మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు.. కొత్త మంత్రులు కొలువు తీరేది ఎప్పుడు.. అసలు మనకు మంత్రులుగా అవకాశం వస్తుందా.. సైరన్ కారులో తిరిగే యోగం మనకుందా.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఏ ఇద్దరు నేతలను కదిపినా ఇదే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 2023 డిసెంబర్ 9వ తేదీన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. నాడు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారే ఇప్పటికీ కొనసాగుతున్నారు. నాటి నుంచి ఇప్పటికీ కొన్ని మంత్రి పదవులు ఖాళీగానే ఉన్నాయి. ఇక హోమ్ వంటి కీలక శాఖలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. దీంతో పలువురు సీనియర్లు మంత్రి పదవుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.
Also Read : రోహిత్ ను వెంటాడుతున్న “బౌల్డ్” భయం
వాస్తవానికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరిన వెంటనే భట్టి విక్రమార్క, వెంకటరెడ్డి, పొంగులేటి, తుమ్మల, సీతక్క, కొండ సురేఖ, జూపల్లి, పొన్నం వంటి సీనియర్లతో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు రేవంత్ రెడ్డి. ఇక అప్పుడే 6 పదవులను ఖాళీగా ఉంచారు. ఇక ఆరు స్థానాలను ఎవరితో భర్తీ చేస్తారనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ అప్పుడే మొదలైంది. అయితే తొలి నాళ్లల్లో పార్లమెంట్ ఎన్నికలు సాకుగా చూపించి పదవుల భర్తీని వాయిదా వేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బాగా కష్టపడిన వారికే పదవులంటూ ఆశపెట్టారు. ఆ తర్వాత కూడా జిల్లాల వారీగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపిచ్చారు. పార్లమెంట్ ఎన్నికలు పూర్తైన నాటి నుంచి క్యాబినెట్ విస్తరణ ఎప్పుడు.. నామినేటెడ్ పదవుల భర్తీ ఎప్పుడూ అంటూ పార్టీ నేతలంతా ఆశగా ఎదురు చూస్తున్నారు.
Also Read : ఎన్టీఆర్ కు ఆహ్వానం లేదా.. సోషల్ మీడియా చేతికి కొబ్బరి చిప్ప
టీపీసీసీ పదవిని భర్తీ చేసినప్పటికీ.. మిగిలిన వాటి విషయంలో ఇప్పటికీ మీనమేషాలు లెక్కిస్తున్నారు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, టీపీసీసీ చీఫ్ మహేశ్ తరచూ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఇలా వెళ్లిన ప్రతిసారి కూడా క్యాబినెట్ విస్తరణ అంటూ ప్రచారం జరుగుతూనే ఉంది. ఇక ఓ 15 రోజుల క్రితం అయితే.. ఉగాది ముందే విస్తరణ అని.. తేదీ కూడా ప్రకటించేశారు. అలాగే వీరికే పదవులు అంటూ జోరుగా ప్రచారం కూడా జరిగింది. ఇప్పుడు ఆ తేదీ కూడా దాటి పది రోజులైంది. అయినా సరే.. మంత్రివర్గ విస్తరణపై ఉలుకు పలుకు లేదు. ఏఐసీసీ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్, డీప్యూటీ సీఎం భట్టీ గుజరాత్ వెళ్లారు. వీరితో టీపీసీసీ ప్రతినిధులు కూడా అహ్మదాబాద్‌లోనే ఉన్నారు. వచ్చిన తర్వాత మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని కొందరు.. అంత లేదు.. ఈ నెలాఖరు వరకు అలా అంటూనే ఉంటారని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ అంశం.. ఇప్పుడు ఓ జోక్‌లా మారిపోయిందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.




