ఎన్నికల షెడ్యూల్ ఇంకా రాలేదు… అప్పుడే ఢిల్లీలో రాజకీయ వేడి పెరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ అయితే అసెంబ్లీకి అభ్యర్థుల జాబితా కూడా ప్రకటించింది. ఇటు… మహారాష్ట్ర ఫార్ములానే ఢిల్లీలో అమలు చేసేందుకు ఆర్‌ఎస్ఎస్ సిద్ధమవుతోంది. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తోంది ఆర్ఎస్ఎస్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయభేరి మోగించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. షెడ్యూల్ రాకముందే అభ్యర్థులను ప్రకటించి… తమను మళ్లీ గెలిపించాలంటూ ఆప్ నేతలు ప్రచారం మొదలుపెట్టారు. అన్ని పార్టీలూ ఉచిత విద్యుత్, ఫ్రీ వాటర్, రేషన్ కార్డులు, పెన్షన్ల పేరుతో… ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తుండటంతో… ఢిల్లీపోరు రసవత్తరంగా మారుతోంది. బీజేపీని మరోసారి ఓడిస్తామని చెప్తున్నారు అరవింద్ కేజ్రీవాల్.
Also Read : మావ పాలన మరిచిన అల్లుడు.. సభ నిర్వహణపై పెద్ద పెద్ద మాటలు
ఫిబ్రవరిలో ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వ్యూహాన్నే పన్ని… బీజేపీని గెలిపించేందుకు ప్రయత్నిస్తోంది ఆర్ఎస్ఎస్. బీజేపీ కూడా ఆర్ఎస్ఎస్‌పైనే ఎక్కువ ఆశలు పెట్టుకుంది. హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించడంలో ఆర్‌ఎస్‌ఎస్ కీలక పాత్ర పోషించింది. కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలకు వ్యతిరేకంగా ఓటర్లను ఏకం చేసేందుకు ఆర్‌ఎస్‌ఎస్ ఈ రెండు రాష్ట్రాల్లో వందలాది ర్యాలీలు నిర్వహించింది. మహారాష్ట్రలో అయితే దాదాపు 60వేల కార్నర్ మీటింగ్స్ పెట్టింది ఆర్ఎస్ఎస్. ఢిల్లీలోనూ ఇది చాలా బలంగా ఉంది. బీజేపీ నేతలు, ఆర్‌ఎస్‌ఎస్ మధ్య సమన్వయం కోసం ప్రత్యేక టీంలు నియోజకవర్గాల్లోనూ రంగంలోకి దిగాయి. బీజేపీకి అనుకూల ప్రచారం… ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి.
బీజేపీ శ్రేణులను ఉత్తేజపరిచేందుకు క్షేత్ర స్థాయిలో 50 వేల సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది ఆర్‌ఎస్ఎస్. గత నెల 23న మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు విడుదల కాగానే సంఘ్ శ్రేణులు ఢిల్లీలో దిగిపోయాయి. 70 స్థానాల అసెంబ్లీలో మొత్తం 13 వేల వరకు ఎన్నికల బూత్‌లు ఉన్నాయి. ప్రతి బూత్ స్థాయిలో ఆరెస్సెస్ శ్రేణులు చిన్న చిన్న గల్లీ సమావేశాలు పెడుతున్నాయి. ఆమ్ ఆద్మీ ప్రభుత్వ అవినీతి, కుంభకోణాలు, నీరు, కరెంటు సమస్యలు, బంగ్లాదేశ్ చొరబాటుదారులకు రేషన్ కార్డులు లాంటి అంశాలను ప్రచారం చేస్తున్నాయి. మహారాష్ట్ర లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీపై అసంతృప్తితో ఆర్‌ఎస్‌ఎస్ దూరంగా ఉండడంతో మహాయుతి ఎన్డీఏ ఘోరంగా దెబ్బతింది. తర్వాత అత్యున్నత స్థాయిలో చర్చలు జరిగి.. తిరిగి ఉభయపక్షాలూ చేతులు కలిపాయి. దీంతో, మహారాష్ట్రలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. అందుకే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేయాలని బీజేపీ, సంఘ్ డిసైడయ్యాయి. ఎందుకంటే 1993 తర్వాత బీజేపీ ఇక్కడ గెలవలేదు. 1998 తర్వాత కాంగ్రెస్ హ్యాట్రిక్ కొట్టింది. ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ హ్యాట్రిక్ సాధించింది. 2015లో అయితే ఆప్ 70 స్థానాలకుగాను 67 చోట్ల గెలిచింది. 2020లో 62 స్థానాలతో తిరుగులేని విజయం సాధించింది.
బీజేపీ, సంఘ్ పరివార్ కలిసి ఢిల్లీలో ప్రతి ఇంటినీ రెండు మూడు సార్లు టచ్ చేయాలని భావిస్తున్నాయి. కేంద్రంలో వరుసగా అధికారంలోకి వస్తున్నా… ఢిల్లీ అసెంబ్లీలో పట్టులేకపోవడం బీజేపీకి లోటుగా మారింది. క్షేత్రస్థాయిలో తిరుగుతూ… ఓటర్లలో ఆదరణ ఉన్న నేతలకు టికెట్లివ్వనుంది. ఇందుకోసం వేరే పార్టీల నుంచి నేతలు వచ్చినా… బీజేపీ చేర్చుకోనుంది. రెండు సార్లు ఓడిన నేతలకు నో ఛాన్స్ అంటోంది. ఆర్ఎస్ఎస్ సూచనమేరకు బీజేపీ కొత్తవారికి టికెట్లిచ్చే అవకాశం ఉంది. ఢిల్లీ మొత్తం అర్బన్ ఓటింగే కావడంతో… ఎలాగైనా విజయం సాధించాలనుకుంటోంది.
Also Read : ఆస్ట్రేలియా పిచ్ లపై “హ్యాండ్సం బ్యాటింగ్” కెఎల్ రాహుల్ టెక్నిక్ కు ఫ్యాన్స్ ఫిదా
అటు ఆప్ అధినేత కేజ్రీవాల్‌పై న్యూఢిల్లీ నియోజకవర్గంలో మరోసారి షీలా దీక్షిత్ కుటుంబం బరిలోకి దిగుతోంది. 2013లో షీలా దీక్షిత్‌ను చిత్తుగా ఓడించాక కేజ్రీవాల్ పెద్ద లీడర్‌గా దేశమంతా గుర్తించింది. ఈసారి ఆమె కుమారుడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్‌ను కాంగ్రెస్ ఆయనపై పోటీకి దించుతోంది. న్యూఢిల్లీ నియోజకవర్గంలోనే పార్లమెంట్ బిల్డింగ్, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, మంత్రిత్వశాఖలు, రాయబారకార్యాలయాలున్నాయి. పలువురు సీఎంలను అందించిన ఘనత సైతం దీని సొంతం … అందుకే న్యూఢిల్లీ అంటే అంత క్రేజ్. ఆమ్ ఆత్మీ పార్టీకి బస్తీలు, మురికివాడల్లో మంచి బట్టుంది. కాంగ్రెస్ వైఫల్యాల వల్ల ఈ ఓటు బ్యాంక్ ఆమ్ ఆద్మీకి వెళ్లింది. దీంతో ఎలాగైనా పునర్‌వైభవం సాధించాలనుకుంటోంది కాంగ్రెస్.