ఏపీ సచివాలయంలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. సాధారణంగా ప్రభుత్వానికి అనుకూలంగా పని చేయాల్సిన అధికారులు, ఉద్యోగులు.. పార్టీలకు అనుకూలంగా మారిపోయారనేది బహిరంగ రహస్యం. 2004 నుంచి ప్రభుత్వ అధికారుల తీరులో మార్పు వచ్చిందనే మాట వాస్తవం. పార్టీలకు అతీతంగా.. ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులు.. కేవలం పార్టీ పెద్దల మాటలే ఆచరిస్తున్నారు. ఇలా కొందరు అధికారులు నాటి ప్రభుత్వ పెద్దల మాటలు విని.. తప్పుడు పనులు చేసి జైలుకు కూడా వెళ్లారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తరహా తీరు మరింత ఎక్కువైంది. వెంకట్రామిరెడ్డి వంటి ఉద్యోగులతో పాటు సునీల్ కుమార్ వంటి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా రూల్స్ బ్రేక్ చేసి.. పార్టీ పెద్దలు చెప్పినట్లుగా నడుచుకున్నారు.
Also Read : బ్రేకింగ్ : పాక్ కు చుక్కలు చూపిస్తున్న ఆఫ్ఘన్ సైన్యం
తాజాగా సచివాలయంలో వైసీపీ ఐఏఎస్ అధికారులు కుట్ర చేస్తున్నారా..? అనే చర్చ జోరుగా నడుస్తోంది. నిజానికి సచివాలయంలో ఏం జరుగుతుందో కూడా సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులకు కూడా తెలియటం లేదనే మాట వినిపిస్తోంది. వైసీపీ అభిమానులనే ముద్ర ఉన్న ఐఏఎస్ అధికారులు కుట్ర చేస్తున్నా కూడా.. వైసీపీకి అనుకూలంగా పరిస్థితులు మార్చేందుకు కులాల మధ్య చిచ్చు పెట్టేలా వ్యవహరిస్తున్నా కూడా ప్రభుత్వ పెద్దలకు ఈ విషయం చేరలేదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అధికారం ఉంటే చాలనుకుంటున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కుట్రలు చేస్తున్న వారిపై కనీస చర్యలు తీసుకోవటం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఎస్సీ, ఎస్టీ అధికారులు, ఉద్యోగుల ప్రమోషన్‌లలో రిజర్వేషన్‌ల తీరుపై హైకోర్టులో కోర్టు ధిక్కారం కేసు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో ఇదే విషయంపై కులాల మధ్య కుంపటి రాజేసేందుకు కొందరు వైసీపీ అభిమాన ఐఏఎస్ అధికారులు సీఎం చంద్రబాబును తప్పు దోవ పట్టించేందుకు కుట్రలు పన్నుతున్నారనే మాట బాగా వినిపిస్తోంది. మూడు రోజులుగా కొందరు వైసీపీ అభిమాన ఐఏఎస్ అధికారులు రహస్యంగా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు జోరుగా చర్చ నడుస్తోంది. దివ్యాంగుల ప్రమోషన్‌లో రిజర్వేషన్ రద్దు చేయించేందుకు కుట్రలు జరుగుతున్నాయట. ఈ విషయంతో సీఎం చంద్రబాబును తప్పుదోవ పట్టిస్తున్నారనే మాట కూడా వినిపిస్తోంది. ఈ కుట్రలో సీఎంఓ అధికారి, జీఏడీ అధికారులు కూడా వైసీపీ అభిమాన ఐఏఎస్ అధికారులతో కుమ్మక్కు అయినట్లు సమాచారం.
Also Read : టార్గెట్ జనసేనాని అంటున్న బొలిశెట్టి..!
కూటమి ప్రభుత్వ అభిమాన ఓటర్లలో చీలిక రావాలంటే.. కులాల మధ్య కుంపటి పెట్టాలని వైసీపీ అభిమాన అధికారులు కుట్ర పన్నుతున్నట్లు తెలుస్తోది. అయితే ఈ విషయం తెలిసినా కూడా కూటమి ప్రభుత్వ అనుకూల ఐఏఎస్ అధికారులు మౌనంగా ఎందుకు ఉన్నారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల ప్రమోషన్‌ల విషయంలో సుప్రీం కోర్టు తీర్పును అమలు చేయాలని, కోర్టు సూచించిన మార్గదర్శకాలు పాటించాలని ఎప్పటి నుంచో ఓసీ, బీసీ, మైనారిటీ ఉద్యోగులు, అధికారులు పోరాడుతున్నారు. హైకోర్టులో కోర్టు ధిక్కారణ కేసు వున్న విషయం వైసీపీ అభిమాన ఐఏఎస్ అధికారులకు కూడా తెలుసు. ఎస్సీ, ఎస్టీ ఐఏఎస్ అధికారులలో ఉన్న ఐక్యత, ఓసీ, బీసీ, మైనారిటీ ఐఏఎస్ అధికారులలో మచ్చుకైనా కన్పించటం లేదు అనేది వాస్తవం.
20 శాతం ఉద్యోగులు, అధికారుల కోసం నిబంధనలకు విరుద్ధంగా, సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు వ్యతిరేకంగా కుట్రలు జరుగుతుంటే.. మిగిలిన 80 శాతం ఉద్యోగులు, అధికారుల కోసం ఒక్క ఓసీ, బీసీ, మైనారిటీ ఐఏఎస్ అధికారి కూడా ఎందుకు మాట్లాడినట్లు కనిపించటం లేదని సచివాలయంలో స్పష్టంగా వినిపిస్తున్న మాట. వైసీపీ ప్రభుత్వ హయాంలో, జగన్ రెడ్డితో అత్యంత సన్నిహితంగా మెలుగుతూ కీలక, ప్రాధాన్యత పోస్టులు నిర్వహించిన ఐఏఎస్ అధికారులే ఇప్పుడు చంద్రబాబుని తప్పు ధోవ పట్టించి, కులాల మధ్య మంట పెట్టేందుకు తెగ ప్రయత్నం చేస్తున్నారనేది బహిరంగ రహస్యం. వైసీపీ ఓటు బ్యాంకుకు అనుకూలంగా వైసీపీ అభిమాన ఐఏఎస్ అధికారులు పధకం ప్రకారం కుట్ర పన్నుతున్నారట. ఈ కుట్రలపై చంద్రబాబు సర్కార్ ఉక్కుపాదం మోపాలని ఓసీ, బీసీ, మైనారిటీ ఉద్యోగులు, అధికారులు కోరుతున్నారు.

