ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశం కానుంది. వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన 7 నెలలు దాటింది. ఈ నేపథ్యంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలపై ఏపీలో తీవ్రంగా చర్చ నడుస్తోంది. సూపర్ సిక్స్ హామీల అమలు ఎప్పుడంటూ ఇప్పటికే వైసీపీ నేతలు పదేపదే ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారంటూ విమర్శలు కూడా చేస్తున్నారు. దీంతో కూటమి సర్కార్ కూడా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై ప్రధానంగా దృష్టి సారించింది.
Also Read : ఏపీకి అమిత్ షా.. పక్కా పొలిటికల్ టూర్…?
సంక్షేమ పథకాల అమలులో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని.. తాము మాత్రం అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని చంద్రబాబు సహా టీడీపీ నేతలంతా హామీ ఇచ్చారు. చెప్పినట్లుగానే బాధ్యతలు చేపట్టిన తొలిరోజే 3 హామీలపై చంద్రబాబు సంతకం కూడా చేశారు. పింఛన్ పెంపుతో పాటు మెగా డీఎస్సీని ప్రకటించారు. అలాగే మహిళకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించే దీపం-2 పథకాన్ని కూడా అమలు చేస్తున్నారరు. అయితే కీలకమైన హామీలపై మాత్రం ఇప్పటికీ ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ఇవే ఇప్పుడు వైసీపీ నేతలకు అస్త్రాలుగా మారాయి.
Also Read : కోడిపందాలపై చంద్రబాబు ఇంట్రస్టింగ్ కామెంట్స్
అమ్మ ఒడి బదులుగా తల్లికి వందనం అమలు చేస్తామని… ఎంతమంది పిల్లలుంటే.. అంతమందికి రూ.15 వేలు ప్రతి ఏటా ఇస్తామన్నారు. అలాగే మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణ అవకాశం కల్పిస్తామన్నారు కూడా. మహిళలకు ఉచిత ప్రయాణంపై ఇప్పటికే మంత్రివర్గ ఉప సంఘం సభ్యులు కర్ణాటకలో పర్యటించారు. పథకం అమలుపై అధ్యయనం చేశారు. ఈ నివేదికను నేటి క్యాబినెట్ భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే తల్లికి వందనం పథకంపై కూడా ప్రస్తుత క్యాబినెట్‌లోనే క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది. గతంలో ప్రతి ఏటా జనవరి పదవ తేదీన జగన్ అమ్మ ఒడి డబ్బులు వేశారు. అయితే చివరి రెండు విడతలు మాత్రం జూన్ నెలలో ఇచ్చారు. కానీ ఆ విషయం మర్చిపోయిన వైసీపీ నేతలు… తల్లికి వందనం ఏది అని సెప్టెంబర్ నుంచే నిలదీస్తున్నారు. దీంతో ఈ ఏడాది మార్చి నెలలోనే తల్లికి వందనం ఇస్తామని ఇప్పటికే లోకేష్ ప్రకటించారు కూడా. ఈ పథకంపై కూడా నేటి క్యాబినెట్‌లోనే చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.




