టీటీడీ ఎందుకు మనకు… వైటీడీ చాలు కదా.. అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు ప్రజా ప్రతినిధులు ఇచ్చే లేఖల్లో వివక్ష ఉందని తెలంగాణ నేతలు తొలి నుంచి ఆరోపిస్తున్నారు. తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల లేఖలను తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అనుమతించటం లేదని గతంలో విమర్శించారు. దీనిపై నిర్ణయం తీసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణ ప్రజా ప్రతినిధులు కోరారు. వాస్తవానికి తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలపై దర్శనం నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలోని పాలకమండలి. జగన్ సర్కార్ ఆదేశాల మేరకు ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
Also Read : జగన్‌ను అనుకరిస్తున్న కేటీఆర్..!
దీని వల్ల తమ అభిమానులకు, కార్యకర్తలకు వీఐపీ బ్రేక్ దర్శన భాగ్యం కలగటం లేదని.. సిఫార్సు లేఖలను పునరుద్ధరించాలని గతేడాది హైదరాబాద్‌లో జరిగిన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో చంద్రబాబును విజ్ఞప్తి చేశారు. దీనికి చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించారు. అందుకు అనుగుణంగానే టీటీడీ పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించేందుకు అంగీకరించారు. వాస్తవానికి ఇప్పటి వరకు వారంలో నాలుగు రోజులు మాత్రమే సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనం అనుమతిస్తున్నారు. సోమ, మంగళ, బుధ, గురువారాలు మాత్రమే అనుమతిస్తున్నారు. శుక్ర, శని, ఆదివారాల్లో మాత్రం నో లెటర్ అంటున్నారు. అయితే ఈ విధానంలో టీటీడీ పాలకమండలి మార్పులు చేసింది.
Also Read: బోరుగడ్డ కేసులో కీలక పరిణామం
తెలంగాణ ఎమ్మెల్యే, ఎంపీ లేఖలపై తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శనం అందించేందుకు అనుమతిచ్చారు. ఈ విధానం మార్చి 24 నుంచి అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి తెలంగాణ ప్రజా ప్రతినిధుల నుండి సిఫార్సు లేఖలను ఆది, సోమవారాల్లో మాత్రమే స్వీకరించడం జరుగుతుంది. ఆ లేఖలపై సోమ, మంగళవారం దర్శనానికి అనుమతిస్తారు. అదేవిధంగా రూ.300 దర్శనం టికెట్లకు సంబంధించి సిఫార్సు లేఖలను బుధ, గురువారాల్లో మాత్రమే స్వీకరించడం జరుగుతుంది. వీటిపై అదే రోజు దర్శనం కల్పిస్తారు. ఒకరికి ఒక సిఫార్సు లేఖ మాత్రమే.. ఆ లేఖపై 6 మందిని మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు.
Also Read : చంద్రబాబుకు, జగన్‌కు అదే తేడా..!
అలాగే ఇకపై ప్రతి ఆదివారం నాడు ఆంధ్రప్రదేశ్ ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చిన సిఫార్సు లేఖలపై దర్శనం కల్పిస్తారు. ఈ లేఖలను శనివారమే స్వీకరిస్తారు. తిరుమలలో అందుబాటులో ఉన్న వసతి సౌకర్యాలను, ఇతర భక్తుల దర్శన సమయాలను దృష్టిలో ఉంచుకుని సుదీర్ఘంగా చర్చించిన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న అనంతరం టీటీడీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ మార్పులను భక్తులు దృష్టిలో ఉంచుకోవాలని టీటీడీ అధికారులు కోరారు. తొలి రోజున తెలంగాణ ప్రజాప్రతినిధులు ఇచ్చిన లేఖలపై 600 మంది భక్తులు వీఐపీ బ్రేక్ దర్శనం కేటాయించినట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు.
Also Read: కడపలో వైసీపీకి షాక్ తప్పదా..?
శ్రీవారి దర్శనభాగ్యం కల్పించిన సీఎం చంద్రబాబు, టీటీడీ పాలకమండలికి భక్తులు ధన్యవాదాలు తెలిపారని కూడా ట్వీట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా పోస్ట్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లేఖలను టీటీడీ అనుమతించింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా చంద్రబాబు సర్కార్ పాత విధానాన్నే కొనసాగించింది. కానీ 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలపై కేవలం రూ.300 దర్శనం మాత్రమే అనుమతించారు. బ్రేక్ దర్శనానికి బ్రేక్ వేశారు. తెలంగాణ ప్రభుత్వం, ప్రజా ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు వారానికి రెండు రోజుల్లో లేఖలపై దర్శనాలకు అనుమతిస్తున్నారు.