విపక్షాల విమర్శలకు చెక్ పెడుతూ ఏపీలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే పథకానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ కలిసి ప్రారంభించారు. బస్సులో మహిళలతో కలిసి ప్రయాణించారు. అయితే ఈ పథకంపై వైసీపీ అనుకూల సోషల్ మీడియా వ్యతిరేక ప్రచారం చేస్తోంది. వైసీపీ కరపత్రం సాక్షిలో ప్రజల్లో అపోహలు కల్పించేలా కథనాలు ప్రచురిస్తున్నారు. ఇక స్త్రీ శక్తి పథకంపై ప్రజలను తప్పుదోవ పట్టించేలా సాక్షి పత్రికలో వార్తలు రాస్తున్నారు. స్త్రీ శక్తి పథకం ప్రారంభానికి ముందే ఏఏ బస్సుల్లో, ఎవరెవరికి వర్తిస్తుందో క్లియర్‌గా వెల్లడించింది ప్రభుత్వం. కానీ వైసీపీ నేతలు మాత్రం పదే పదే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ నేతలు.
Also Read : కోహ్లీ, రోహిత్ పై బోర్డు రాజకీయాలు.. మాజీ క్రికెటర్ సంచలనం
స్త్రీ శక్తి పథకంపై టీడీపీ నేతలు తొలి నుంచి స్పష్టంగానే ఉన్నారు. దీనిపై పలుమార్లు సమీక్షలు నిర్వహించిన తర్వాతే.. నిబంధనలు రూపొందించారు. 5 రకాల సర్వీసుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణ అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్, సిటీ బస్సుల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉంది. నాన్ స్టాప్, లగ్జరీ, ఏసీ సర్వీసుల్లో టికెట్ తీసుకోవాలని సూచించారు. తిరుమల వెళ్లే బస్సుల్లో కూడా ఉచితం లేదని తేల్చేసింది.
అయితే దీనిపైనే వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రమంతా అన్నారు.. ఇప్పుడు ఇదేం రూల్స్.. అంటున్నారు. పైగా మహిళలను మోసం చేశారంటూ ప్రచారం చేస్తున్నారు. ఓ వైపు మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణాలు చేస్తున్నప్పటికీ.. ఈ పథకం ఏ మాత్రం అనుకూలంగా లేదని తప్పుడు వార్తలు రాస్తోంది సాక్షి మీడియా. తిరుపతి – తిరుమల బస్సులో మహిళతో మాట్లాడిస్తూ.. ప్రభుత్వం చెప్పింది ఒకటి.. చేస్తోంది ఒకటి కదా.. అని చెప్పించి మరీ వార్తలు రాస్తున్నారు.
Also Read : వరుస వివాదాల్లో టీడీపీ నేతలు..!
దీనిపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ తప్పుడు ప్రచారానికి గట్టిగా కౌంటర్ ఇవ్వాలని పార్టీ అధినాయకత్వం కిందిస్థాయి నేతలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో సాక్షి పత్రికతో పాటు వైసీపీ నేతలకు కూడా టీడీపీ నేతలు బంపర్ ఆఫర్ ఇచ్చారు. సాక్షి అధినేత వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతీరెడ్డి పులివెందుల నుంచి నేరుగా తాడేపల్లి వరకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని మాజీ మంత్రి పీతల సుజాత సూచించారు. సాక్షి సంస్థలో పని చేస్తున్న మహిళా సిబ్బంది కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు అని.. అలా చేసిన టికెట్లకు ప్రభుత్వమే ఆర్టీసీకి డబ్బులు చెల్లిస్తుందని కూడా తెలిపారు. మాజీ మంత్రి రోజాకు కూడా నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. నగరి నుంచి నేరుగా తాడేపల్లి వరకు బస్సులో ఉచితంగా ప్రయాణం చేయవచ్చన్నారు. టీడీపీ నేతల వ్యాఖ్యలతో వైసీపీ నేతల నోటికి తాళం పడినట్లు అయ్యింది.