ఉప రాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ ఖడ్ రాజీనామా చేశారు. ఇందుకు ఆయన చెప్పిన కారణం అనారోగ్య సమస్యలు. అయితే ధన్ ఖడ్ రాజీనామాపై ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. వాస్తవానికి ఒక పదవికి రాజీనామా చేయడం పెద్ద విశేషమేమి కాదు. అయితే రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని వంటి పదవుల విషయంలోనే ఈ చర్చ నడుస్తుంది. దేశ ప్రథమ పౌరసత్వం రాష్ట్రపతికే దక్కుతుంది. ఆ తర్వాత స్థానం ఉప రాష్ట్రపతిదే. రాజ్యంగ బద్ధమైన పదవి రాష్ట్రపతి. రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తారు. అలాగే త్రివిధ దళాలకు కూడా రాష్ట్రపతి అధిపతి. ఆ తర్వాత స్థానమే ఉప రాష్ట్రపతి. రాజ్యాంగంలో ని ఆర్టికల్ 67 ఉప రాష్ట్రపతిని నిర్వచిస్తుంది. రాజ్యసభ ఛైర్మన్‌గా కూడా ఉప రాష్ట్రపతి వ్యవహరిస్తారు. పెద్దల సభను కంట్రోల్ చేసేది కూడా ఉప రాష్ట్రపతి మాత్రమే.
Also Read : ఎవరి కొడుకైనా టాలెంట్ ఉండాల్సిందే.. పవన్ సంచలన కామెంట్స్
ఉప రాష్ట్రపతి పదవి కోసం చాలా మంది ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. గతంలో అయితే ఉప రాష్ట్రపతిగా చేసిన తర్వాత వారిని రాష్ట్రపతిని చేశారు నాటి ప్రభుత్వ పెద్దలు. దేశంలోనే రెండో అత్యున్నత స్థానం. కొంతమంది రెండోసారి కూడా ఉప రాష్ట్రపతి పదవి కోసం ప్రయత్నం చేశారు. ఇలాంటి పదవిలో ఉన్న జగదీప్ ధన్ ఖడ్.. రాజీనామాతో అందరికీ షాక్ ఇచ్చారు. ఇంకా చెప్పాలంటే.. 75 ఏళ్ల స్వతంత్ర భారతావని చరిత్రలో పదవికి రాజీనామా చేసిన తొలి ఉప రాష్ట్రపతిగా ధన్ ఖడ్ రికార్డుల్లోకి ఎక్కారు. అసలు ధన్ ఖడ్ రాజీనామా వెనుక కారణాలేమిటి.. అత్యున్నత పదవికి ధన్ ఖడ్ ఎందుకు రాజీనామా చేశారు అనేదే ఇప్పుడు దేశ రాజకీయాల్లో పెద్ద చర్చ.

తన రాజీనామాకు ప్రధానంగా అనారోగ్య కారణాలే అని రాష్ట్రపతికి రాసిన లేఖలో ధన్ ఖడ్ ప్రస్తావించారు. అయితే ఇక్కడే ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వాస్తవానికి ఉప రాష్ట్రపతి పదవిలో ఉన్న వ్యక్తికి, ఎలాంటి పదవి లేని సాధారణ వ్యక్తికి వైద్య సదుపాయాల్లో చాలా తేడా ఉంటుంది. ఉప రాష్ట్రపతి వంటి రాజ్యాంగ బద్ధమైన పదవిలో చిన్న అస్వస్థత వస్తేనే.. అత్యుత్తమ వైద్య బృందం రంగంలోకి దిగుతుంది. ఇదే విషయం గతంలో కూడా రుజువైంది. ఉప రాష్ట్రపతిగా కృష్ణకాంత్ పదవి కాలంలోనే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆఘ మేఘాల మీద ఆయనను విదేశాలకు పంపించి వైద్యం అందించారు. ఉప రాష్ట్రపతి ఉన్న సమయంలోనే కృష్ణకాంత్ మరణించారు. మరి అలాంటి సమయంలో పదవికి అనారోగ్య కారణంగా రాజీనామా చేయడంలో ఎంత వరకు వాస్తవం అనేది ఇప్పుడు అందరిలో ఉన్న ప్రశ్న.
