ఆంధ్రపదేశ్ లో ప్రభుత్వం మారినా సరే కొందరు అధికారుల ప్రవర్తనలో మాత్రం మార్పు రావడం లేదు. మంత్రులు చెప్పినా సరే అధికారులు వినకపోవడం పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇటీవల సిఎం చంద్రబాబు తో సహా పలువురు మంత్రులు కూడా అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఏపీ జలవనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు అధికారుల తీరుపై మండిపడ్డారు. తన మాట కూడా అధికారులు వినకపోవడం పట్ల ఆయన సీరియస్ అయ్యారు. అసలు ఏం జరిగింది ఏంటీ అనేది చూద్దాం.
తాజాగా మంత్రి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏ కూటమిని ప్రజలు ఎంత బాగా ఆశీర్వదించారో ప్రకృతి కూడా అదే విధంగా దీవించడంతో వర్షాలు కురిసి రాష్ట్రంలో జలకళ నెలకొందని ఆయన అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నదులు, జలాశయాలు నిండుకుండలా మారాయని పేర్కొన్నారు. శ్రీశైలం డ్యాం నుంచి ఐదు గేట్లు ఎత్తి 1.35 లక్షల క్యూసెక్కులను నీటిని దిగువకు వదులుతున్నామని అన్నారు. నాగార్జున సాగర్ పూర్తి సామర్థ్యం 312 క్యూసెక్కుల నీరుకు గాను ఇప్పటికీ 140 క్యూసెక్కుల నీరు చేరుకుందని ఆయన వివరించారు.
రాయలసీమ ప్రాంత తాగునీరు, సాగునీరు అవసరాలు తీర్చే విధంగా పోతిరెడ్డి, వెలుగోడు, ఆల్మట్టి డ్యాములు నిండుకున్నాయని… హంద్రీనీవా, తుంగభద్రా నుంచి పెద్ద ఎత్తున వర్షపు నీరు జలాశయాలకు చేరుతోందని తెలిపారు. హంద్రీనీవా ప్రాజెక్టు నిర్వాహక అధికారులు నిర్లక్ష్యం , నిర్లిప్తతో వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. వారం రోజుల క్రితమే గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేయాలని చెప్పినా వారిలో గత ప్రభుత్వ పాలన వాసన పోలేదని వారిపై త్వరలోనే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మంత్రి.




