వైసీపీని ప్రస్తుతం నడిపిస్తున్న నేతల్లో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఒకరు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి గైర్హాజరవుతున్నారు. అసెంబ్లీకి జగన్ రాకపోవడంతో.. ప్రస్తుతం బొత్స సత్యనారాయణ వైసీపీ తరఫున శాసనమండలిలో పోరాటం చేస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత నమ్మకమైన వారిలో ఒకరు కావడంతో బొత్సకు జగన్ కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చారు. అందుకే ఎన్నికల్లో ఓడిన వెంటనే.. స్థానిక సంస్థల కోటాలో విశాఖ నుంచి వైసీపీ తరఫున మండలికి ఎన్నికయ్యారు బొత్స. మాజీ మంత్రిగా, ఎంపీగా, ఉమ్మడి ఏపీ పీసీసీ చీఫ్గా పనిచేసిన అనుభవం ఉన్న నేత కావడంతో.. వైసీపీ నేతలు కూడా ప్రస్తుతం బొత్స మాటకు విలువిస్తున్నారు. అయితే తాజాగా బొత్స చేసిన వ్యాఖ్యలు వైసీపీని ఇరుకున పెట్టాయి.
Also Read :అమ్మో వారెంట్.. వైసీపీ నేతల గుండెల్లో రైళ్ళు
ఎన్నికల ప్రచార సమయంలో బొత్సపై జగన్ పొగడ్తల వర్షం కురిపించారు. తండ్రి సమానుడు అంటూ ఆకాశానికెత్తేశారు. దీంతో సభా వేదికపైనే బొత్స భావోద్వేగానికి కూడా గురయ్యారు. అధికారంలో ఉన్నప్పుడు, తర్వాత కూడా బొత్సకు పార్టీలో కీలక బాధ్యతలే అప్పగించారు జగన్. అయితే ఇటీవల బొత్స చేసిన వ్యాఖ్యలు వైసీపీని ఇరుకున పెట్టాయి. ఇంకా చెప్పాలంటే… మూలిగే నక్కపైన తాటిపండు పడినట్లుగా… అసలే ఘోర పరాజయంతో ప్రతిపక్ష హోదా కూడా దక్కని దయనీయ స్థితికి దిగజారి పోయిన వైసీపీని… బొత్స మరింత ఇబ్బందులు చేసేలా వ్యాఖ్యలు చేశారు.
Also Read :సీఎం పర్యటన… ఆ ప్రాంత వాసుల కల నెరవేరేనా..?
అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా మార్చేశారు జగన్. అమరావతిలోనే ఇల్లు కట్టుకున్నా అంటూ 2019 ఎన్నికల ముందు గొప్పగా చెప్పిన జగన్… గెలిచిన తర్వాత మూడు రాజధానులంటూ కొత్త పాట పాడారు. దీంతో సర్వత్రా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. శాసన, పరిపాలన, న్యాయ రాజధానులు అంటూ అమరావతి, విశాఖ, కర్నూలు నగరాలను ప్రకటించారు. దీంతో రైతులతో పాటు, కూటమి నేతలు కూడా ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించడంతో పాటు న్యాయ పోరాటాలు కూడా చేశారు. 3 రాజధానుల ప్రతిపాదనకు అన్ని వర్గాల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత రావడంతో చివరికి ఎన్నికల్లో వైసీపీకి కేవలం 11 స్థానాలు మాత్రమే వచ్చాయి. దీంతో ఎన్నికల తర్వాత ఆ ప్రస్తావనే చేయలేదు జగన్. అటు వైసీపీ నేతలు కూడా ఈ విషయంపై సైలెంట్ అయ్యారు.
Also Read : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు వరుస గిఫ్ట్ లు రెడీ…!
అయితే మండలిలో అమరావతికి నిధుల కేటాయింపు చర్చ తర్వాత ఏపీ రాజధానిపై బొత్స కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో మూడు రాజధానులకు అనుకూలంగా తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని… ఇప్పుడు తమ పార్టీ దీనిపై పునరాలోచన చేస్తుందని బొత్స ప్రకటించారు. అసలు అవసరం లేని విషయం గురించి ఇప్పుడు ప్రస్తావించాల్సిన అవసరం ఏమిటని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. బొత్స ప్రకటనతో మూడు రాజధానుల నిర్ణయంపై వైసీపీ వెనక్కి తగ్గినట్లుగా ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒకలా… పదవి పోయిన తర్వాత మరోలా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై జగన్ కూడా గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. బొత్సతో భేటీలో మీరు ఇలా మాట్లాడాల్సింది కాదని ఘాటుగా చెప్పినట్లు సమాచారం. రాజధాని గురించి ఇప్పుడు ఎందుకు వ్యాఖ్యలు చేశారని కూడా బొత్సను జగన్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. 3 రాజధానుల గురించి కొన్ని రోజుల పాటు పార్టీ నేతలు ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని కూడా జగన్ ఆదేశించినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. ఏది ఏమైనా… బొత్స వ్యాఖ్యలు.. వైసీపీ ద్వంద వైఖరిని మరోసారి బయటపెట్టినట్లు అయ్యిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

