ఆయనో ప్రభుత్వ ఉద్యోగి.. చేయాల్సిన పని ప్రజలకు సేవ. కానీ ఆయన చేస్తుంది ఏమిటీ అంటే.. రాజకీయ నేతల చుట్టూ తిరగటం. ఇంకా చెప్పాలంటే.. పార్టీ ప్రచార కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. ఇదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే.. నా ఇష్టం.. నేను ఇలాగే ఉంటా.. నేను ఇలానే చేస్తా.. ఏం చేస్తావు నువ్వు.. అని బెదిరిస్తారు కూడా. ఇంకా గట్టిగా మాట్లాడితే.. నాకు రాజకీయ నేతల అండ ఉంది.. నువ్వే తప్పు చేశావని ఎదురు కేసు పెట్టి బొక్కలో వేయిస్తా అని భయపెడతారు కూడా. ఆ అధికారి అవినీతి అడ్డు లేకుండా పోయింది. ఇంతకీ ఎవరా అధికారి..?
ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆయన పేరు దారం ఏడుకొండలు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు డిపార్ట్‌మెంట్.. ఏపీపీటీడీలో అసిస్టెంట్ డిపో క్లర్క్‌గా పని చేస్తున్నారు. ఈయన గారి ఐడీ 350142. ప్రస్తుతం గుడివాడ ఆర్టీసీ బస్ డిపోలో విధులు నిర్వహిస్తున్నారు. ఆయన చేయాల్సిన పనులన్నీ ఎప్పుడో పక్కన పెట్టేశారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న ఒకే ఒక్క పని ఏమిటంటే.. అది రాజకీయం మాత్రమే. మాజీ మంత్రి కొడాలి నానికి అత్యంత సన్నిహితుల్లో ఏడుకొండలు కూడా ఒకరు. అందుకే నాని ఎక్కడ ఉంటే.. ఏడుకొండలు కూడా అక్కడే ఉంటారు. అది ప్రభుత్వ కార్యక్రమం అయినా.. రాజకీయ సభ అయినా.. చివరికి పార్టీ మీటింగ్ అయినా సరే.. ఏడుకొండలు అక్కడ ఉండాల్సిందే. చివరికి ఎన్నికల ప్రచారంలో కూడా ఏడుకొండలు పాల్గొన్నారు. దీనిపై ఉన్నతాధికారులు ఫిర్యాదు చేసినా సరే.. డోంట్ కేర్ అనేశారు తప్ప.. నానిని మాత్రం వదిలేది లేదు అనేశారు.
Also Read : ఆ ఇద్దరి మధ్య ఎందుకింత తేడా..?
వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారందరికీ ఒకటే రూల్ ఉంటుంది. కానీ ఏడుకొండలు విషయంలో మాత్రం అలాంటి రూల్స్ ఉండవు. పగలు, రాత్రి అనే తేడా అస్సలు ఉండదు. తనకు ఎప్పుడు వీలైతే.. ఎప్పుడు వెసులుబాటు ఉంటే.. అప్పుడు ఆఫీసుకు వస్తారు తప్ప.. ఒక సమయం అంటూ లేదంటారు సహచరులు. రాజకీయ ప్రచార కార్యక్రమాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తి చేసుకున్న తర్వాత… తీరిగ్గా ఆఫీసుకు వచ్చి సంతకం చేసి వెళ్తారు. ఆఫీసులో ఎన్ని సీసీ కెమెరాలున్నా సరే.. డోంట్ కేర్.. నేను వచ్చినప్పుడే డ్యూటీ అంటారు. అదే ఏడుకొండలు స్టైల్. ఆర్టీసీ అద్దె బస్సుల బిల్లులు మాత్రమే ఏడుకొండలు చేస్తారు. కానీ ఆయన ఏ రోజు ఆ పని చేసినట్లుగా కనిపించిందే లేదు. ఇంకా చెప్పాలంటే.. అధికారులను బెదిరించి, భయపెట్టి.. వేరే వారితో ఆ పని పూర్తి చేయించగల దిట్ట మన ఏడుకొండలు. నెల నెలా ఇండెంట్ కోసం విజయవాడ వర్క్‌షాపునకు వెళ్లాలి. అలాగే టిమ్స్ మిషన్ రిపేరు కూడా తప్పకుండా వెళ్లాలి. కానీ రెండేళ్లుగా ఒక్కసారి కూడా వెళ్లినట్లు లేదు అనేది ఉద్యోగుల మాట. కానీ బిల్లులు మాత్రం డ్రా చేశారు.
