దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు విజయవాడ ఇంద్రకీలాద్రి ముస్తాబవుతోంది. ఈ నెల 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు నవరాత్రి వేడుకలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దసరా ఉత్సవాల్లో శ్రీ కనకదుర్గమ్మ వారు 11 అలంకారాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. 11 రోజుల పాటు నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నట్లు దేవాదాయ శాఖ అధికారులు వెల్లడించారు.
Also Read : రాజకీయాల్లోకి వైఎస్ షర్మిల వారసుడు…?
త్రిమాత స్వరూపమైన దుర్గాదేవి.. మహాశక్తి స్వరూపిణిగా తెలుగు నేలపై ఉంది. తెలుగు భక్తుల వైభవానికి ప్రతీకగా తెలుగు ఇంటి పడచుగా శ్రీ కనకదుర్గమ్మను కొలుస్తారు. దసరా ఉత్సవాలలో భాగంగా అమ్మవారిని విశేషంగా అలంకరించనున్నారు.
సెప్టెంబర్ 22 – శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి
సెప్టెంబర్ 23 – శ్రీ గాయత్రీ దేవి
సెప్టెంబర్ 24 – శ్రీ అన్నపూర్ణ దేవి
సెప్టెంబర్ 25 – శ్రీ కాత్యాయని దేవి
సెప్టెంబర్ 26 – శ్రీ మహాలక్ష్మీ దేవి
సెప్టెంబర్ 27 – శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి
సెప్టెంబర్ 28 – శ్రీ మహాచండీ దేవి
సెప్టెంబర్ 29 – శ్రీ సరస్వతీ దేవి
సెప్టెంబర్ 30 – శ్రీ దుర్గాదేవి
అక్టోబర్ 01 – శ్రీ మహిషాసురమర్ధిని దేవి
అక్టోబర్ 02 – శ్రీ రాజరాజేశ్వరి దేవి
సెప్టెంబర్ 22 నవరాత్రి మొదటి రోజు అమ్మవారికి స్నపనాభిషేకం అనంతరం అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. మొదటి రోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు సామాన్య భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 2 వరకు ఉదయం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులకు అమ్మవారి దర్శనం ఉంటుంది.
మహా మండపంలోని 6వ అంతస్తులో కుంకుమార్చనలు, దేవి ఖడ్గమాలార్చనలు, శ్రీ చక్ర నవార్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. యాగశాలలో చండీ హోమం ప్రతిరోజూ జరుగుతుందని అధికారులు వెల్లడించారు. సెప్టెంబర్ 29న మూల నక్షత్రం సందర్భంగా తెల్లవారుజామున 2 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు అమ్మవారి దర్శనాలు ఉంటాయి. అమ్మవారి జన్మ నక్షత్రం మూల నక్షత్రం కనుక, అదే రోజున మధ్యాహ్నం సమయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.
Also Read : సజ్జలపై జగన్ సీరియస్.. అంతా నీ వల్లే..?
దసరా మహోత్సవాలలో ప్రతిరోజూ ప్రదోషకాల సమయంలో ఆదిదంపతుల నగరోత్సవం నిర్వహించనున్నారు. సనాతన ధర్మ ప్రచార నిమిత్తం ఆధ్యాత్మిక, సాంస్కృతిక కళా ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. దసరా ఉత్సవాలలో దర్శనానికి విచ్చేసే భక్తుల సౌకర్యర్ధం క్యూ లైన్ లలో తాగునీరు, వివిధ ప్రదేశాల్లో ఉచిత వైద్య, సదుపాయాలు, అమ్మవారి అన్నప్రసాదం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే భక్తులు తలనీలాలు సమర్పించేందుకు ప్రత్యేక కేశఖండన శాలలు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు విజయవాడ ఉత్సవ్ పేరుతో దసరా మహోత్సవాలను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.