నేను రాజకీయ కక్ష తీర్చుకోను… జగన్ హయాంలో మా పార్టీ వాళ్లు బాగా ఇబ్బంది పడ్డారు… అధికార యంత్రాంగాన్ని నేను ఎవరిని ఇబ్బంది పెట్టను… ఈ వ్యాఖ్యలు చేసింది ఏపీ సీఎం చంద్రబాబు. జనవరి ఒకటో తేదీన తనతో కలిసిన మీడియా మిత్రులతో చంద్రబాబు చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఐదేళ్లు విధ్వంసం చేశారని… మళ్లీ గాడిలో పెడుతున్నామన్నారు. అయితే ఇదే సమయంలో ఎలాంటి కఠిన చర్యలు ఉండవంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు పార్టీ కేడర్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. అసలు చంద్రబాబు తీరు ఏమిటీ అనేది ఇప్పుడు ప్రతి కార్యకర్త ప్రశ్న.
Also Read: మాకేం తెలియదంటున్న మంత్రులు… నిజమెంతా..?
వాస్తవానికి వైసీపీ ఐదేళ్ల పాలనలో అవమానాలు ఎదుర్కొని టీడీపీ నేత లేడు. ఇబ్బంది పడని పార్టీ కార్యకర్త లేడు. ఆర్థికంగా నష్టపోని నాయకుడు లేడు. అక్రమ కేసులతో కార్యకర్త మొదలు అధినేత చంద్రబాబు వరకు అందరూ జైలుకు వెళ్లిన వారే. ఇందుకు ప్రభుత్వానికి కొందరు అధికారులు కూడా పూర్తిగా సహకరించారు. వాస్తవానికి చంద్రబాబు జైలు నుంచి విడుదలైన తర్వాత మాస్ వార్నింగ్ ఇచ్చారు. రూల్స్ బ్రేక్ చేసిన వారిని వదిలేది లేదని.. అక్రమ అరెస్టులతో తనను, పార్టీ కార్యకర్తలను జైలుకు పంపిన వారికి మిసరబుల్ ట్రీట్‌మెంట్ ఉంటుందని అప్పట్లో వార్నింగ్ ఇచ్చారు. ఇక పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ కూడా యువగళం పాదయాత్రలో తగ్గెదే లే అంటూ వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు.
Also Read: చైనా వైరస్ గురించి డోంట్ వర్రీ: కేంద్రం
అయితే అధికారంలోకి వచ్చిన ఆరు నెలలైనా సరే.. ఇప్పటి వరకు పెద్దగా చర్యలు తీసుకున్నది లేదు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని అరెస్టు చేశారు తప్ప… పెద్ద పెద్ద నేరాలు చేసిన వారి జోలికి ఇప్పటి వరకు వెళ్లలేదు. మాజీ మంత్రులు పెద్దిరెడ్డి, రోజా, కారుమూరి, అంబటి, గుడివాడ, కొడాలి, జోగి వంటి నేతలు చేసిన అవినీతిపై విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారనేది ప్రధాన ఆరోపణ. ఇదే సమయంలో ఆయా శాఖల్లో మంత్రులకు సహకరించిన నాటి ఐఏఎస్ అధికారులకు తిరిగి మంచి మంచి స్థానాల్లో పోస్టింగ్ ఇచ్చారనేది మరో ఆరోపణ. పార్టీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టిన పోలీసులకు కూడా మంచి పోస్టింగ్ ఇస్తున్నారని… వారిపై గతంలోనే లోకేష్‌కు ఫిర్యాదు చేస్తే… తప్పకుండా చర్యలుంటాయని ఇచ్చిన హామీ ఏమైందనేది సగటు పార్టీ కార్యకర్త ప్రశ్న.
Also Read: ఒక్క రోజే 2 వేల మందితో చంద్రబాబు.. కుటుంబానికి దూరంగా.. క్యాడర్ కు దగ్గరగా…!
గత ప్రభుత్వం టార్గెట్ టీడీపీ అన్నట్లుగా వ్యవహరించింది అనేది వాస్తవం. ఆ సమయంలో చాలా మంది టీడీపీ నేతలు, కార్యకర్తలు ఊళ్లు వదిలేసి ఇతర ప్రాంతాలకు వెళ్లి తలదాచుకున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాతే వాళ్లంతా తిరిగి ఊర్లోకి వచ్చారు. అలా తప్పుడు కేసులతో బెదిరించిన వైసీపీ చోటా నాయకులంతా ఇప్పుడు ఊళ్లో దర్జాగా తిరుగుతున్నారు. పైగా కొన్ని చోట్ల అయితే మీరేం చేయలేరు అంటూ టీడీపీ నేతలకు సవాలు కూడా చేస్తున్నారు. ఇలాంటి సమయంలో రాజకీయ కక్షలు ఉండవంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై పార్టీ నేతలు, కార్యకర్తలు గుర్రుగా ఉన్నారు.




