“మహాప్రభు .. తమరు కొత్తగా ప్రవేశపెడుతున్న బిల్లు వెనుక, మాజీ ముఖ్యమంత్రి కానీ, ప్రస్తుత ముఖ్యమంత్రి కానీ తమ మాట వినకపోతే అరెస్టు చేసి, “మీ మాట వినే ఉపముఖ్యమంత్రిని” ముఖ్యమంత్రి చేసే కుట్ర ఏమైనా ఉందా???” అంటూ ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్.. ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి చేశారు ప్రకాష్ రాజ్. తాజాగా కేంద్రం తీసుకువచ్చిన బిల్లు గురించి ప్రకాష్ రాజ్ తనదైన శైలిలో చేసిన వ్యాఖ్యలు.. హాట్ టాపిక్‌గా మారాయి.
Also Read : మారన్ ను ముంచిన కూలీ.. లాభాలు కష్టమేనా..?
5 ఏళ్ల శిక్ష పడే సెక్షన్ల కింద కేసు నమోదై 30 రోజుల పాటు జైలులో ఉంటే.. ప్రధాని, కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి, మంత్రి… ఎవరైనా సరే.. తమ పదవిని 31వ రోజు కోల్పోతారు. ఈ బిల్లును కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లుపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. బిల్లు ప్రతులను చింపేసి సభలోనే అమిత్ షా పైకి విసిరేశారు. ఈ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందుతుందా లేదా అనేది ఇప్పుడు చూడాల్సి ఉంది.
అయితే ఈ బిల్లును ప్రస్తావిస్తూ ప్రకాష్ రాజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తమ మాట వినకపోతే.. మాజీ, ప్రస్తుత ముఖ్యమంత్రిని అరెస్టు చేస్తారా.. అని వ్యాఖ్యానించారు. ఆ స్థానంలో మాట వినే ఉప ముఖ్యమంత్రిని సీఎం చేస్తారా అని వ్యంగ్యంగా కామెంట్ చేశారు. సాధారణంగా ఇంగ్లీష్‌లో కామెంట్ చేసే ప్రకాష్ రాజ్.. ఈ పోస్ట్ మాత్రం తెలుగులో రాయడమే ఇప్పుడు చర్చకు కారణమైంది. ప్రధానంగా ఏపీ రాజకీయాల గురించే ఈ కామెంట్ చేశారనే మాట బాగా వినిపిస్తోంది.
Also Read : బ్రేకింగ్: వైసీపీకి ఊహించని షాక్.. కాంగ్రెస్ లోకి ఎంపీ..?
ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడి ఏడాది దాటింది. ఇప్పటి వరకు 3 పార్టీల మధ్య ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. తాజాగా స్త్రీ శక్తి పథకం ప్రారంభోత్సవానికి 3 పార్టీల నేతలు పాల్గొన్నారు. 3 పార్టీల ప్రయాణం ఇలాగే సాగితే.. మళ్లీ ఎన్నికల వరకు ఎలాంటి ప్రమాదం లేదు. అయితే 2014-19 మధ్య కాలంలో 3 పార్టీల మధ్య విబేధాలు తలెత్తాయి. దీంతో చివరి ఏడాదిలో 3 పార్టీలు విడిపోయాయి. కాబట్టే 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచిందనేది బహిరంగ రహస్యం. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లు ఏపీ రాజకీయాలపై ప్రభావం చూపిస్తుందా అనే అనుమానం ఉంది.
భవిష్యత్తులో చంద్రబాబు కూడా తమ మాట వినకపోతే.. ఆయనపై అభియోగాలు మోపి.. జైలుకు పంపించి.. ఆయన స్థానంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను సీఎం చేస్తారేమో అని ప్రకాష్ రాజ్ చెప్పకనే చెప్పినట్లున్నారు. వాస్తవానికి దక్షిణ భారతంలో ఎలాగైనా సరే అధికారం దక్కించుకోవాలనేది బీజేపీ వ్యూహం ఇప్పటి వరకు కేవలం కర్ణాటకలో మాత్రమే బీజేపీ సర్కార్ ఏర్పడింది. తెలంగాణలో ఆ కల తీరలేదు. ఏపీలో మాత్రం టీడీపీ, జనసేనతో కలిసే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. ఎప్పటికైనా ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనేది బీజేపీ కల. ఆ కల నెరవేర్చుకునేందుకు జనసేన పార్టీతో పొత్తు కొనసాగిస్తోందనేది విశ్లేషకుల మాట. తాజా బిల్లు ద్వారా తమ కోరిక తీర్చుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోందా అని ప్రకాష్ రాజ్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.