతాడని కితాబిచ్చారు. సచిన్ 16 ఏళ్ల 238 రోజుల వయసులో టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. ఈ రికార్డును త్వరలోనే వైభవ్ బ్రేక్ చేస్తాడని అంతా భావిస్తున్నారు. రాబోయే సిరీస్‌లోనే వైభవ్‌పే టీమిండియా జాతీయ జట్టులో ఉంటుందని క్రీడా విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.