గులాబీ పార్టీ అధినేతకు ఆ పువ్వు ముల్లు గట్టిగానే గుచ్చుకుంటున్నాయి. హ్యాట్రిక్ గెలుపు ఖాయమనుకున్న కేసీఆర్‌ను ఓటమి పలకరించింది. తెలంగాణ బాపు అని గొప్పగా ప్రకటించుకున్న కారు పార్టీ అధినేతను ప్రతిపక్షానికే పరిమితం చేశారు తెలంగాణ ఓటర్లు. తెలంగాణ దశ దిశా తామే అని గొప్పగా చెప్పుకున్న కేటీఆర్ గురి తప్పించారు. 2023 ఎన్నికల్లో కారు టైరు పంచర్ అయ్యింది. తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరును భారత్ రాష్ట్ర సమితి అని మార్చిన నాటి నుంచే కేసీఆర్ పైన ప్రజల్లో నమ్మకం సన్నగిల్లిందనే చెప్పాలి. ఆ తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో కేసీఆర్‌కు ఓటమే ఎదురైంది. చివరికి సెంటిమెంట్ డ్రామా కూడా వర్కవుట్ కాలేదు.
Also Read : ట్రబుల్ షూటర్ గట్టేక్కిస్తాడా..?
ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిన తర్వాత ఆ పార్టీకి మరిన్ని కష్టాలు ఎదురయ్యాయి. 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ కార్యక్రమలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కనీసం ఒక్క సీటు కూడా గెలవలేదు. కొన్ని నియోజకవర్గాల్లో అయితే కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. ఇక బీఆర్ఎస్ ఓటమి తర్వాత కేసీఆర్ పూర్తిగా ఫామ్ హౌజ్‌కు పరిమితం అయ్యారు. అదే సమయంలో కుటుంబంలో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. చివరికి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసారు. దీంతో కేసీఆర్ పని అయిపోయిందనే మాట బాగా వినిపించింది. ఇదే సమయంలో జూబ్లీహిల్స్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలిచి.. పార్టీ పరువు కాపాడుకోవాలనేది కేసీఆర్ ప్లాన్. అందుకే జూబ్లీహిల్స్ ఎన్నిక బాధ్యతను మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుకు అప్పగించారు. ఈ ఇద్దరు ఇప్పుడు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు కూడా.
హైదరాబాద్ జంట నగరాల్లో కాంగ్రెస్ పార్టీ కనీసం ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలుచుకోలేదు. జీహెచ్ఎంసీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపు కాంగ్రెస్ పార్టీకి అనివార్యమైంది. అందుకే ఈ ఉప ఎన్నికలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు హస్తం పార్టీ పెద్దలు. బీసీ అభ్యర్థిని బరిలో నిలపనున్నట్లు ప్రకటించిన పార్టీ నేతలు.. నలుగురు అభ్యర్థుల జాబితాను ఢిల్లీ పెద్దలకు పంపారు. ఆ జాబితా నుంచి నవీన్ యాదవ్ పేరును హస్తం పార్టీ పెద్దలు ప్రకటించారు. ఇది బీఆర్ఎస్‌కు గట్టి ఎదురుదెబ్బ అంటున్నారు. బీఆర్ఎస్ పూర్తిగా సానుభూతి ఓట్ల మీదే నమ్మకం పెట్టుకుంది. కానీ ఇదే సమయంలో ఆ పార్టీ సీనియర్ నేత కారు దిగేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
Also Read : అడిగితే చూద్దాం.. లేదంటే లేదు..!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ నేతలంతా ప్రచారం చేయాలనేది వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట. ముఖ్యంగా జంట నగరాలకు చెందిన నేతలంతా ఈ ఎన్నికలో మాగంటి సునీత తరఫున ప్రచారం చేయాలని.. ఆమె గెలుపు కోసం ప్రయత్నం చేయాలని సూచించారు. ఇందుకోసం నేతలతో ప్రత్యేకంగా సమావేశం కూడా అయ్యారు. అయితే ఇక్కడే గులాబీ బాస్‌కు షాక్ తగిలింది. సనత్ నగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఈ సమావేశానికి డుమ్మా కొట్టారు. తనకు ఆరోగ్యం సరిగా లేదని.. ఉప ఎన్నికల్లో ప్రచారం చేసే పరిస్థితి లేదని సమాచారం ఇచ్చారు. అయితే అసలు విషయం వేరే ఉందంటున్నారు గులాబీ పార్టీ నేతలు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్.. తలసాని సోదరుడి అల్లుడు. నవీన్ యాదవ్ వివాహం కూడా తలసాని చేతుల మీదుగానే జరిగింది. అందుకే ఉప ఎన్నికల్లో నవీన్‌ను పరోక్షంగా గెలిపించేందుకు తలసాని ప్రచారాని దూరంగా ఉన్నారంటున్నారు బీఆర్ఎస్ నేతలు. మరి ఈ విమర్శలకు తలసాని చెక్ పెడతారా.. లేక.. సైలెంట్‌గా కారు పార్టీకి దూరమవుతారా… వేచి చూడాల్సిందే.