ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి అప్పుడే ఆరు నెలలు గడిచిపోయింది. పార్టీ అధికారంలోకి రావడంతో చాలా మంది తెలుగుదేశం పార్టీ నేతలు పదవులపై గంపెడాశలు పెట్టుకున్నారు. సీనియర్లు నామినేటెడ్ పదవుల కోసం ప్రయత్నాలు చేస్తుంటే… ద్వితీయ శ్రేణి నేతలంతా పార్టీ పదవులైనా వస్తాయని ఆశపడుతున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చేందుకు టీడీపీ నేతలంతా సమిష్టిగా పని చేశారు. ఇంకా చెప్పాలంటే ఎన్నికలకు ఏడాది ముందు నుంచే తమ తమ స్థాయిల్లో స్థాయికి మించి కష్టపడ్డారు.
Also Read : వీరు పార్టీ మారడం వెనుక ఇంత స్వార్ధం ఉందా?
ఐటీ రంగంలో కొందరు… ఎన్ఆర్ఐలను ఏకం చేయడంలో కొందరు.. ఇక మహిళలు, యువత, దివ్యాంగులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ.. ఇలా అన్ని వర్గాల ప్రజలతో కూడా వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాల గురించి వివరించి… చైతన్య పరిచారు. చివరికి ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ బూతులకు వచ్చేలా తమ వంతు ప్రయత్నం చేశారు. ఇక పార్టీ గెలవడంతో ఇప్పుడు పదవుల కోసం ఆశపడుతున్నారు. పార్టీలో సీనియర్ నేతలంతా నామినేటెడ్ పదవుల కోసమే ప్రయత్నం చేశారు. ఇందులో చాలా మందికి ఇప్పటికే కీలక పదవులిచ్చారు చంద్రబాబు. ఇక మిగిలిన పదవులను కూడా ఒక వారం రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇక వీటితో పాటు పార్టీ పదవుల నియామకంపై ద్వితీయ శ్రేణి నేతలంతా గంపెడాశలు పెట్టుకున్నారు. తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనితను హోమ్ మంత్రి చేశారు. బీసీ సెల్ అధ్యక్షుడు కొల్లు రవీంద్రను మంత్రిని చేశారు. ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎం.ఎస్.రాజుకు ఎమ్మెల్యే టికెట్‌తో పాటు టీటీడీ బోర్డు సభ్యత్వం కూడా వచ్చింది. ఇక రైతు విభాగం శ్రీనివాసరెడ్డికి నామినేటెడ్ పదవి దక్కింది. దీంతో ఇప్పుడు ఆయా పదవులను భర్తీ చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే… పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి మాత్రమే భర్తీ చేశారు చంద్రబాబు. అచ్చెన్నాయుడు స్థానంలో గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌ను నియమించారు.
Also Read : ప్రేమ పెళ్ళిళ్ళకి సిద్దమైన టాలీవుడ్ టాప్ యాక్టర్స్ వీళ్ళే
మిగిలిన స్థానాలను కూడా భర్తీ చేయాల్సి ఉంది. కానీ వాటి ఊసే ఎత్తడం లేదు. వాస్తవానికి అధికార ప్రతినిధులను కూడా కొత్త వారిని నియమించాల్సి ఉంది. ఇప్పటికే పట్టాభి, జీవీ రెడ్డికి చెరో కార్పొరేషన్ అందించారు. పైగా వీరినే దాదాపు నాలుగేళ్లుగా ప్రజలు చూస్తూనే ఉన్నారు. కాబట్టి కొత్త వారిని నియమిస్తే…. బాగుంటుంది అనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. తెలుగు మహిళ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, రైతు, అంగన్వాడీ, ఐటీ, ఎన్ఆర్ఐ విభాగాలకు కూడా కొత్త వారిని నియమించాలనేది పార్టీ నేతల డిమాండ్. మరి ఆయా పోస్టులను ఎవరితో భర్తీ చేస్తారో చూడాలి.