ఏపీలో ఆపరేషన్ కొల్లేరు మరోసారి వార్తల్లోకి ఎక్కింది. కొల్లేరు సరస్సులో ఆక్రమణల తొలగింపును 3 నెలల్లో ప్రారంభిస్తామని ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. అసలు కొల్లేరులో ఆక్రమణల తొలగింపు సాధ్యమేనా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఒకప్పుడు స్వదేశీ, విదేశీ పక్షులతో కళకళలాడిన కొల్లేరు… వ్యాపారుల దురాశతో కుదించుకుపోయింది. ఎక్కడ పడితే అక్కడ చేపలు, రొయ్యల చెరువులు సాగు చేయడంతో మంచినీటి సరస్సు కాస్తా ఇప్పుడు మురికి కూపంగా మారిపోయింది. ఆక్రమణల కారణంగా కొల్లేరులోకి వచ్చే కాలువల్లో నీరు నిలిచిపోవడంతో భారీ వర్షం కురిస్తే చాలు.. సమీప ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. దీనిపై పర్యావరణ వేత్తలు ఎన్నిసార్లు హెచ్చరించినా సరే… ఆక్రమణల తొలగింపు మాత్రం సాధ్యం కావటం లేదు.
Also Read : వెంకన్న ఇలాకాలో నకిలీలు..!
గతంలో సుప్రీం కోర్టు హెచ్చరికలతో 2005లో నాటి వైఎస్ ప్రభుత్వం ఆపరేషన్ కొల్లేరు పేరుతో భారీ ఎత్తున ఆక్రమణలను తొలగించింది కూడా. అప్పట్లో దీనిపై కాంగ్రెస్ పార్టీ నేతలే తీవ్ర విమర్శలు చేస్తూ అభ్యంతరం చెప్పినా సరే… ప్రభుత్వం మాత్రం వెనుకడుగు వేయలేదు. అయితే సరిగ్గా ఐదేళ్లు కూడా గడవక ముందే కాంటూరు కుదింపు అంశంపై కొల్లేరు వాసులకు కాంగ్రెస్ నేతలు హామీలివ్వడంతో మళ్లీ ఆక్రమణలు మొదలయ్యాయి. దీంతో కొల్లేరు సరస్సు పూర్తిగా కుంచించుకుపోయింది. వాస్తవానికి తొలి నుంచి కొల్లేరు సరిహద్దుల విషయంలో తొలి నుంచి వివాదం నడుస్తోంది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది. దీంతో రంగంలోకి దిగిన ఏపీ ప్రభుత్వం.. సుప్రీం సూచనల మేరకు చర్యలు చేపట్టింది. వాటి ఆధారంగా 3 నెలల్లో కొల్లేరు సరిహద్దులను తేలుస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
Also Read : అధ్యక్ష పదవి కోసం ఆ ఇద్దరి మధ్య పోటీ..!
గతేడాది అక్టోబర్ నెల నుంచి ఇప్పటి వరకు దాదాపు 5 వేల ఆక్రమణలు కొల్లేరులో తొలగించినట్లు సుప్రీంకోర్టుకు ఇచ్చిన నివేదికలో ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. త్వరలోనే కొల్లేరు సరిహద్దులను లెక్క తేలుస్తామని ఇచ్చిన హామీతో సంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు కేసు విచారణను మార్చి 19కు వాయిదా వేసింది. అయితే ఇక్కడే అసలు సమస్య ఎదురవుతోంది. కొల్లేరులో చేపలు, రొయ్యల చెరువులు సాగు చేసే వారిలో దాదాపు 80 శాతం మంది రాజకీయపార్టీలకు చెందిన వారే. భీమవరం, ఉండి, కైకలూరు, ఏలూరు, ఉంగుటూరు నియోజకవర్గాల్లో కొల్లేరు లంక గ్రామాలున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో ఈ లంక గ్రామాల ఓటర్లే కీలకం. ఈ నేపథ్యంలో వీరిని కాదని అక్కడ ముందుకు వెళ్లటం కష్టమనేది బహిరంగ రహస్యం. కాబట్టి ఆపరేషన్ కొల్లేరు మరోసారి సాధ్యమేనా అనే ప్రశ్న ఇప్పుడు బలంగా వినిపిస్తోంది.