2024 ఏడాది ఏపీ రాజకీయాలను ఓ మలుపు తిప్పిందనే చెప్పాలి. వై నాట్ 175 అన్న పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కలేదు… ఒక్కచోట కూడా గెలవలేదు అన్న పార్టీ ఏకంగా వంద శాతం రిజల్ట్‌తో ఏపీ రాజకీయాల్లో ఓ చరిత్ర సృష్టించింది. 2024ను జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఇక ఎన్నికలను తన లైఫ్ అండ్ డెత్ అన్నట్లుగా పవన్ పావులు కదిపారు. రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతూనే… దేశ రాజకీయాల్లో కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో పవన్ పాత్ర ఎంతో కీలకమనేది బహిరంగ రహస్యం. టీడీపీ అధినేత చంద్రబాబును స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టు చేసిన తర్వాత పవన్ తీసుకున్న నిర్ణయాలు ఏపీ రాజకీయాలకు టర్నింగ్ పాయింట్. అప్పటి వరకు పొత్తులపై ఊగిసలాట ధోరణిలో ఉన్న నేతలకు పవన్ క్లారిటీ ఇచ్చారు. ఏపీలో టీడీపీ – జనసేన పొత్తు కొనసాగుతుంది అని కూడా క్లారిటీ ఇచ్చేశారు.
Also Read : బన్నీ ఎఫెక్ట్.. టాలీవుడ్‌లో కొత్త భయం..!
ఇక తనపై వ్యక్తిగత విమర్శలు చేసిన వైసీపీ నేతలకు పవన్ అంతే ఘాటుగా బదులిచ్చారు. వైసీపీకి బలమైన సోషల్ మీడియా ఉందని గుర్తించిన పవన్… వాళ్లు చేసే ఆరోపణలకు అంతే ధీటుగా ఆన్సర్ ఇచ్చారు. మూడు పెళ్లిళ్లు అంటూ తనపై వ్యక్తిగత విమర్శలు చేసిన జగన్‌ను నాలుగో పెళ్లాం అంటూ పవన్ చేసిన కామెంట్.. ఏపీ రాజకీయాల్లో ఓ దుమారం రేపింది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరి 28న తాడేపల్లిగూడెంలో జరిగిన బహిరంగ సభ అయితే ఏపీ రాజకీయాలను ఓ మలుపు తిప్పింది. గుర్తు పెట్టుకో జగన్… అంటూ పవన్ ఇచ్చిన వార్నింగ్.. అభిమానులకు ఓ ఊపు ఇచ్చింది. చెప్పినట్లుగానే సీఎం జగన్‌ను పాతాళానికి తొక్కకపోతే తన పేరు పవన్ కళ్యాణే కాదంటూ.. చేసిన శపథాన్ని అక్షరాల రుజువు చేశాడు. వారాహి సభలతో రాష్ట్రమంత విస్తృతంగా పర్యటించారు.
ఇక ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్ కీలకంగా వ్యవహరించారనేది వాస్తవం. ముందుగా 31 స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమైన పవన్… బీజేపీ కూడా పొత్తు కలవడం.. సీట్లు కేటాయింపులో పట్టుబట్టడంతో.. ఏపీలో కూటమి గెలుపు ముఖ్యమని భావిస్తున్నట్లు ప్రకటించారు. అందుకే తనకు కేటాయించిన అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లను త్యాగం చేసి.. 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలకే పరిమితమయ్యారు. దీనిపై వైసీపీ నేతలు ఎన్ని విమర్శలు చేసినా సరే… పట్టించుకోలేదు. చివరికి ఎన్నికల్లో 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో కూడా గ్రాండ్ విక్టరీ సాధించి… వంద శాతం గెలుపుతో ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో ఓ రికార్డు సృష్టించారు పవన్. ఇక కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పదవితో కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను… అంటూ ప్రమాణస్వీకారం చేసి అభిమానుల కోరిక తీర్చారు కూడా.
ఇక ఎన్నికల తర్వాత పవన్ కల్యాణ్ తీరు పూర్తిగా మారిపోయిందనే చెప్పాలి. గెలిచిన వెంటనే అమ్మ, అన్న వదినల ఆశీర్వాదం తీసుకున్న వీడియోకు సోషల్ మీడియాలో అభిమానులు ఓ రేంజ్‌లో ఫిదా అయ్యారు. ఇక డిప్యూటీ సీఎంగా పవన్ ప్రమాణస్వీకారోత్సవానికి మెగా ఫ్యామిలీ మొత్తం కదలివచ్చింది. అదే వేదికపై అన్న కాళ్లను నమస్కారం.. పవన్ సంస్కారం అంటూ కామెంట్లు వెల్లువెత్తాయి. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత అటు పాలన పరమైన అంశాలతో పాటు రాజకీయంగా పార్టీని బలోపేతం చేయడంపై కూడా పవన్ దృష్టి సారించారు. తనపైన, కుటుంబ సభ్యులపైన సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా కించపరిచేలా కామెంట్లు చేసిన వారిపై తీవ్ర చర్యలకు పవన్ కారణమయ్యారు. అలాగే వైసీపీని మరింత బలహీనపరిచేందుకు ఆ పార్టీలో కీలక నేతలు జనసేనలో చేరేలా పావులు కదిపారు. అదే సమయంలో పరిపాలన పరమైన అంశాలపై కూడా పవన్ దృష్టి పెట్టారు. ప్రధానంగా పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవడంతో పాటు కాకినాడ పోర్టులో షిప్‌ను సీజ్ చేయాలని ఆదేశించడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇక పంచాయతీల అభివృద్ధికి తన సొంత నిధులు రూ.4 కోట్లు కేటాయించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.
Also Read : ఏపీపై రైల్వే శాఖ వరాల జల్లు..!
ఓ వైపు కూటమి నేతల మధ్య అధిపత్య పోరు కొనసాగుతుంటే… దానికి తనదైన శైలిలో పవన్ చెక్ పెట్టారు. తమ వల్లే ప్రభుత్వం ఏర్పడిందంటూ కొందరు టీడీపీ-జనసేన నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు పవన్ బ్రేక్ కొట్టారు. అలాగే సీఎం సీఎం అంటూ అభిమానులు నినాదాలు చేసినా సరే… చంద్రబాబు ఆధ్వర్యంలోనే రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి సాధిస్తుందని… రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం-జనసేన పార్టీలు కలిసే పోటీ చేస్తాయని ప్రకటించి… విమర్శకుల నోటికి తాళం వేశారు పవన్. ఆవేశం ఎక్కువ…. హడావుడి స్టార్ అంటూ తనపై విమర్శలు చేసిన వారికి.. బాబోయ్ పవన్‌తోనా అనేలా చేశారు. అందుకే పొలిటికల్ సర్కిల్‌లో ఇప్పుడు ఓ మాట వైరల్‌గా మారింది. అదేమిటంటే… జనసేనాని రివేంజ్ ఓ రేంజ్.. అనే మాట.