మదనపల్లెలో జరిగిన అగ్నిప్రమాదం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటన విషయంలో వాస్తవాలు ఇప్పుడు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. మాజీ మంత్రి పెద్దిరెడ్డి అక్రమ భూముల వ్యవహారం కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చు అనే కామెంట్స్ బలంగా వినపడుతున్నాయి. దీనిపై డీజీపీ ద్వారకా తిరుమలరావు మీడియా సమావేశం ఏర్పాటు చేసి కీలక వ్యాఖ్యలు చేసారు. మదనపల్లె ఘటన ప్రమాదం కాదు అని అన్నారు. గత రాత్రి 11:30 గంటలకు అగ్నిప్రమాదం జరిగింది అన్నారు.
ప్రమాదం పలు అనుమానాలకు తావిస్తోంది అని… ఘటన ప్రమాదవశాత్తు జరిగింది కాదన్నారు. ఇక్కడ షార్ట్ సర్క్యూట్ జరగడానికి అవకాశమే లేదు అని స్పష్టం చేసారు. ఇంకా సమగ్ర విచారణ జరగాల్సి ఉంది అన్నారు. రాత్రి ప్రమాదం జరిగితే వెంటనే కలెక్టర్‌కు సమాచారం ఇవ్వలేదు అని అసహనం వ్యక్తం చేసారు. ఆర్డీవో ఆఫీస్‌లో కీలక ఫైల్స్ ఉన్న విభాగంలో అగ్నిప్రమాదం జరిగింది అన్నారు. ప్రమాద ఘటనపై ప్రభుత్వం, పోలీసులు సీరియస్‌గా ఉన్నారు అని డీజీపీ స్పష్టం చేసారు. ఆర్డీవో కార్యాలయం కిటికీ బయట అగ్గిపుల్లలు కనిపించాయి అన్నారు.
జరిగిన ఘటన యాక్సిడెంట్ కాదు.. ఇన్సిడెంట్‌గా భావిస్తున్నాం అన్నారు. దర్యాప్తు కోసం 10 బృందాలను ఏర్పాటు చేశాం అని తెలిపారు. ఆర్డీవో ఆఫీస్‌లో కొన్ని సీసీ కెమెరాలు పనిచేయట్లేదు అన్నారు డీజీపీ. ఘటనలో రెవెన్యూ, పోలీస్ అధికారుల అలసత్వం కనిపిస్తోంది అని ఆగ్రహం వ్యక్తం చేసారు. త్వరలో అన్ని వివరాలు బయటికొస్తాయి అన్నారు. ఈ ఘటనలో ఎవరిని వదిలే ప్రసక్తి లేదని డీజీపీ స్పష్టం చేసారు.