తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొంతకాలంగా సంచలనంగా మారారు. ఆమె ఏం చేసినా సరే మీడియాలో కూడా హడావుడి ఎక్కువగానే జరుగుతూ ఉంటుంది. రాజకీయంగా గులాబీ పార్టీ బలహీనంగా ఉన్న సమయంలో చోటు చేసుకున్న పరిణామాలు అటు ఆ పార్టీ కార్యకర్తలను కూడా ఇబ్బంది పెడుతున్నాయి. నేరుగా మాజీ మంత్రి హరీష్ రావును టార్గెట్గా చేసుకుని ఆమె చేసిన విమర్శలు.. తెలంగాణ రాజకీయాల్లో కలకలం సృష్టించాయి. ఆ తర్వాత ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.
Also Read : అలుపెరగని చంద్రబాబు.. టార్గెట్ యూరప్, గల్ఫ్..!
ఇక తెలంగాణ జాగృతి తో కవిత ముందుకు వెళ్లే అవకాశం ఉంది అనే క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో సొంత ఇమేజ్ కావాలి అనుకుంటున్న కవిత, జాగృతి పేరుతోనే ప్రభుత్వంపై పోరాటం చేసే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా బీసీ రిజర్వేషన్ల విషయంలో తెలంగాణ జాగృతి పేరుతోనే ఆమె నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే ఇక్కడే ఆసక్తికర పరిణామం ఒకటి జరిగింది. కల్వకుంట్ల కవిత కుమారుడు ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. దీనితో తన కుమారుడిని రాజకీయ ప్రవేశం చేయించేందుకు ఆమె సన్నాహకాలు చేస్తున్నారు అనే అభిప్రాయాలు వినపడుతున్నాయి.
Also Read : బీహార్ ఎన్నికల తర్వాత కేంద్రంలో సంచలన మార్పులు..!
ఖైరతాబాద్ లో నిర్వహించిన బీసీ రిజర్వేషన్ల నిరసనకు కుమారుడు ఆదిత్యను ఆమె స్వయంగా తీసుకువచ్చారు. జాగృతి నేతలతో కలిసి ఆదిత్య.. ఫ్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ నిరసనల్లో చురుకుగా పాల్గొన్నాడు. సాధారణంగా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేవారికి మొహమాటం ఎక్కువగా ఉంటుంది. కానీ ఏ ఇబ్బంది లేకుండా అందరితో కలిసిపోయి నిరసన కార్యక్రమాల్లో హుషారుగా పాల్గొన్నాడు ఆదిత్య. ప్రస్తుతం ఆదిత్య వయసు 20 ఏళ్లు. మరి ఈ వయసులో కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకురావాలి అనే ఆలోచన ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి. అయితే కచ్చితంగా కవిత సొంత పార్టీ స్థాపిస్తారు అనే అనుమానాలకు ఈ నిరసన బలం చేకూర్చింది.