అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టడం ఏమో గాని అక్కడ స్థిరపడాలి అని భావించిన భారతీయులకు మాత్రం గత ఆరు నెలలుగా చుక్కలు కనిపించాయి. అక్కడ ఉన్న వేలాది మంది భవిష్యత్తు అంధకారంగా మారింది. ఈ తరుణంలో బయటకు వచ్చిన ఓ నివేదిక సంచలన విషయాలను బయటపెట్టింది. ఈ ఏడాది జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రోజు నుండి అమెరికా నుండి పెద్ద ఎత్తున భారతీయులను తిప్పి పంపారు.
Also Read : ఆర్సీబీకి షాక్ ఇచ్చిన కన్నడ సర్కార్
మొత్తం ఏడు నెలల కాలంలో 1,563 మంది భారతీయులను ఆ దేశం వెనక్కి పంపించిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. బహిష్కరించబడిన వారిలో ఎక్కువ మందిని వాణిజ్య విమానాలలోనే పంపించారు. విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ ప్రకటన చేసారు. 2017 నుండి 2021 వరకు ట్రంప్ మొదటి పదవీకాలంలో అమెరికా 6,135 మంది భారతీయులను బహిష్కరించిందని లెక్కలు విడుదల చేసారు. మరికొందరిని అమెరికా పంపించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
Also Read : కేసీఆర్ కి ఊహించని షాక్ ఇచ్చిన కవిత
2019లో అత్యధిక సంఖ్యలో బహిష్కరణలు జరిగాయని విదేశాంగ శాఖ పేర్కొంది. 2,042 మంది భారతీయ పౌరులను ఆ ఏడాది తిరిగి పంపించారు. మిగిలిన సంవత్సరాల్లో అంటే 2017లో 1,024, 2018లో 1,180 మరియు 2020లో 1,889 మందిని అమెరికా మన దేశానికి పంపింది. రాయిటర్స్ కథనం ప్రకారం, 2017లో ట్రంప్ అధికారంలో ఉన్న మొదటి నెలలోనే అమెరికా 37,660 మంది వలసదారులను ఆ దేశం నుంచి బహిష్కరించింది. ఆ జాబితాలో ఇరాన్, ఇరాక్, సిరియా, లిబియా, పాకిస్తాన్, భారత్ కు చెందిన వారు ఎక్కువ.