మెట్రో రైలు ప్రాజెక్టు.. ప్రజలకు సుఖమైన ప్రయాణం అందించేందుకు నిర్మించారు. ఇప్పటికే దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో మెట్రో రైళ్లు పరుగులు పెడుతున్నాయి. త్వరలోనే విజయవాడ, విశాఖలో కూడా మెట్రో రైలు పరుగులు పెట్టేలా ఏపీ ప్రభుత్వం కేంద్రం సహకారంతో అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఢిల్లీ, ముంబై, కొల్‌కతా. నాగ్ పూర్, జైపూర్, బెంగళూరు, హైదరాబాద్ మెట్రో రైళ్లు పరుగులు పెడుతున్నాయి. వీటిల్లో హైదరాబాద్ మెట్రోకు అత్యంత ఆదరణ లభించింది.
Also Read : ప్రతిపక్ష హోదాపై చర్చ.. ఇదేం నాయకత్వం..!
ఇప్పటికే 3 ప్రధానా మార్గాల్లో హైదరాబాద్ మెట్రో రైలు పరుగులు పెడుతోంది. బ్లూ లైన్ మెట్రో రాయదుర్గం నుంచి పీపుల్స్ గార్డెన్ వరకు, రెడ్ లైన్ మియాపూర్ నుంచి ఎల్‌బీ నగర్ వరకు, గ్రీన్ లైన్ ఎంజీ బస్టాండ్ నుండి ఫలక్‌నుమా వరకు నడుస్తోంది. త్వరలో రెడ్ లైన్‌ను బీహెచ్ఈఎల్ వైపు, హయత్ నగర్ వరకు పొడిగించేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీనితో పాటు నాగోల్ నుంచి ఎల్‌బీ నగర్ మీదుగా శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు కొత్త మెట్రో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది కూడా. మెట్రో రెండో దశలో భాగంగా ఈ మార్గం ప్రతిపాదించబడింది. ఈ మెట్రో మార్గం హైదరాబాద్ నగరంలోని ఏ వైపు నుండి అయినా ప్రయాణీకులను విమానాశ్రయానికి అనుసంధానం చేస్తుంది.
ఇప్పటి వరకు హైదరాబాద్ మెట్రోను ఎల్ అండ్ టీ సంస్థ నిర్వహిస్తోంది. హైదరాబాద్ మెట్రోకు అనూహ్య స్పందన వచ్చింది. దాదాపు అన్ని రైళ్లు కిటకిటలాడుతున్నాయి. అయితే గత కేసీఆర్ ప్రభుత్వం చేసిన తప్పుతో హైదరాబాద్ మెట్రో సంస్థ పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది. ప్రభుత్వం సకాలంలో బకాయిలు చెల్లించకపోవడంతో ఎల్ అండ్ టీ సంస్థకు హైదరాబాద్ మెట్రో పెద్ద గుదిబండలా మారింది. దీంతో మెట్రో రైలు నడిపే పరిస్థితిలో ఎల్ అండ్ టీ ప్రతినిధులు వెల్లడించారు కూడా. దీనితో పాటు ఫేజ్ 4 మా వల్ల కాదని చేతులెత్తేశారు.
దీంతో రంగంలోకి దిగిన రేవంత్ సర్కార్.. ఎల్ అండ్ టీ సంస్థ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపింది. హైదరాబాద్ మెట్రో రైలును ప్రభుత్వమే నడిపేందుకు అంగీకరించింది. దీంతో ఎల్ అండ్ టీ కంపెనీ హైదరాబాద్ మెట్రో నుంచి బయట పడింది. మొత్తం రూ.13000 కోట్ల అప్పును రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నట్లు ప్రకటించారు. రూ.5,900 కోట్ల ఎల్ అండ్ టీ వాటాను రూ.2000 కోట్లకే ప్రభుత్వానికి అమ్మేసింది. మెట్రోకి కేసీఆర్ ఇస్తానని హామీ ఇచ్చిన రూ.3000 కోట్లు ప్రభుత్వం రద్దు చేసింది. లీజుకు మాత్రమే వాడుకొనే అవకాశం ఉన్న 260 ఎకరాలను ఎల్ అండ్ టీ సంస్థ ప్రభుత్వ పరం చేసింది. ఆ భూములను 30 ఏళ్లు ఆగకుండా ఇప్పుడే ప్రభుత్వం అమ్ముకోవచ్చు. అంటే సుమారు రూ.26,000 కోట్లు ప్రభుత్వ ఖజానాకు జమ అవుతాయి.
Also Read : లోకేష్ సాయం.. పార్టీ నేతల్లో భిన్నాభిప్రాయాలు..!
ఎల్ అండ్ టీ సీఎండీ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డితో ఒప్పందం కుదుర్చుకున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఈ డీల్ ఓకే చేశారు. కేవలం ఓ రియల్టర్ మాదిరిగా చర్చలు జరిపి డీల్ సెట్ చేసుకున్నారనే మాట వినిపిస్తోంది. ఇదే సమయంలో కేసీఆర్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలపై కూడా ఇప్పుడు చర్చ నడుస్తోంది. కోట్లల్లో ఆదాయం వచ్చే అవుటర్ రింగ్ రోడ్‌ను గత కేసీఆర్ ప్రభుత్వం కేవలం రూ.7 వేల కోట్లకు అమ్మేస్తే… రేవంత్ రెడ్డి మాత్రం రూ.10 వేల కోట్లకు పైగా ఉన్న హైదరాబాద్ మెట్రోను కేవలం రూ.2 వేల కోట్లకే ప్రభుత్వం ఖాతాలో వేశారని మార్కెట్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇంత తక్కువ ధరకు అంత ఖరీదైన సెటిల్‌మెంట్ చేయడంపైన నిజంగా రియల్టరే.. అనే మాట వినిపిస్తోంది.