శ్రీ సిటీలోని క్రయోజెనిక్ ట్యాంకుల తయారీ అగ్రగామి సంస్థ యూఎస్ఏ చార్ట్ ఇండస్ట్రీస్‌కు చెందిన వీఆర్‌వీ ఆసియా పసిఫిక్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ, ఖతార్‌లోని ఎయిర్ లిక్విడ్ సంస్థకు అధిక సామర్థ్యం కలిగిన.. సూపర్-సైజ్ లిక్విడ్ నైట్రోజన్ స్టోరేజ్ ట్యాంక్‌ను ఎగుమతి చేయడం ద్వారా మరో ప్రధాన మైలురాయిని అధిగమించింది. ఎయిర్ లిక్విడ్ ప్రపంచంలోని ప్రముఖ పారిశ్రామిక వాయువుల తయారీ, సేవల సంస్థ. ఇది 75 కంటే ఎక్కువ దేశాల్లో ఆరోగ్య సంరక్షణ, ఏరోస్పేస్ రంగాల పరిశ్రమలకు నాణ్యమైన ఉత్పత్తులను అందించడంలో ప్రసిద్ధి చెందింది.
Also Read : మద్యం కోసం వైసీపీ నేతల హడావుడి.. జగన్ టూర్ లో ఇంట్రస్టింగ్ సీన్స్
ప్రస్తుతం ఎగుమతి చేస్తున్న 47 మీటర్ల పొడవు, 6 మీటర్ల వ్యాసం, 214 టన్నుల బరువు కలిగిన భారీ క్రయోజెనిక్ ట్యాంక్, వీఆర్‌వీ అధునాతన ఇంజనీరింగ్ సామర్థ్యాలకు ప్రతీకగా నిలుస్తుంది. ఇందుకు సంబందించిన మొదటి ఎగుమతి ట్యాంకును 192 చక్రాల మల్టీ యాక్సిల్ వాహనం ద్వారా కృష్ణపట్నం పోర్టుకు తరలించారు. ఈ సరఫరా ద్వారా అంతరిక్ష రంగం అవసరాలకు అనుగుణంగా భారీ క్రయోజెనిక్ నిల్వ ట్యాంకుల తయారీలో ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపు వీఆర్‌వీ సంస్థకు దక్కింది.
ఆత్మనిర్భర్, ‘మేక్ ఇన్ ఇండియా’ చొరవ మేరకు నిబద్ధత, కృషితో కీలక రంగంలో ఎగుమతులు చేపట్టి మరో మైలు రాయిని అధిగమించిన వీఆర్‌వీ సంస్థకు, సిబ్బందికి శ్రీ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి అభినందనలు తెలిపారు. శ్రీ సిటీలో ప్రవేశించిన మొట్టమొదటి సంస్థ వీఆర్‌వీ అని, దిగుమతులకు ప్రత్యామ్నాయంగా ఎగుమతులు చేపడుతూ ప్రపంచ సరఫరా గొలుసుకు దోహదపడుతున్న వీఆర్‌వీ పనితీరు స్ఫూర్తిదాయకమన్నారు.
Also Read : మంత్రులకు కౌంట్ డౌన్ స్టార్ట్.. చంద్రబాబు సంచలన కామెంట్స్
భారతదేశంలో దాదాపు 17 సంవత్సరాలుగా నాణ్యత, నూతన ఆవిష్కరణలతో వీఆర్‌వీ సంస్థ, ఇస్రో, యూఎస్ఏలోని లోని ఒక ప్రైవేట్ ఏరోస్పేస్ సంస్థతో సహా ప్రముఖ సంస్థలకు విశ్వసనీయ భాగస్వామిగా మారింది. వివిధ ద్రవ వాయువుల నిల్వ, పంపిణీ, బాష్పీభవనం కోసం ఉత్పత్తుల రూపకల్పన, తయారీలో ప్రత్యేకత కలిగిన వీఆర్‌వీ, క్రయోజెనిక్ సాంకేతికతను మరింత అభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తోంది.
కోవిడ్-19 సంక్షోభ సమయంలో కీలక పాత్ర పోషించి దేశవ్యాప్తంగా వైద్య ఆక్సిజన్ సిలిండర్లు, నిల్వ ట్యాంకులను వీఆర్‌వీ సరఫరా చేసింది. శ్రీ సిటీ విరాళంగా తిరుపతి స్విమ్స్, బర్డ్, రుయా హాస్పిటల్స్‌తో సహా తిరుపతి, నెల్లూరు జిల్లాలలోని ప్రభుత్వ ఆసుపత్రులకు అందచేసిన ఆక్సిజన్ నిల్వ ట్యాంకులను సకాలంలో సరఫరా చేసి వీఆర్‌వీ ఎంతో సహకరించింది.