తెలుగు వారి ఆత్మగౌరవం అంటే అందరికీ ఠక్కున గుర్తుకు వచ్చేది నందమూరి తారక రామారావు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అని ఏ ముహుర్తంలో దర్శకరత్న దాసరి నారాయణరావు ముహుర్తం పెట్టారో తెలియదు కానీ… ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు ప్రపంచ నలుమూలలా ఉంటున్న తెలుగు వారు గర్వంగా చెప్పుకునేలా చేసింది. “విశ్వ విఖ్యాత అనే పేరు ఇబ్బందిగా ఉంటుందేమో దాసరి గారు” అని అన్నగారు సున్నితంగా తిరస్కరించేందుకు యత్నించగా.. “ఆ పేరు మీకు తప్ప మరొకరికి వర్తించదు అన్నగారు” అంటూ దాసరి అదే బిరుదును వెండి తెరపై వేశారు. తెలుగు వారు ముద్దుగా అన్నగారు అని పిలుచుకునే ఎన్టీవోడి వందో పుట్టినరోజు అంటే… అది ప్రతి ఇంట్లో పండుగే అనేలా మారిపోయింది. అన్నగారు శత దినోత్సవ వేడుకలను ఏడాది పాటు ఘనంగా నిర్వహించారు తెలుగు తమ్ముళ్లు. ఇక తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ ఏడాది కడప మహానాడు వేదికపై అన్నగారి 101 జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు.
Also Read : వైసీపీ – టీడీపీ మధ్య ప్యాలెస్ వార్..!
తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి జిల్లాలో, మండల కేంద్రంలో, గ్రామంలో అన్నగారి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు టీడీపీ నేతలు సమాయత్తమవుతున్నారు. అలా మహానాడు ముందు మినీ మహానాడు కూడా ఇప్పటికే నిర్వహిస్తున్నారు. అటు అన్న గారి జయంతి వేడుకలను విదేశాల్లో కూడా టీడీపీ అభిమానులతో పాటు తెలుగు వారంతా ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక మే 27వ తేదీ నుంచి 3 రోజుల పాటు కడపలో మహానాడు నిర్వహించేందుకు తెలుగుదేశం పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. దాదాపు 120 ఎకరాల్లో భారీ బహిరంగ సభ ప్లాన్ చేస్తున్నారు. 27, 28 తేదీల్లో పార్టీ ప్రతినిధుల సమావేశాలుంటాయి. అలాగే భవిష్యత్తు కార్యాచరణ కోసం పలు తీర్మానాలు చేయనున్నారు. ఇక మూడో రోజున 29వ తేదీన సుమారు 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు. ఈ వేడుకకు వచ్చే వారి కోసం మెను కూడా భారీగానే సిద్ధం చేశారు.
Also Read : మహిళలకు చంద్రబాబు బంపర్ ఆఫర్.. డేట్ ఫిక్స్..!
ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ కోసం భారీ మెను సిద్ధం చేశారు. ఉదయం టిఫిన్ కోసం ఇడ్లీ, వడ, జీడిపప్పు పొంగల్ తయారు చేయనున్నారు. వీటి కోసం కొబ్బరి పచ్చడి, పప్పుల పచ్చడి, టమోటా చట్నీ, అల్లం పచ్చడితో పాటు సాంబార్, కరివేపాకు కారప్పొడి సిద్ధం చేస్తున్నారు. వీటిని నెయ్యితో వడ్డించనున్నారు. టీ, కాఫీ కూడా ఉంటుంది. ఇక మధ్యాహ్నం భోజనం కోసం భారీ మెను రెడీ చేస్తున్నారు. కాజు బర్ఫీ, మిరపకాయ బజ్జీ, బఘారా రైస్, కొబ్బరి అన్నం, వెజ్ పలావ్, పుల్కా, చపాతీ, సొరకాయ పప్పు, రోటి పచ్చడి, కారప్పొడి, తెల్ల అన్నం, టొమాటో కాజు ముల్లక్కాయ, గుత్తి వంకాయ మసాలా, ఎగ్ మసాలా, కాజు చికెన్ కర్రీ, గోంగూర మటన్, ఉలవచారు, రసం, పెరుగు, పాన్, అప్పడాలు, కేక్, ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్‌తో మొత్తం 22 రకాలను మధ్యాహ్నం భోజనంలో వడ్డించనున్నారు. అబ్బా.. అలాంటి విందు భోజనం ఒకసారి అయినా తినాలనేలా ఐటమ్స్ తయారు చేయిస్తున్నారు. మరి భోజన ప్రియుడి వందేళ్ల పండుగకు ఆ మాత్రం మెనూ ఉండాలి కదా. పూర్తి సాంప్రదాయ వంటకాలతో మాయాబజార్ సినిమాలో వివాహ భోజనంబు… అనే మాటను గుర్తుకు తెచ్చేలా ఐటమ్స్ రెడీ చేస్తున్నారు.