Also Read : నిజంగానే చంద్రబాబు పగ తీర్చుకున్నారా..?
మరోవైపు పని ఒత్తిడి కారణంగా రాజీనామా చేశారా అనే ప్రశ్న వస్తోంది. కానీ ఉప రాష్ట్రపతి పై పెద్ద పని భారం ఉండే పరిస్థితి లేదు. పార్లమెంట్ సమావేశాల షెడ్యూల్‌లో రాజ్యసభ నెల రోజుల పాటు నడుస్తుంది. అందులో పది రోజులు సెలవులు ఉంటాయి. వెంకయ్యనాయుడు ఛైర్మన్‌గా వ్యవహరించిన సమయంలో మాత్రమే ఉప రాష్ట్రపతి సభ ఛైర్మన్ స్థానంలో పూర్తిస్థాయిలో ఉన్నారు. అంతకు ముందు, ఆ తర్వాత కూడా ఇలా పూర్తిస్థాయిలో ఎవరూ లేరు. సభను నడిపేందుకు కో ఛైర్మన్లు అందుబాటులో ఉంటారు కూడా. కాబట్టి ఉప రాష్ట్రపతిపై పెద్దగా పని ఒత్తిడి ఉండే అవకాశమే లేదు. కాబట్టి అటు అనారోగ్యం, ఇటు పని ఒత్తిడి అనే రెండు కారణాలు కూడా సరైనవి కావనే మాటే వినిపిస్తోంది.
Also Read : 20 రోజులే టైమ్.. గుర్తుపెట్టుకో..!
మరి మరో రెండేళ్ల పాటు పదవి కాలం ఉన్నప్పటికీ ధన్ ఖడ్ రాజీనామా ఎందుకు చేశారనే విషయంలో పొలిటికల్ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఈ ఏడాదిలోనే బీహార్ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే బీహార్‌పై కేంద్రం వరాల జల్లు కురిపిస్తోంది. నాలుగు రోజుల క్రితం కూడా బీహార్‌లో పర్యటించిన ప్రధాని మోదీ.. ఏకంగా 8 వేల కోట్ల రూపాయల విలువైన పనులను ప్రారంభించారు. మహిళలకు రిజర్వేషన్లు కూడా కల్పిస్తామని హామీ ఇస్తామన్నారు. ఈ నేపథ్యంలో బీహార్ నుంచి ఉప రాష్ట్రపతిని ఎంపిక చేయాలనే వ్యూహంతోనే ధన్ ఖడ్‌తో రాజీనామా చేయించారనే మాట బాగా వినిపిస్తోంది. రాష్ట్రపతిగా ప్రస్తుతం ఆదివాసీ తెగకు చెందిన ద్రౌపదీ ముర్ము కొనసాగుతున్నారు. ఈమెను తప్పించే పరిస్థితి లేదు. కాబట్టే ధన్ ఖడ్‌ను తప్పించారనే మాట వినిపిస్తోంది. ఎన్నికల నేపథ్యంలో బీహార్‌కు చెందిన వారికి పదవి ఇవ్వటం ద్వారా ప్రయోజనం పొందాలనేది బీజేపీ వ్యూహం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
Also Read : వివేకా కేసు.. సెన్సేషనల్ క్రియేట్ చేయబోతుందా..?
ధన్ ఖడ్ రాజీనామాపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ అనుమానం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం కూడా తాను ధన్ ఖడ్‌తో చర్చించానని.. అప్పటి వరకు ఆయన ఆ విషయం తనతో చెప్పలేదన్నారు. మధ్యాహ్నం నిర్వహించిన బిజినెస్ అడ్వైజరీ కమిటీకి కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా రాలేదని.. ఆ తర్వాతే ధన్ ఖడ్ రాజీనామా చేశారన్నారు జైరాం రమేష్. ఉప రాష్ట్రపతి పదవికి ధన్ ఖడ్ రాజీనామా వెనుక చాలా లోతైన కారణాలు ఉన్నట్లు తెలుస్తోందని జైరాం రమేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మొత్తానికి ఉప రాష్ట్రపతి పదవికి ధన్ ఖడ్ రాజీనామ.. కేంద్రంలో పొలిటికల్ తుఫాన్ సృష్టిస్తోంది.