అడిలైడ్ టెస్ట్ లో ఆస్ట్రేలియా పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా గెలిచింది అనటం కంటే కూడా… భారత్ ఓడింది అనటం సబబుగా ఉంటుంది. తొలి మ్యాచ్ లో మాదిరిగా ఫస్ట్ ఇన్నింగ్స్ లో చేతులెత్తిన టీమిండియా… సెకండ్ ఇన్నింగ్స్ లో రాణిస్తుందని అంతా ఊహించారు. కానీ రోహిత్ సేన మాత్రం సగటు క్రికెట్ అభిమాని ఆశలను అడియాశలు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో కూడా ఏమాత్రం పోరాటపటిమ చూపలేదు. డ్రెస్సింగ్ రూమ్ లో ఏదో పారేసుకున్నట్లుగా హడావుడిగా పరిగెత్తారు. ఓ వైపు కంగారు టీం నిలకడగా పరుగులు చేసిన పిచ్ పైన నాలుగు రన్స్ చేసేందుకు ఆపసోపాలు పడ్డారు.
Also Read: జైస్వాల్ యాటిట్యూడ్ మార్చుకో… సీనియర్లు ఫైర్
తొలి ఇన్నింగ్స్ లో 180 పరుగులకే ఆలౌటైన రోహిత్ సేన… సెకండ్ ఇన్నింగ్స్ లో అయితే మరో 5 రన్స్ తక్కువే చేసి 175కే చాప చుట్టేసింది. కేవలం 19 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కంగారు జట్టు… 4వ ఓవర్ లోనే టార్గెట్ పూర్తి చేసింది. తొలి ఇన్నింగ్స్ లో 140 రన్స్ చేసి హెడ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. అయితే ఈ ఓటమితో కెప్టెన్ గా రోహిత్ శర్మ ఓ రికార్డ్ మాత్రం సొంతం చేసుకున్నాడు. వరుస ఓటములు పొందిన టీమిండియా కెప్టెన్ లో జాబితాలో రోహిత్ ఆరో స్థానంలో నిలిచాడు. పటౌడీ, సచిన్, గైక్వాడ్, ధోనీ, కోహ్లీ తర్వాత రోహిత్ చోటు దక్కించుకున్నాడు.
Also Read: హేయ్… మీ ఆట తీరు మారదా..!
అడిలైడ్ లో పింక్ బాల్ తో వరసగా ఎనిమిదో టెస్ట్ మ్యాచ్ గెలిచి రికార్డు సృష్టించింది. మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మ పేలవ ఫార్మ్ కొనసాగుతోంది. రెండు ఇన్నింగ్స్ లో కలిపి కేవలం 9 పరుగులు మాత్రమే చేశాడు. ఇక భారత జట్టులో అత్యుత్తమ ఆటగాడిగా పరిగణించబడుతున్న విరాట్ కోహ్లీ కూడా రెండు ఇన్నింగ్స్ లలో కలిపి కేవలం 18 పరుగులు మాత్రమే చేశాడు. ఇక హర్షిత్ రాణా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఒక్కరు కూడా వికెట్లు కాపాడుకుందాం అన్న ఆలోచన చేసినట్లు కనిపించలేదు. ముందే చెప్పినట్లు ఇది ఆస్ట్రేలియా విజయం అనడం కంటే భారత జట్టు పరాజయం అని చెప్పవచ్చు. బార్డర్ -గవాస్కర్ ట్రోఫీ మూడో టెస్టు మ్యాచ్ బ్రిస్బేన్ వేదికగా ఈ నెల 14 నుంచి ప్రారంభం కానుంది.