ఇక్కడ మరో విచిత్రం ఏమిటంటే.. ఆయన చేయాల్సిన పనులను పూర్తి చేయరు. వాటి కోసం ప్రత్యేకంగా ఓ కండెక్టర్‌కు ఆన్ డ్యూటీ వేస్తారు. ఆ కండెక్టర్ తోనే హైర్ బిల్లు పని చేయిస్తారు. అదేంటి సార్అని ఎవరైనా అడిగితే.. నీకు పని కావాలా.. వివరణ కావాలా అని నిలదీస్తారు. వైసీపీ అభిమానిగా.. ఇంకా చెప్పాలంటే.. మాజీ మంత్రి కొడాలి నానికి అత్యంత ఆప్తునిగా గుర్తింపు తెచ్చుకున్న ఏడుకొండలు.. వైసీపీ గెలుపు కోసం ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. ఆ సమయంలో హైర్ బిల్లులను పూర్తిగా పక్కన పెట్టారు. ఒక దశలో కొడాలి నాని గెలుస్తారు చూడు అంటూ బెట్టింగ్ వేసేందుకు కూడా సిద్ధమయ్యారనేది సహచర ఉద్యోగుల మాట. అయితే వైసీపీ ఓడిన తర్వాత ఏడుకొండలు ఆటలకు బ్రేక్ పడుతుందని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. పైగా కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువచ్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నారు ఏడుకొండలు.
Also Read : మంత్రులలో ప్రోగ్రెస్ రిపోర్ట్ భయం..?
కొడాలి నాని అండతో అద్దె బస్సుల ఓనర్లను బెదిరిస్తున్నారు. వాళ్లు డబ్బులు ఇవ్వకపోవడంతో ఉన్నతాధికారితో కలిసి ఓనర్ల మధ్య విబేధాలు రెచ్చగొట్టారు. ఈ గోల మాకెందుకు సార్.. అనుకున్న అద్దె బస్సు యజమానులు.. సైలెంట్‌గా బస్సులు అమ్మేస్తున్నారు. ఇప్పటికే 6 బస్సులను ఓనర్లు అమ్మేశారు. ఇదంతా గుడివాడ ఆర్టీసీ డిపోలో పని చేస్తున్న ప్రతి ఒక్కరికీ తెలుసు.. కానీ బయటకు చెప్పేందుకు ఒక్కరు కూడా ముందుకు రావటం లేదు. కారణం.. వారికి ఏడుకొండలు అంటే భయం. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత దారం ఏడుకొండలు పై చర్యలు తీసుకోవాలని పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు డిపార్ట్‌మెంట్ ఉద్యోగులు రాష్ట్ర రవాణా శాఖ మంత్రికి, కృష్ణా జిల్లా కలెక్టర్‌కు గతేడాది జులై ఒకటవ తేదీనే లేఖ కూడా రాశారు. అయినా సరే.. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవు.
ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. అసిస్టెంట్ డిపో క్లర్క్ దారం ఏడుకొండలు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్నారని.. కాబట్టి వెంటనే ఆయనపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డికి గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ల రాము ఈ ఏడాది ఫిబ్రవరి 4వ తేదీన లేఖ రాశారు. ఎమ్మెల్యే లేఖ రాశారు కాబట్టి.. చర్యలుంటాయని అంతా ఆశపడ్డారు. కానీ.. ఆ లేఖ రాసి.. ఇప్పటికే నాలుగు నెలలు దాటిపోయింది. అయినా ఏడుకొండలు.. అదే సీట్‌లో ఉన్నారు తప్ప.. అంగుళం కూడా కదల్లేదు. పైగా అరుంధతి సినిమాలో అనుష్క డైలాగ్ నన్నెవరు ఏం చేయలేరురా అని గొప్పగా చెబుతున్నారు. లేఖ రాసిన ఎమ్మెల్యే రాము.. ఆయనపై చర్యలు తీసుకోవద్దు అని ఫోన్ చేసి కోరినట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ గతంలో ఇదే మచిలీపట్నం ఎంపీగా పని చేశారు. ఆయనకు కూడా ఇక్కడ పరిస్థితులు పూర్తిగా తెలుసు. అయినా సరే.. ఏడుకొండలు పై చర్యలు తీసుకోవడానికి ఎందుకు భయపడుతున్నారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.