రాజు గారు.. మీ దూకుడుకు కాస్త బ్రేకులు వేయండి సార్.. ఈ మాట ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో, కూటమి ప్రభుత్వంలో బాగా వినిపిస్తోంది. రఘురామ కృష్ణరాజు.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ట్రిపుల్ ఆర్ అంటూ ముద్దుగా పిలుచుకునే రఘురామ.. ఐదేళ్ల జగన్ పాలనలో నాలుగేళ్ల పాటు ఒంటరి పోరాటం చేశారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నరసాపురం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన రఘురామ.. 31 వేల 909 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అయితే తొలి నాళ్లలో జగన్‌కు సన్నిహితంగానే ఉన్న రఘురామ.. ఓ బహిరంగ సమావేశంలో “బొచ్చులో నాయకత్వం” అంటూ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారం రేపాయి. ఇక నాటి నుంచి రఘురామను వైసీపీ టార్గెట్ చేసింది.
నాలుగేళ్ల పాటు నియోజకవర్గంలో కాలు పెట్టేందుకు కూడా రఘురామకు జగన్ సర్కార్ అవకాశం ఇవ్వలేదు. చివరికి ప్రధాన భీమవరం పర్యటనకు వచ్చేందుకు ప్రయత్నం చేసిన రఘురామ.. బేగంపేటలో రైలు ఎక్కి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లోనే దిగిపోయారంటే నాటి జగన్ సర్కార్ ఏ రేంజ్‌లో వ్యవహరించిందో అర్థం చేసుకోవచ్చు. ఇక జగన్ సర్కార్‌పై ప్రతి రోజు మధ్యాహ్నం రచ్చబండ పేరుతో లైవ్ వీడియో రిలీజ్ చేశారు ట్రిపుల్ ఆర్. దీంతో రఘురామను టార్గెట్ చేసిన వైసీపీ సర్కార్.. ఒకదశలో పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయాలని ఏకంగా స్పీకర్‌కే ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత రఘురామపై రాజద్రోహం కేసు పెట్టి.. ఆయన పుట్టిన రోజు నాడే అరెస్టు చేసి.. గుంటూరు సీఐడీ కార్యాలయంలో కస్టోడియల్ టార్చర్ చేశారనేది ప్రధాన ఆరోపణ. ఈ కస్టోడియల్ టార్చర్‌పై ఇప్పటికే విచారణ జరుగుతోంది.
Also Read : నాపై కుట్ర జరుగుతోంది.. బాంబు పేల్చిన శివాజీ
కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే.. రఘురామను కస్టోడియల్ టార్చర్ చేసిన ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారి ఎదుట సునీల్ కుమార్ కూడా హాజరయ్యారు. అయితే సునీల్‌ను ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదు అనేది రఘురామ ప్రధాన ప్రశ్న. సరిగ్గా ఎన్నికల ముందు టీడీపీలో చేరిన రఘురామకు ఉండి అసెంబ్లీ టికెట్ ఇచ్చారు చంద్రబాబు. గెలిచిన తర్వాత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పటికీ రఘురామ తీరులో మాత్రం మార్పు రాలేదు అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో వినిపిస్తున్న మాట.
రఘురామపై సీబీఐ విచారణకు సుప్రీం కోర్టు ఆదేశించిన తర్వాత సునీల్ కుమార్ సోషల్ మీడియా వేదికగా ప్రతి రోజు రఘురామను టార్గెట్ చేస్తూ వీడియోలు, పోస్టులు పెడుతున్నారు. దీంతో అసహనానికి గురైన రఘురామ.. తను కూడా వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. ఈ సమయంలో రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న రఘురామ.. కొన్ని ఘాటు పదాలు అనేస్తున్నారు. వైఎస్ జగన్ పైన నోరు జారిన రఘురామ.. మీడియా వ్యక్తులను కూడా కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. వాస్తవానికి టీడీపీకి కొన్ని నియమాలున్నాయి. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యర్థులను, మీడియా వ్యక్తులను అగౌరవ పరిచేలా వ్యాఖ్యలు చేయకూడదు అనేది టీడీపీ నియమం. మీడియాకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే పార్టీల్లో టీడీపీ ముందు వరుసలో ఉంటుంది కూడా. అలాంటి టీడీపీలో ఉన్న రఘురామ.. మీడియపైనే నోరు జారటం కొందరికి ఏ మాత్రం రుచించటం లేదు.
Also Read : అజారుద్దీన్ కు పదవీ గండం..? గవర్నర్ షాక్ ఇస్తారా..?
తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతలు రఘురామ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. రఘురామ 9 ఏళ్ల కాలంలో 5 సార్లు పార్టీలు మారారని.. వైసీపీ, బీజేపీ నుంచి టీడీపీలో చేరారని గుర్తు చేస్తున్నారు. రఘురామకు ఉండి టికెట్ ఇచ్చిన చంద్రబాబు.. డిప్యూటీ స్పీకర్‌ను కూడా చేశారని గుర్తు చేస్తున్నారు. సునీల్ కుమార్ వ్యవహారంలో దూకుడుగా వ్యవహరిస్తే ఇబ్బందులు వస్తాయని.. అందుకే సునీల్ తప్పించుకునేందుకు ఎలాంటి అవకాశం లేకుండా జాగ్రత్తగా కేసు డీల్ చేస్తున్నారనే విషయం రఘురామ గుర్తించాలని కోరుతున్నారు. ఆవేశంతో పని చేస్తే.. చంద్రబాబుకు, జగన్‌కు తేడా ఏముంటుందన్న నేతలు.. ఈ విషయంలో రఘురామ కూడా కాస్త దూకుడు తగ్గిస్తే బాగుంటుందని హితవు పలుకుతున్నారు.

