ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రాజధాని పరిధిలో వేల కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయి. 2027 జూన్ నాటికి అమరావతి తొలి దశ నిర్మాణాలు పూర్తి చేయాలనే లక్యంతో ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ఇప్పటికే అమరావతిలో కీలకమైన రహదారుల నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావస్తున్నాయి. అండర్ గ్రౌండ్ కేబుల్, డ్రైనేజ్ పనులు నిరంతరం జరుగుతున్నాయి. ఇప్పటికే రైతులకు ప్లాట్ల కేటాయింపు ప్రక్రియ కూడా ప్రభుత్వం చేపట్టింది. ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేసేలా ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
Also Read : అనంతబాబును కాపాడుతున్నది ఎవరూ..?
అమరావతిలో మంత్రుల క్వార్టర్స్ పనులతో పాటు హైకోర్టు న్యాయమూర్తుల అధికారిక భవనాల నిర్మాణం కూడా జరుగుతోంది. వీటితో పాటు ఐఏఎస్, ఏఐఎస్ ఉద్యోగుల నివాస భవనాల పనులు కూడా తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటికే సీఆర్‌డీఏ కార్యాలయం ప్రారంభమైంది. త్వరలో మరిన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా అమరావతి నుంచే కార్యకలాపాలు ప్రారంభిస్తాయని మంత్రి నారాయణ వెల్లడించారు. వీటితో పాటు అమరావతికి వచ్చే అన్ని మార్గాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని అమరావతి చుట్టూ అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.
అమరావతి చుట్టూ 190 కిలోమీటర్ల పొడవైన అవుటర్ రింగ్ రోడ్డు నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి సంబంధించిన డీపీఆర్‌ను ఇప్పటికే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకు సమర్పించారు. అవుటర్ పరిధిలోని అన్ని జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. జిల్లాల వారీగా భూసేకరణ ప్రక్రియ నోటీసులు జారీ అయ్యాయి. దీంతో ఆయా జిల్లాల అధికారులు భూ సేకరణ ప్రక్రియ ప్రారంభించారు. #ORR నిర్మాణానికి సంబంధించిన ప్రభుత్వ భూమిని ఇప్పటికే #NHAI కు కేటాయించారు. 3 నెలల్లో భూ కేటాయింపు ప్రక్రియ పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు పని చేస్తున్నారు. భూ సేకరణ పూర్తయిన వెంటనే ఓఆర్ఆర్ నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయి.
Also Read : నాటకాల రాయుళ్లది రోజుకో రాజకీయం
అమరావతి పరిధిలో 97 కిలోమీటర్ల ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులకు అమరావతి మాస్టర్ ప్లాన్‌లో భాగంగా 2018లోనే గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. 67 కిలోమీటర్ల ఫేజ్ -1 డీపీఆర్ ఇప్పటికే పూర్తయ్యింది. #IRR అలైన్‌మెంట్ 2018 నుండి చట్టబద్ధంగా అడ్డంకులు ఎదుర్కొంటోంది. దీనిని దశలవారీగా పరిష్కరిస్తున్నారు. అమరావతి కనెక్టివిటీ అనేది కేవలం కాగితాలకు మాత్రమే పరిమితం కాలేదని.. ఇది క్షేత్రస్థాయిలో శరవేగంగా అభివృద్ధి చెందుతోందని మంత్రి నారాయణ తెలిపారు. ఓఆర్ఆర్, ఐఆర్ఆర్ అనేది అమరావతి అభివృద్ధిలో కీలక పాత్ర పోషించనున్నాయని మంత్రి తెలిపారు.

