కొణిదెల నాగేంద్రరావు.. అలియాస్ నాగబాబు.. జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేసిన తర్వాత జరిగిన జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభలోనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ గెలుపు తమ వల్లే అని ఎవరైనా అనుకుంటే.. “అది వాళ్ల ఖర్మ”.. అంటూ నాగబాబు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి కూడా. ఈ విషయంపై టీడీపీ, జనసేన పార్టీల మధ్య వివాదం నడిచింది కూడా. రెండు పార్టీల అభిమానులు సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు కూడా చేసుకున్నారు. అయినా సరే రెండు పార్టీల పెద్దల నుంచి ఈ వివాదానికి చెక్ పెట్టేలా ఎలాంటి ఆదేశాలు రాలేదు. అటు నాగబాబు కూడా తన వ్యాఖ్యల పట్ల ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఇక ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత.. తనకు అవకాశం ఇచ్చిన చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Also Read : ఐపిఎల్ లో హైదరాబాద్ కథ ముగిసిందా..?
ప్రస్తుతం జనసేన పార్టీలో నెంబర్ టూ పొజిషన్‌లో నాదెండ్ల మనోహర్‌తో పాటు నాగబాబు కూడా కొనసాగుతున్నారు. పవన్ కల్యాణ్ అందుబాటులో లేని సమయంలో… పార్టీ నేతలు, కార్యకర్తలు తమ సమస్యలను స్వయంగా నాగబాబుకు వివరిస్తున్నారు. పార్టీ నేతల పనితీరును కూడా నాగబాబు పర్యవేక్షిస్తున్నారు. అయితే ఇకపై నాగబాబు తన కేరాఫ్ అడ్రస్ పూర్తిగా మార్చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం. అయితే ఇకపై నాగబాబు కేరాఫ్ పిఠాపురం అని జనసేన పార్టీ నేతలతో పాటు పొలిటికల్ సర్కిల్‌లో కూడా ప్రస్తుతం వినిపిస్తున్న మాట.
Also Read : బ్రేకింగ్: ఏపీ సిఎంవోలో భారీ మార్పులు..?
వాస్తవానికి పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పవన్ కల్యాణ్ ఎన్నికయ్యారు. అయితే ప్రస్తుతం ఉప ముఖ్యంత్రిగా పవన్ చాలా బిజీగా ఉన్నారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖ వంటి పలు కీలక శాఖలను పవన్ నిర్వహిస్తున్నారు. దీని వల్ల తన సొంత నియోజకవర్గంలో పవన్ పర్యటిస్తున్న సందర్భాలు చాలా తక్కువ. ఇదే సమయంలో పిఠాపురం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే వర్మ దూకుడు పెంచారు. నిత్యం పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ప్రజా సమస్యలను ప్రస్తావిస్తున్నారు. సమస్య పరిష్కారం దిశగా అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు కూడా. ఇదే విషయాన్ని జనసేన పార్టీ చాలా సీరియస్‌గా తీసుకుంది. రాబోయే ఎన్నికలే టార్గెట్‌గా వర్మ అడుగులు వేస్తున్నాడని భావిస్తున్నారు.
Also Read : మిథున్ రెడ్డి ఏం చేయబోతున్నట్టు..?
దీంతో పవన్ బదులుగా నాగబాబు రంగంలోకి దిగారు. ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే పిఠాపురంలో పర్యటించనున్నారు. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రెడీ అవుతున్నారు. అధికారులతో సమీక్షలు చేయనున్నారు. పవన్‌కు రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులున్నారు. పవన్ క్రేజ్ దృష్టిలో పెట్టుకుని ఏ నియోజకవర్గంలో పోటీ చేసిన గెలుస్తారని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో పవన్ పిఠాపురం బదులుగా మరో నియోజకవర్గానికి మారిపోతారని… అదే సమయంలో పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి నాగబాబు దిగుతారని అంతా భావిస్తున్నారు. దీంతో టార్గెట్ 2029 దిశగా నాగబాబు అడుగులు వేస్తున్నారు.