ఎట్టకేలకు సినీ నటుడు అల్లు అర్జున్ చంచల్గూడా జైలు నుంచి ఈరోజు ఉదయం విడుదలయ్యాడు. నాటకీయ పరిణామాల మధ్య నిన్న మధ్యాహ్నం చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత గాంధీ ఆసుపత్రికి తరలించడం… నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడం… ఆ తర్వాత హైకోర్టులో అల్లు అర్జున్ తరఫు న్యాయవాదులు క్వాష్ పిటిషన్ పై వాదనలు వినిపిస్తూనే మభ్యంతర బెయిలు ఇవ్వాలి అంటూ హైకోర్టుని కోరడం, హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం గంటల వ్యవధిలో జరిగిపోయాయి.
Also Read : అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయగలిగారు.. మరి ఆర్జీవీని..? లోపం ఎక్కడుంది?
దీనితో నిన్న సాయంత్రమే అల్లు అర్జున్ విడుదలవుతాడని అభిమానులు అలాగే తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురు చూశారు. కానీ బెయిల్ పేపర్ లు జైలు అధికారులకు చేరడంలో ఆలస్యం జరిగిన నేపథ్యంలో అల్లు అర్జున్ రాత్రంతా జైల్లోనే ఉండాల్సి వచ్చింది. ఇక ఈ రోజు ఉదయం అల్లు అర్జున్ వెంటనే జైలు అధికారులు విడుదల చేశారు. ఇక రాత్రంతా జైల్లోనే బన్నీ నేలపై పడుకుని ఉన్నాడని అధికారులు వెల్లడించారు. ఇక ఉద్విగ్నభరిత క్షణాలు మధ్య అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నాడు.
Also Read : పుష్ప అరెస్ట్… పొలిటికల్ మైలేజ్ కోసం ఆరాటం…!
ముందు గీత ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకుని ఆ తర్వాత జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి చేరుకున్నాడు. ఈ తరుణంలో అల్లు అర్జున్ నివాసం వద్ద కాస్త భావోద్వేగ వాతావరణం కనిపించింది. తన పిల్లలను భార్యను అల్లు అర్జున్ హత్తుకున్న సన్నివేశాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో అల్లు అర్జున్ తరఫున న్యాయవాదులు రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టులో సోమవారం పిటిషన్ వేయనున్నారు. ఇదే కేసులో అరెస్టు అయిన సంధ్య థియేటర్ యాజమాన్యం కూడా ఈ రోజు ఉదయమే విడుదలైంది. ఏది ఎలా ఉన్నా అల్లు అర్జున్ ఒకరోజు జైల్లో గడపటం మాత్రం ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.