కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా జగన్ ప్రచారం చేయడమేమిటి అని ఆలోచిస్తున్నారా.. అవును మీరు చదివిన హెడ్డింగ్ నిజమే.. నిన్నటి వరకు కూటమి ప్రభుత్వంపైన, తెలుగుదేశం పార్టీ నేతల పైన నోటికి వచ్చినట్లు వ్యాఖ్యలు చేశారు జగన్. మరి అలాంటి వైసీపీ అధినేత ఇప్పుడు టీడీపీకి, చంద్రబాబుకు అనుకూలంగా ప్రచారం చేయటమే ఇప్పుడు హాట్ టాపిక్. వైసీపీ ఓడి ఏడాదైన సందర్భంగా ఇప్పుడు కూటమి నేతలంతా సంబరాలు జరుపుకుంటున్నారు. అయితే వైసీపీ నేతలంతా కలిసి జగన్ చేసిన పని చూసి ముక్కున వేలేసుకుంటున్నారు.
Also Read : కూటమి.. పొత్తు ధర్మం పాటిస్తారా లేదా..?
వై నాట్ 175 అని గొప్పగా చెప్పిన జగన్‌కు ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. ఇందుకు ప్రధాన కారణం ఒకటే.. ఐదేళ్ల పాటు అరాచకాలు, విధ్వంసక పాలన. సంక్షేమ పథకాలను బటన్ నొక్కుడు కారణంగా ప్రతి ఒక్కరి ఖాతాలోకి నేరుగా అందించామని ఎన్నికల సమయంలో జగన్ గొప్పగా ప్రచారం చేసుకున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం వేరుగా ఉన్నాయి. 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను జగన్ సర్కార్ పూర్తిగా అమలు చేయలేదు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ అమ్మఒడి పథకం. ఎన్నికల సమయంలో ఇంట్లో ఎంత మంది పిల్లలు చదువుకుంటుంటే… అంత మందికి రూ.15 వేలు ఇస్తామని వైసీపీ నేతలు ప్రకటించారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థికి కాదు… తల్లికి మాత్రమే అని మాట మార్చారు. ఆ తర్వాత కూడా పూర్తిస్థాయిలో ఇవ్వలేదు. తొలి రెండు విడతలు మాత్రం రూ.15 వేలు ఇచ్చిన వైసీపీ ప్రభుత్వం.. ఆ తర్వాత ఏడాది నుంచి కోతలు పెట్టింది. ఐదేళ్ల పాలనలో నాలుగు సార్లు మాత్రమే ఇచ్చి.. చివరి ఏడాది పంగనామాలు పెట్టింది జగన్ సర్కార్.
Also Read : అప్పుడు ప్రజాస్వామ్యం లేదా సాక్షి..?
ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పేరుతో కూటమి సర్కార్ ఓటర్లకు హామీ ఇచ్చింది. పెన్షన్ పెంపు, ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలెండర్లు, మెగా డీఎస్సీ ప్రకటన, మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పేరుతో ప్రతి విద్యార్థికి రూ.15 వేలు వంటి హామీలు ఇచ్చారు చంద్రబాబు. వీటిల్లో ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభిస్తామని ప్రకటించారు. అన్నదాత సుఖీభవ కూడా ఈ నెల 21న అకౌంట్‌లో జమ చేయనున్నారు. ఇక తల్లికి వందనం పథకం కోసం ఏకంగా 8,700 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. ఈ పథకానికే జగన్ ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు.
Also Read : తల్లికి వందనంపై గుడ్ న్యూస్.. పక్కా ప్లాన్ తో దిగుతున్న సర్కార్
ఎన్నికల సమయంలో ఇంటింటికీ ప్రచారం చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు.. తనదైన శైలిలో పిల్లలతో నీకు 15 వేలు, నీకు 15 వేలు, నీకు 15 వేలు అంటూ ఓటర్లకు వివరించారు. దీనిపై అప్పట్లోనే వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ కూడా చేశారు. ఇక కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన రెండో రోజు నుంచే.. తల్లికి వందనం ఎప్పుడు ఇస్తారని ప్రశ్నిస్తూనే ఉన్నారు. పరామర్శలకు వెళ్లిన ప్రతిసారి కూడా తల్లికి వందనం కింద నీకు 15 వేలు, నీకు 15 వేలు, నీకు 15 వేలు అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం పథకాలు అమలు చేయడం లేదని ఎద్దేవా చేశారు కూడా. ఇక వైసీపీ మద్దతుదారులు కూడా తల్లికి వందనం హామీ నెరవేర్చకపోవడంపై తీవ్ర విమర్శలు చేశారు. వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
Also Read : కామెడీ అయిపోతున్న జగన్.. ఎందుకిలా..?
అయితే ఈ వీడియో సేవ్ చేసుకున్న టీడీపీ నేతలు.. సరైన సమయం కోసం ఎదురు చూశారు. తల్లికి వందనం పథకం కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసిన వెంటనే.. జగన్ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. వైసీపీ మోసం చేసినట్లు కూటమి చేయదని.. ప్రతి ఒక్కరికీ అని హామీ ఇచ్చిన జగన్.. కేవలం తల్లికి మాత్రమే ఇచ్చారని.. కానీ కూటమి మాత్రం ప్రతి విద్యార్థికి ఇస్తోందని.. కావాలంటే జగన్ కూడా స్వయంగా చెబుతున్నారంటూ ఆ వీడియో పోస్టు చేస్తున్నారు. ఈ పథకానికి జగనే బ్రాండ్ అంబాసిడర్ అని.. దీన్ని విస్తృతంగా వాడడం ద్వారా ఆయన వేలితో ఆయన కంటినే పొడవబోతున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ పథకం అమలుతో వైసీపీ వాళ్ల నోళ్లకు తాళాలు పడినట్లే కనిపిస్తోంది.




