పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ – పాకిస్తాన్ దేశాల మధ్య వాతావరణం తీవ్ర స్థాయిలో వేడెక్కింది. ఎప్పుడు ఏం జరుగుతుందా అనే ఆసక్తి, ఆందోళన రెండు దేశాల్లో నెలకొన్నాయి. ఆ దాడికి ప్రతీకారంగా భారత్ అదే రేంజ్ లో సమాధానం ఇచ్చింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ భూభాగంలో ఉగ్రవాద స్థావరాలను పేల్చేసింది. ఇక తాజాగా దీనిపై కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజనాథ్ సింగ్ ఆసక్తికర కామెంట్స్ చేసారు. రెండు రోజుల అధికారిక పర్యటన కోసం రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం మొరాకోకు చేరుకున్నారు.
Also Read : పెళ్లి కూతురులా ముస్తాబైన బెజవాడ..!
అక్కడ మాట్లాడిన రాజనాథ్.. ఆపరేషన్ సిందూర్ ను కేవలం తాత్కాలికంగా మాత్రమే నిలిపామని, పార్ట్ 2 అనేది పాకిస్తాన్ ప్రవర్తనపై ఆధారపడి ఉంటుందని అన్నారు. పహల్గాం ఉగ్రదాడి బాధ్యులను మాత్రమే ఆపరేషన్ సిందూర్ లో టార్గెట్ చేసామని, పౌరులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దాడి చేసామని కామెంట్ చేసారు. ఉగ్రవాదులు.. భారత ప్రజల మతం చూసి దాడి చేసారని, కానీ పాకిస్తాన్ పై తాము దాడి చేసినప్పుడు మతాలు చూడలేదని, ఉగ్రవాదులను నాశనం చేయడమే లక్ష్యంగా దాడి చేశామన్నారు.
Also Read : బెజవాడ బూడిదపై ప్రభుత్వం క్లారిటీ.. గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు..!
ఆపరేషన్ సిందూర్ కు ఇది కేవలం తాత్కాలిక విరామం మాత్రమే అని క్లారిటీ ఇచ్చారు రాజనాథ్. ఆపరేషన్ సిందూర్ కు ముందు తాను ఆర్మీ చీఫ్ తో మాట్లాడానని, ఇప్పటికిప్పుడు ప్రభుత్వం ఏదైనా ఆపరేషన్ చేయాలి అనుకుంటే, మీరు సిద్దంగా ఉన్నారా అని ప్రశ్నించాను అని, తాము సిద్దంగా ఉన్నట్టు ఆర్మీ చీఫ్ వెల్లడించారు అని రాజనాథ్ గుర్తు చేసుకున్నారు. ఇక పీఓకే గురించి మాట్లాడిన మంత్రి, పీఓకే భారత్ దే అని, దాని కోసం పాకిస్తాన్ తో యుద్ధం చేయాల్సిన అవసరం లేదన్నారు. సమయానికి భారత్ వశం అవుతుందని స్పష్టం చేసారు.