తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పుడు సీరియస్ గా దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. నిన్న అనూహ్యంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ కమిటీలు అన్నీ రద్దు చేసారు చంద్రబాబు. త్వరలోనే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడని కూడా ఆయన ఎంపిక చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఇందుకోసం ఎవరిని ఎంపిక చేస్తే మంచిది అనే దానిపై చంద్రబాబు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు. వచ్చే ఏడాది జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బిజెపితో కలిసి వెళ్ళే ఆలోచనలో టీడీపీ నేతలు ఉన్నారు. అందుకనే చంద్రబాబు కాస్త దూకుడు ప్రదర్శిస్తున్నారు.
ఇదిలా ఉంచితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఒక ఎమ్మెల్యే మాత్రం చంద్రబాబు సమక్షంలో పార్టీ మారేందుకు సిద్దమవుతున్నారు. చంద్రబాబుని గతంలో రెండు సార్లు కలిసిన ఆయన పార్టీలోకి వస్తా అని అడిగారట. పార్టీ అధ్యక్ష బాధ్యతలను కూడా తాను తీసుకుంటా అని అడిగారట. అయితే ఆయనకు నియోజకవర్గంలో మినహా మాస్ ఇమేజ్ లేదు. దీనితో చంద్రబాబు ఆలోచనలో పడ్డారు. ఇక ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు కూడా పార్టీలోకి వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు అని సమాచారం. అంతే కాకుండా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కూడా టీడీపీ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసారు.
వీరిలో ఒకరికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టుగా టీడీపీ వర్గాలు అంటున్నాయి. బీఆర్ఎస్ పార్టీ క్రమంగా బలహీనపడుతోంది. బీజేపిలో విలీనం అయ్యే అవకాశం ఉందనే ప్రచారం సైతం పెద్దఎత్తున జరుగుతోంది. కొందరు ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి తీసుకునే ప్రయత్నం కూడా చేస్తుందనే ప్రచారం కూడా చూస్తున్నాం. అందుకే ఇప్పుడు టీడీపీ కూడా దూకుడు పెంచి కనీసం ముగ్గురు ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకునే ఆలోచనలో ఉంది. గతంలో టీడీపీలో ఉన్న నేతలే కావడంతో చంద్రబాబు తనను విమర్శించని వారి మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. తెలంగాణాలో బలంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గ నేతలకు తెలంగాణా టీడీపీ రెడ్ కార్పెట్ పరుస్తోంది.