వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో తిరుమలను భ్రష్టు పట్టించారు అనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపించాయి. అన్యమతస్తుల పెత్తనంతో తిరుమలలో వైసీపీ అనుసరించిన వైఖరి అప్పట్లో వివాదాస్పదం అయింది. ఉద్యోగుల్లో కూడా ఎక్కువగా వాళ్ళనే నియమించారు అనే విమర్శలు వచ్చాయి. తిరుమల లడ్డు విషయంలో వైసీపీ సర్కార్ తీసుకున్న నిర్ణయాలపై ఇప్పుడు విచారణ కూడా కొనసాగుతోంది. వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా వ్యవహరించిన సమయంలో తీసుకున్న నిర్ణయాలపై భక్తులు తీవ్ర విమర్శలు చేసారు.
అద్దె గదులు, తోమాల సేవ సహా అనేక సేవలపై ధరలను భారీగా పెంచారు. ఇక తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది. తిరుమలలో వైసీపీ పాలనలో ఘోర అపచారం బహిర్గతం అయింది. పరకామణి సొమ్మును ఉద్యోగి దోచిన వీడియోలు బయటకు రావడం సంచలనంగా మారింది. ధర్మారెడ్డి ఈవోగా, కరుణాకర్ రెడ్డి చైర్మన్ గా ఉన్న సమయంలో దోపిడీ జరిగినట్టు గుర్తించారు. కోట్ల సొమ్మును రియల్ ఎస్టేట్ పెట్టుబడులుగా అక్కడ పని చేసే ఉద్యోగి మార్చినట్టు గుర్తించారు.
నాటి టీటీడీ పెద్దలు, పోలీసు ఉన్నతాధికారులు ఆస్తులు రాసిపుచ్చుకున్న వ్యవహారం కూడా వెలుగులోకి వచ్చింది. దొంగ సొమ్మును తిరిగి హుండీలో వేయాలని ఉద్యోగి ప్రతిపాదన పెట్టినా.. అయితే అదే సొమ్మును పెద్దలు మింగేశారని ఆరోపణలు వినిపించాయి. సాక్ష్యాలను ధ్వంసం చేసినా… నిందితుడు నిజాలు బయట పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై సీఐడీ దర్యాప్తు కొనసాగుతోందని టీటీడీ అధికారులు వెల్లడించారు. శ్రీవారి ప్రతిష్ట దెబ్బతీసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.