నేరాలు చేసిన ప్రజా ప్రతినిధులు పదవుల్లో ఉండటంపై ఎన్నో ఆరోపణలు మనం వింటూనే ఉంటాం. నేరం చేసిన సామాన్యుడుని సమాజం దోషిగా చూసినప్పుడు, ప్రజా ప్రతినిధులు పదవుల్లో ఎందుకు ఉండాలనే ప్రశ్నలు వినపడుతూ ఉంటాయి. వీటికి చట్టంతో సమాధానం చెప్పేందుకు కేంద్రం సిద్దమైంది. పార్లమెంట్ సమావేశాల్లో కీలక బిల్లులు ప్రవేశపెట్టనుంది. తీవ్రమైన నేరారోపణలపై అరెస్టు అయిన లేదా నిర్బంధించబడిన ప్రజా ప్రతినిధులను పదవుల నుండి తొలగించేలా కొత్త బిల్లును రూపొందించారు.
Also Read : బ్రేకింగ్: సిఎంకు చెంప దెబ్బ.. ఢిల్లీలో సంచలనం..!
ప్రతిపాదిత చట్టం ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన మంత్రులకు వర్తిస్తుంది. ఈ బిల్లుతో పాటు మరో రెండు బిల్లులు ప్రవేశ పెడతారు. కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ సవరణ బిల్లు 2025, రాజ్యాంగ 130వ సవరణ బిల్లు 2025, జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు 2025 లను ప్రవేశ పెడతారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ తీర్మానాన్ని లోక్‌సభలో ప్రవేశపెడతారు. ఇప్పటివరకు ఉన్న చట్టం ప్రకారం దోషులుగా ప్రకటించిన ప్రజా ప్రతినిధులను మాత్రమే పదవుల నుండి తొలగించవచ్చు.
Also Read : వాళ్ళను చంద్రబాబు వదలరు.. అసెంబ్లీలో కొత్త చట్టం
కానీ ప్రతిపాదిత చట్టం ప్రకారం, ప్రధానమంత్రి, ఏ కేంద్ర మంత్రి అయినా, రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, మంత్రులు అరెస్టు అయి, వరుసగా 30 రోజులు కస్టడీలో ఉంటే వారు 31వ రోజున రాజీనామా చేయాలి లేదా తొలగించాల్సి ఉంటుంది. ప్రభుత్వం సజావుగా పని చేసేందుకు గానూ, ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు అరెస్టుకు ముందే రాజీనామా చేస్తున్నారు. అయితే, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన అరవింద్ కేజ్రీవాల్ గత సంవత్సరం ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్టయిన తర్వాత దాదాపు ఆరు నెలల పాటు జైలు శిక్ష అనుభవించి ఢిల్లీ ప్రభుత్వాన్ని నడిపించారు.