జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక నేపథ్యంలో ఎన్డీఏ కూటమి పోటీ చేస్తుందా లేదా అనే దానిపై గత మూడు నెలల నుంచి ఆసక్తికర చర్చలు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ బిజెపి బరిలోకి దిగే అవకాశం ఉందని, బిజెపి నుంచి జయసుధ పోటీ చేస్తారంటూ ఇటీవల కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అటు ఒకరిద్దరు బిజెపి నేతలు కూడా ఇక్కడ పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరిగింది. అయితే ఇక్కడ టిడిపినే పోటీ చేస్తే మంచిది అనే భావనలో బిజెపి ఉందంటూ రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతూ వచ్చారు.
Also Read : రంగంలోకి జగన్.. క్యాడర్ తో మరో కీలక సమావేశం
ఇప్పుడు ఆ అభిప్రాయాలే నిజమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక్కడ టిడిపి పోటీ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. టిడిపి అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు పార్టీ తెలంగాణ నేతలతో సమావేశం అవుతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో పోటీ చేసే అవకాశాలను పార్టీ నేతలతో చంద్రబాబు చర్చించే అవకాశం కనబడుతోంది. సెటిలర్లు ఎక్కువగా ఉండే నియోజకవర్గ కావడంతో ఇక్కడ పోటీ చేస్తే బాగుంటుందని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం.
Also Read : జూబ్లిహిల్స్ ఎన్నిక అప్పుడే.. బీహార్ ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం..!
ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి అంశంపై కూడా చంద్రబాబు చర్చించే సంకేతాలు కనబడుతున్నాయి. అటు తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమైన నేపథ్యంలో.. ఏ జిల్లాలో పోటీ చేయాలి అనే అంశంపై చంద్రబాబు పార్టీ నేతలతో చర్చిస్తారు. ఈ భేటీ అనంతరం మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించే అవకాశం ఉందని సమాచారం. ఒకటి రెండు రోజుల్లో అధ్యక్షుడి ఎంపిక కూడా పూర్తి చేయనున్నారు. అటు బీజేపీతో కూడా సంప్రదింపులు జరిపిన తర్వాతనే పూర్తిస్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ అంశంపై టిడిపి నుంచి ప్రకటన వచ్చే అవకాశం ఉంది.