ఆంధ్రప్రదేశ్ లో నూతన ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయింది. ఎన్డియే ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకోవడంతో గురువారం కూటమి పార్టీలు సంబురాలు చేసుకుంటున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త మంత్రులు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. తొలిసారి ప్రభుత్వంలోకి వచ్చిన మంత్రులకు సిఎం చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. కొందరు సీనియర్ నేతలు కూడా ఈసారి కీలక పదవులు చేపట్టడంతో పాలన ముందు తడబడినా ఆ తర్వాత మాత్రం కాస్త దూకుడుగా వెళ్తోంది అనే చెప్పాలి.
Also Read : ట్రంప్ కు చుక్కలు చూపిస్తున్న గవర్నర్
ఇదిలా ఉంచితే.. ఇప్పుడు కొత్త మంత్రులను నియోజకవర్గాల్లో ఉన్న స్థానిక నాయకత్వం ఇబ్బందులు పెడుతోంది. గొంతెమ్మ కోర్కెలతో చుక్కలు చూపిస్తోంది నాయకత్వం. ముఖ్యంగా మండల స్థాయి నాయకులు కొందరు విజయవాడలో తిష్ట వేసి.. మంత్రుల ముందు కోరికల చిట్టాను విప్పి.. వాటిని నెరవేర్చుకునే వరకు వేధిస్తున్నారట. పార్టీలో సీనియర్ నేతలు అయినా.. కొత్తగా వచ్చిన వారికి అయినా ఈ వేధింపులు తప్పడం లేదు. కార్పోరేషన్ పదవులు, దేవాలయ పదవులు, డీసీసీబీ చైర్మన్ పదవులు ఇలా ఒక్కొక్కరు ఒక్కో డిమాండ్ తో వస్తున్నారు.
Also Read : కూటమి.. పొత్తు ధర్మం పాటిస్తారా లేదా..?
ఏదోక పదవితో వారికి న్యాయం చేసినా.. కాంట్రాక్ట్ లు, వ్యక్తిగత పనులు ఇలా ఒక్కొక్క డిమాండ్ తో చుక్కలు చూపించేస్తున్నారట. ఈ విషయంలో ఉత్తరాంధ్రకు చెందిన ఓ మంత్రి, రాయలసీమ ప్రాంతానికి చెందిన మరో ఇద్దరు మంత్రులు బహిరంగంగానే అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. బదిలీల విషయంలో కూడా వారే జోక్యం చేసుకోవడంతో మంత్రులలో అసహనం పెరిగిపోతోంది. పార్టీ కోసం కష్టపడ్డాం అనే కారణంతో వారు పదే పదే మంత్రుల వద్దకు రావడం, మంత్రుల పేషీల్లో తిష్ట వేయడం వంటివి జరుగుతున్నాయట. సచివాలయానికి, క్యాంప్ ఆఫీసులకు పదే పదే రావడమే కాకుండా తమ మనుషులను కూడా పంపిస్తూ డిమాండ్ లు చేయడం గమనార్హం. మూడు పార్టీల మంత్రులూ ఈ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.




