ఆంధ్రప్రదేశ్ లో శాంతిభద్రతల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గత కొన్ని రోజులుగా శాంతిభద్రతలకు సంబంధించి ఎక్కువగా సమీక్ష సమావేశాలు జరుపుతూ వస్తున్నారు. రాజకీయంగా కూడా కొన్ని సమస్యలు ఇబ్బంది పెట్టడంతో కఠినంగా వ్యవహరిస్తున్నారు సీఎం. కొందరు పోలీసు అధికారుల వైఖరి కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని టిడిపి నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో సైతం దీని గురించి పెద్ద చర్చ జరుగుతుంది.
Also Read : ఉప్పు, పప్పు కూడా ప్రభుత్వ సొమ్ముతోనే.. “లేఖ” దుమారం..!
ఇటీవల కందుకూరు వ్యవహారంలో కులాల అంశాన్ని తీసుకురావడంతో ప్రభుత్వం కాస్త ఇబ్బంది పడిందనే చెప్పాలి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టార్గెట్ గా వైసిపి పరోక్ష రాజకీయం చేసింది అనే వ్యాఖ్యలు సైతం వినిపించాయి. అయితే ఈ విషయంలో రాజకీయ పార్టీలు అప్రమత్తంగా ఉండటంతో పరిస్థితి చేయి దాటలేదు అనే విషయం స్పష్టత వచ్చింది. ఇక తాజాగా భీమవరం డిఎస్పి వ్యవహారం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ఆయన పేకాట, కోడిపందాలు శిబిరాలను నిర్వహిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేరుగా జోక్యం చేసుకున్న పరిస్థితి.
ఈ మేరకు జిల్లా ఎస్పీని పవన్ కళ్యాణ్ నివేదిక కూడా అడిగారు. వెంటనే ఆలస్యం చేయకుండా జరుగుతున్న వ్యవహారాన్ని నివేదిక రూపంలో సమర్పించాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. దీనితో సీఎం చంద్రబాబు వెంటనే హోం మంత్రి అనిత, డీజీపీ హరీష్ గుప్తా తో సమావేశం అయ్యారు. డిఎస్పి కి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. డీఎస్పీకి ఎవరైనా రాజకీయ నాయకులు సహకరిస్తున్నారా లేదా అనే అంశాలను సైతం చంద్రబాబు ఆరా తీశారు.
Also Read : చంద్రబాబు ధైర్యానికి ఫిదా.. బీసెంట్ రోడ్ పర్యటనపై ప్రసంశలు..!
అటు పోలీస్ శాఖలో కూడా డిఎస్పీకి సహకరించే వారి విషయంలో కఠినంగా వ్యవహరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అటు కందుకూరు వ్యవహారంలో కూడా దోషులకు కఠిన శిక్ష పడాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇదే సమయంలో బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించారు ముఖ్యమంత్రి. గాయపడిన పవన్ కు నాలుగు ఎకరాల భూమితో పాటుగా.. ప్రాణాలు కోల్పోయిన లక్ష్మీనాయుడుకు నాలుగెకరాల భూమి ఐదు లక్షల పరిహారం కూడా ప్రకటించింది ప్రభుత్వం. అలాగే అతని పిల్లల చదువు బాధ్యతను చంద్రబాబు తీసుకుంటున్నట్లు ప్రకటించారు.