మీతో నాకు పనేంటి… ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఈ మాటే పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ మాట అన్న నేత ఎవరో కాదు… టీడీపీ సీనియర్ నేత, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. ఏరు దాటే వరకు ఏటి మల్లన్న… దాటిన తర్వాత బోడి మల్లన్న అన్నట్లుగా మారిపోయింది అచ్చెన్నాయుడు తీరు. పార్టీలో కీలక స్థానంలో ఉండటంతో పాటు… వరుసగా రెండోసారి మంత్రిపదవి దక్కడంతో… అచ్చెన్నకు పగ్గాలు లేకుండా పోయాయనేది జిల్లాలో వినిపిస్తున్న మాట. సిక్కోలు జిల్లాలో సీనియర్లను కాదని… అచ్చెన్న మాటకే చంద్రబాబు ఎక్కువ విలువ ఇస్తున్నాడనే మాట కూడా వినిపిస్తోంది. అందుకే శ్రీకాకుళం, పాతపట్నం అభ్యర్థులను మార్చారని సీనియర్ నేతలు కూడా గుసగుసలాడుతున్నారు.
Also Read : అడ్డంగా దొరికిన వెంకటరామిరెడ్డి.. ఇంకా మర్యాదలు చేస్తారా?
ఇక అటు కేంద్రంలో కూడా టీడీపీ భాగస్వామ్యం కావడంతో… కింజరాపు రామ్మోహన్ నాయుడుకు కేంద్ర మంత్రి పదవి దక్కింది. అలాగే రామూ బావ ఆదిరెడ్డి వాసు కూడా ఇప్పుడు ఎమ్మెల్యే. దీంతో టీడీపీలో కింజరాపు కుటుంబానిదే పెత్తనం అనే మాట వినిపిస్తోంది. వరుసగా రెండోసారి కూడా మంత్రిపదవి వరించడంతో అచ్చెన్నాయుడు వ్యవహారంలో పూర్తిగా మార్పు వచ్చిందంటున్నారు శ్రీకాకుళం జిల్లా నేతలు. ఈ మాట నిజమే అనేది సిక్కోలు మీడియా మిత్రుల మాట కూడా. మంత్రిగా గెలిచిన తర్వాత కనీసం ఒక్కసారి కూడా జిల్లాలో ప్రెస్‌మీట్ నిర్వహించలేదు అచ్చెన్న. వ్యవసాయ శాఖ మంత్రిగా ఆ శాఖకు సంబంధించిన విషయాలను అమరావతిలో ప్రెస్ ముందు వివరిస్తున్న అచ్చెన్న… సొంత నియోజకవర్గం, సొంత జిల్లా సమస్యలపై ఇప్పటి వరకు కనీసం ఒక్కసారి కూడా మాట్లాడలేదు.
Also Read : తెలంగాణలో గేర్ మార్చిన కమలం పార్టీ…!
అలాగే జిల్లా నేతలతో కూడా కనీసం సమావేశం కాలేదు. రావడం… నేరుగా నిమ్మాడ వెళ్లడం… మళ్లీ విశాఖ మీదుగా అమరావతి వెళ్లడం… అంతే తప్ప కనీసం జిల్లా నేతలను కలిసిందే లేదనేది అచ్చెన్నపై ఆరోపణ. చివరికి శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు ముందు, తర్వాత కూడా అన్ని విషయాలను పర్యవేక్షించింది, మీడియాకు, ప్రజలకు వివరించింది కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాత్రమే. అలాంటి సమయంలో కూడా అచ్చెన్న మాట్లాడలేదు. ఇక అచ్చెన్నాయుడు పర్యటన వివరాలు కనీసం జిల్లా డీపీఆర్‌వో కూడా తెలియటం లేదు. ఇలా అయితే… ఎలా అని మీడియా మిత్రులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.




