తెలంగాణా రాజకీయాల్లో సంచలనాలకు రంగం సిద్దమైందా..? పదేళ్ళ పాటు అధికారంలో ఉన్న గులాబీ పార్టీ 5 ఏళ్ళ ప్రతిపక్ష పాత్ర ముగియకుండానే కనుమరుగు అయ్యే అవకాశాలు ఉన్నాయా..? అంటే అవుననే సమాధానాలు వినపడుతున్నాయి. తెలంగాణా రాజకీయాల్లో బిజెపి ఫోకస్ చేసిన నాటి నుంచి వాతావరణం క్రమంగా మారుతూ వస్తోంది. ఆ ప్రభావం కాంగ్రెస్ పార్టీ కంటే బీఆర్ఎస్ మీద ఎక్కువగా పడుతూ వచ్చింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ సేఫ్ జోన్ లో ఉందనే సంకేతాలు వస్తున్నాయి.
అసలు బీఆర్ఎస్ ను లేకుండా చేసే అవకాశాలు కూడా ఉన్నాయనే సంకేతాలు వస్తున్నాయి. తాజాగా పార్టీలో అత్యంత నమ్మకస్తుడుగా పేరున్న గువ్వల బాలరాజు రాజీనామా చేసారు. కేటిఆర్ కు అత్యంత నమ్మకస్తుడిగా ఆయనకు పేరుంది. కేసీఆర్ కు భక్తుడిగా కూడా పేరు ఉంది. అలాంటి వ్యక్తి రాజీనామా చేయడం రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. ఆయన బిజెపిలో జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు మరో 9 మంది మాజీ ఎమ్మెల్యేలు పార్టీ మారే అవకాశాలు ఉండవచ్చు అంటున్నాయి రాజకీయ వర్గాలు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ కు గట్టి దెబ్బ తగిలే సంకేతాలు కనపడుతున్నాయి. టీడీపీ నుంచి బీఆర్ఎస్ లోకి వెళ్ళిన కొందరు నేతలు ఇప్పుడు డైరెక్ట్ గా బిజెపిలోకి వెళ్ళే ఆలోచన చేస్తున్నారట. ఇప్పటికే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామ చంద్రరావుతో భేటీ అయినట్టు ప్రచారం జరుగుతోంది. ఇది గమనించిన కేసీఆర్.. పార్టీ నేతలను కాపాడుకోవడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. అందుకే తన ఫాం హౌస్ లో కేసీఆర్ పార్టీ నేతలతో సమావేశం కూడా అయినట్టు పరిశీలకులు భావిస్తున్నారు.
కేసీఆర్ ఇప్పటికే కవిత వ్యవహారంతో ఇబ్బంది పడుతున్నారు. ఆమె ఎప్పుడు, ఏ షాక్ ఇస్తారో అర్ధం కాక కేసీఆర్ జాగ్రత్త పడుతూ వస్తున్నారు. తెలంగాణా జాగృతి సమితి పేరుతో ఆమె పార్టీ పెట్టే అవకాశం ఉందనే ప్రచారం సైతం జరుగుతోంది. ఇదే జరిగితే తీవ్రంగా నష్టపోయేది గులాబి పార్టీనే. ఈ పరిణామాలు అన్నీ కూడా కేటిఆర్ రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్ధకం చేస్తున్నాయి. అటు కేసులు కూడా ఆ పార్టీకి సమస్యగా మారాయి. కాళేశ్వరం కమీషన్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వంటివి ఆ పార్టీకి ప్రధాన తలనొప్పిగా మారాయి.