ఆంధ్రప్రదేశ్ మరో కొత్త ఆవిష్కరణకు ఒప్పందం చేసుకొంది! ఈసారి, ప్రజలకు అవసరమైన ప్రభుత్వ సేవలు వారి చేతి వ్రేళ్లకు లభించేలా.. అత్యంత వేగంగా వాట్సాప్ ద్వారా అందుబాటులోకి తెస్తోంది. వాట్సాప్ బిజినెస్ సొల్యూషన్ ద్వారా సేవలందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెటా ప్లాట్ఫామ్స్ సంస్థ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఆవిష్కరణతో, పౌరసేవలు మరింత సులభం, వేగవంతం కానున్నాయి.
ఏమిటి ఈ స్పీడ్?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు మెటా ప్లాట్ఫామ్స్ మధ్య కుదిరిన ఈ ఒప్పందంతో, వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవలను వేగంగా, సులభంగా ప్రజలకు అందించాలన్న దిశగా పలు సేవలను అమలు చేయనున్నారు. ముఖ్యంగా ఈ ఒప్పందం జి2సి (గవర్నమెంట్ టు సిటిజెన్), బి2సి (బిజినెస్ టు కన్‌జ్యూమర్), జి2జి (గవర్నమెంట్ టు గవర్నమెంట్) విభాగాల్లో సేవలను మెరుగుపరచడం, పౌరులకు సత్వర సేవలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
100 సర్వీసులు – మీ ముంగిటలో
ఫేజ్ 1 లో నవంబర్ 31, 2024 నాటికి 100 ప్రధాన ప్రభుత్వ సేవలను వాట్సాప్ ద్వారా అందించనున్నారు. ఇది ప్రజలకు సర్వీసులు పొందడంలో సులభతరం చేయడమే కాకుండా, ప్రభుత్వ సర్వీసుల వేగాన్ని, సామర్థ్యాన్ని పెంచుతుంది.
ఏ విభాగాల్లో ఈ సర్వీసులు?
ఎండోవ్మెంట్ సర్వీసులు: దేవాలయ దర్శనాలు, వసతి బుకింగ్, విరాళాలు వంటి సేవలు వాట్సాప్ ద్వారా సులభంగా పొందవచ్చు.
రెవెన్యూ సర్వీసులు: పౌరులు తమ సేవల దరఖాస్తు స్థితిని వాట్సాప్ లో తెలుసుకోవచ్చు, సర్వే నంబర్లు, భూమి పత్రాలను సులభంగా యాక్సెస్ చేయవచ్చు.
పౌర సరఫరాలు: రేషన్ కార్డులకు సంబంధించిన సేవలు, ధాన్యం కొనుగోలు ప్రక్రియలు వాట్సాప్ ద్వారా మరింత పారదర్శకంగా జరగనున్నాయి.
Also Read : వైసీపీకి గుడ్ బై.. పద్మం వికసించేది ఎక్కడ..?
పట్టణ పాలన: ఆస్తి పన్నులు, పుట్టిన, మరణ సర్టిఫికెట్లు, వ్యాపార లైసెన్సులు వంటి సేవలు వాట్సాప్ లో మరింత సులభతరం కానున్నాయి.
ఎనర్జీ సర్వీసులు: విద్యుత్ బిల్లులు చెల్లించడం, కొత్త విద్యుత్ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు గురించి సమాచారం పొందడం.
ప్రత్యేకత ఏమిటి?
ఈ వాట్సాప్ ఆధారిత ప్రభుత్వ సేవలలో అత్యవసర అలర్ట్స్ నుండి పర్యాటక సమాచారం, గ్రీవెన్స్ రిడ్రెసల్, పన్ను సమాచారం, వ్యవసాయ మార్కెట్ ధరలు వంటి అనేక విభాగాలు ఉండటం విశేషం. ముఖ్యంగా, ప్రభుత్వ శాఖల పని తీరు వేగవంతం అవుతుందని భావిస్తున్నారు.
భవిష్యత్తు విజన్:
ఈ సాంకేతిక ఆధారిత ఆవిష్కరణ ప్రజలకు పౌర సేవలను వేగంగా అందించడంతో పాటు, భవిష్యత్తులో మరిన్ని సాంకేతిక పరిష్కారాలకు దారితీసే మార్గదర్శకంగా ఉండనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కొత్త వాట్సాప్ సర్వీసులతో దేశంలోనే ముందంజలో నిలుస్తూ, ప్రజల జీవితాలను మరింత సులభతరం చేసేందుకు ఈ ప్రాజెక్ట్ ను విజయవంతంగా అమలు చేయనుంది.
వాట్సాప్ లో సేవలు – సర్వీసులు సులువుగా, సత్వరంగా!




