తమిళనాడు రాజకీయాల్లో పొత్తులు పొడుస్తున్నాయి. దాదాపు మూడు నెలల నుంచి పొత్తుల గురించి ఎన్నో ప్రచారాలు జరిగాయి. ఇక ఇటీవల అన్నాడీఎంకే, విజయ నేతృత్వంలోని టీవీకే పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్ళబోతున్నాయి అనే క్లారిటీ వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ ఫార్ములాను తమిళనాడులో కూడా అమలు చేసేందుకు ఎన్డీఏ సిద్ధమైనట్లు వార్తలు వచ్చాయి. ఇక విజయ్ కూడా ఈ వార్తలను ఖండించకపోవడంతో దాదాపుగా అధికారిక ప్రకటన కూడా త్వరలోనే వస్తుందని అందరూ భావిస్తున్నారు. ప్రస్తుతం సీట్ల సర్దుబాటు గురించి చర్చలు మొదలైనట్లు కూడా తెలుస్తోంది.
Also Read : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. రెబల్స్ తలనొప్పి..!
కోయంబత్తూర్, మధురై, సేలం, ఈరోడ్, క్రిష్ణగిరి సహా పలు జిల్లాల్లో విజయ్ మెజారిటీ సీట్లు అడుగుతున్నట్లు కూడా తమిళ మీడియాలో ప్రచారం జరుగుతుంది. మొత్తం విజయ్ కి 52 సీట్లు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇక ఇప్పుడు మరో ఆఫర్ కూడా విజయ్ కు ఇచ్చినట్లు సమాచారం. ఉప ముఖ్యమంత్రి పదవిని ఆయనకు ఆఫర్ చేశారని తమిళ రాజకీయ వర్గాలు అంటున్నాయి. అలాగే నాలుగు మంత్రి పదవులు కూడా ఆయన పార్టీకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. త్వరలోనే మాజీ ముఖ్యమంత్రి పలని స్వామితో ఆయన భేటీ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి.
Also Read : బీహార్ పై బిజెపి ఫోకస్.. సంచలన ప్రకటన రానుందా..?
ఇటీవల కుమారపాలెంలో నిర్వహించిన సభలో పలని స్వామి ఈ అంశం గురించి మాట్లాడారు. తమ విజయాన్ని ఎవరు అడ్డుకోలేరు అంటూ ధీమా వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యల తర్వాత తమిళ మీడియాలో పొత్తు గురించి హడావుడి మొదలైంది. అటు డీఎంకే కూడా పొత్తును అడ్డుకోవడానికి తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కరూర్ ఘటన తర్వాత డిఎంకె విజయ్ విషయంలో సీరియస్ గానే ఫోకస్ పెట్టి విమర్శలు చేస్తోంది. ఈ సమయంలో అన్నాడీఎంకే అండగా నిలబడటాన్ని విజయ్ అభిమానులు కూడా స్వాగతిస్తున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే సంక్రాంతి తర్వాత పోటీ చేసే సీట్ల అంశం కూడా అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉండవచ్చు.