గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితి పై తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు క్షీణిస్తుందని.. అయినా సరే ప్రభుత్వం మానవత్వం లేకుండా వ్యవహరిస్తోంది అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వంశీని పరామర్శించిన నాని అనంతరం మీడియాతో మాట్లాడారు. వంశీ విషయంలో కనీసం ప్రభుత్వ వైద్యులు మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని, ఓఆర్ఎస్ తాగితే సరిపోతుందని చెప్తున్నారంటూ నాని మండిపడ్డారు.
Also Read : కవిత కోపానికి కారణం ఆయనేనా..?
బెయిల్ వస్తే కేసులు మీద కేసులు పెట్టి వంశీని వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఊపిరితిత్తుల సమస్య ఉన్నా సరే దానికి సంబంధించిన పరీక్షలను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించడం లేదని నానీ అసహనం వ్యక్తం చేశారు. వంశీకి ఏదైనా జరిగితే అది ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందంటూ ఆయన హెచ్చరించారు. వంశీకి పార్టీ మొత్తం అండగా ఉందని.. భవిష్యత్తులో కూడా వంశీ కుటుంబానికి అండగా నిలబడుతుందని స్పష్టం చేశారు. నాడు రంగా హత్య తెలుగుదేశం పార్టీ ఓటమికి కారణమైందని నేడు వంశీ మరణం గనక జరిగితే అది తెలుగుదేశం పార్టీ పతనమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read : తండ్రికి ఉన్న దమ్ము లేదా..? అంత భయమెందుకు జగన్..?
వాస్తవానికి గత కొన్ని రోజులుగా వంశీ ఆరోగ్యంగా కాస్త ఇబ్బంది పడుతున్నారు. ఆయనకు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పలు పరీక్షలు కూడా నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం కంకిపాడు పోలీస్ స్టేషన్లో వంశీ కస్టడీలో ఉన్నారు. పోలీస్ స్టేషన్ లో ఆయన శ్వాస తీసుకుంటూ ఇబ్బంది పడుతున్న విషయాన్ని గుర్తించిన పోలీసులు.. వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక వంశీ విషయంలో పేర్ని నాని వ్యాఖ్యలు చూసిన కొంతమంది.. వంశీకి భద్రత పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. వంశి ఆరోగ్య పరిస్థితి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూనే ఆయన వ్యక్తిగత భద్రత విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని పరోక్ష హెచ్చరికలు చేస్తున్నారు పలువురు.