Wednesday, February 4, 2026 01:55 PM
Wednesday, February 4, 2026 01:55 PM

పరకామణి కేసులో అన్ని వేళ్లు ఆయన వైపే..!

తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణిలో చోరీ కేసు ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన ఫిర్యాదు దారుగా ఉన్న సీఐ సతీష్ కుమార్‌ హత్యకు గురి కావడంతో.. ఈ కేసులో మిగిలిన ఆరోపణలు ఎదుర్కొంటున్న వారితో పాటు సాక్ష్యులకు కూడా రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇదే సమయంలో కేసు పూర్తి నివేదికను సీల్డ్ కవర్‌‍లో కోర్డుకు సమర్పించాలని సీఐడీ చీఫ్, ఏసీబీ చీఫ్‌లను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన దర్యాప్తు బృందం అధికారులు.. అసలు దొంగతనం జరిగిన తీరు.. తర్వాత పరిణామాలపై ఆరా తీస్తున్నారు. దీంతో ఈ వ్యవహారంలో ఇప్పుడు అందరి దృష్టి.. నాటి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిపై పడింది. ఈ కేసులో చోరీ చేస్తు పట్టుబడిన రవికుమార్‌ను కాపాడేందుకు సుబ్బారెడ్డి కీలక నిర్ణయాలను ఏకపక్షంగా తీసుకుని అమలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు విశ్వసనీయ సమాచారం.

Also Read : అగ్రనేత కోసమే బెజవాడలో అడుగు పెట్టారా..?

పరకామణి చోరీ కేసులో తనపై విచారణ జరిపించాలన్న జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఇచ్చిన ఆర్డర్‌పై స్టే విధించాలంటూ రవికుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అసలు తాను టీటీడీ ఉద్యోగి కాదని.. తాను పెద జీయర్ మఠంలో గుమాస్తా అని వెల్లడించారు. కాబట్టి.. తనకు ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే

రాజద్రోహం, అవినీతి ఆరోపణలు వంటివి వర్తించవని పిటిషన్‌ల స్పష్టం చేశారు. కాబట్టి.. తనపై ఏసీబీ విచారణకు అవకాశం లేదని.. స్టే ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో అసలు టీటీడీ ఉద్యోగి కాని వ్యక్తికి.. పరకామణిలో సూపర్‌వైజర్‌గా ఎలా పోస్టింగ్ ‌ఇచ్చారనే విషయంపై అధికారులు దృష్టి పెట్టారు. ఇదే సమయంలో అసలు నాడు చోరీ జరిగిన నాటి నుంచి లోక్‌ అదాలత్‌తో రాజీ వరకూ.. అనంతర పరిణామాలపై దర్యాప్తు అధికారులు ఆరా తీస్తున్నారు.

ఏప్రిల్ 29, 2023న 900 డాలర్లు చోరీ చేస్తున్న రవి కుమార్‌ను నాటి విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించారు. అంతకు 5 రోజుల ముందే టీటీడీకి సతీష్ కుమార్ డిప్యుటేషన్ మీద వచ్చారు. ఈ చోరీపై అదే రోజు రాత్రి తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే ఉద్యోగి దేవుడి సొమ్ము చోరీ చేస్తూ పట్టుబడిన తర్వాత కూడా అధికారులు.. కేవలం సింపుల్ థెఫ్ట్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చారు తప్ప.. రాజద్రోహం కేసు నమోదు చేయలేదు. ఆ తర్వాత సరిగ్గా 18 రోజులకు రవికుమార్ దంపతులు టీటీడీ ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపారు. తమకు ఉన్న రూ.14.5 కోట్ల విలువైన ఆస్తిని టీటీడీకి ఇచ్చేస్తామని.. అందుకు ప్రతిఫలంతా కేసు నుంచి తప్పించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి నాటి టీటీడీ పెద్దలు అంగీకరించారు. ఈ ఆస్తి విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.40 కోట్లుగా దర్యాప్తు అధికారులు గుర్తించారు.

నిజానికి ఏదైనా ధార్మిక సంస్థకు, దేవస్థానానికి సొంత ఆస్తి దానం చేయాలంటే దానికి కనీసం నెల రోజుల సమయం పడుతుంది. ఇలాంటి ఇబ్బందులు లేవని.. ఆస్తి తమదే అని రుజువు చేస్తూ పేపర్ నోటిఫికేషన్, లీగల్ హైర్ డాక్యుమెంట్, నోటరీ, నో అబ్జక్షన్ సర్టిఫికేట్, ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికేట్‌.. ఇక ప్రభుత్వ ఉద్యోగి అయితే ఏసీబీ నుంచి క్లియరెన్స్ సర్టిఫికేట్ తప్పని సరి. కానీ రవికుమార్ విషయంలో మాత్రం ఇవేవీ జరగలేదు. ఎమెర్జెన్సీ కింద డిజిటల్ పబ్లికేషన్ అని ప్రకటించి.. కేవలం పది రోజుల్లోనే ప్రక్రియ మొత్తం పూర్తి చేశారు. మే నెలాఖరు నాటికి ఆస్తి బదలాయింపు ప్రక్రియ పూర్తి చేశారు. ఈ ప్రక్రియ అంతా నాటి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి ఆధ్వర్యంలోనే జరిగిపోయింది. నిజానికి టీటీడీకి రూ.14.5 కోట్ల విలువైన ఆస్తి విరాళం అనేది చాలా పెద్ద విషయం. అలాగే పరకామణిలో చోరీ అంశం కూడా టీటీడీ ప్రతిష్ఠకు మచ్చ తెచ్చే అంశం. ఇలాంటి వాటిపై బోర్డు సమావేశంలో తప్పని సరిగా చర్చించి నిర్ణయం తీసుకోవాలి. కానీ.. జూన్ 19, 2023 న జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో ఈ విషయాలపై కనీస ప్రస్తావన కూడా లేదని దర్యాప్తు అధికారులు గుర్తించారు.

Also Read : యూత్‌కు టీటీడీ బ్రేక్ దర్శనం ఆఫర్.. కండీషన్ ఇదే..!

ఇక ఆస్తుల బదలాయింపు ప్రక్రియ పూర్తి అయిన వెంటనే.. 2023 జూన్ తొలి వారంలోనే కోర్టులో ఫిర్యాదు చేసిన సతీష్ కుమార్, చోరీ చేస్తూ పట్టుబడిన రవి కుమార్‌లు రాజీ చేసుకుంటున్నట్లు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఆ మరుసటి రోజే కోర్టు నోట్ కూడా రావడం ఇక్కడ మరో విశేషం. వాస్తవానికి దేవుడి సొమ్ము చోరీ చేస్తూ పట్టుబడితే.. రాజీకి సతీష్ కుమార్‌కు ఏం సంబంధం అనేది ఇక్కడ మరో ప్రశ్న. రవికుమార్ పైన రాజద్రోహం ఎందుకు నమోదు చేయలేదని కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన నాటి తిరుమల సీఐ జగన్ మోహన్ రెడ్డి, తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి పాత్రలపై కూడా దర్యాప్తు బృందం విచారణ చేస్తోంది. మొత్తానికి ఈ కేసులో అన్ని వేళ్లు వైవీ సుబ్బారెడ్డి వైపు చూపిస్తుండటం ఇప్పుడు వైసీపీ నేతల్లో కలవరం రేపుతోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

పోల్స్