అమరావతి నుంచి 5 వేల కోట్ల మేర హార్డ్‌వేర్ ఎగుమతులు సాధించాలన్నదే లక్ష్యమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. రెండో రోజు కలెక్టర్ల సమావేశంలో క్వాంటం వ్యాలీ గురించి ప్రస్తావించారు. వచ్చే ఏడాది జనవరి నాటికి అమరావతిలో క్వాంటం వ్యాలీలో ఐబీఎం సంస్థ రెండు కంప్యూటర్లు ఏర్పాటు చేస్తుందని చంద్రబాబు వెల్లడించారు. 2027 నాటి 3 కంప్యూటర్లు ఏర్పాటు చేస్తుందన్నారు. క్వాంటం వ్యాలీలో నిర్మిస్తున్న భవనాల నమూనాలను చంద్రబాబు పరిశీలించారు.
Also Read : సజ్జల అవుట్.. సతీష్ రెడ్డి ఇన్.. జగన్ కీలక ఆదేశాలు
క్వాంటం వ్యాలీకి అమరావతి కేరాఫ్ అడ్రస్‌గా మారుతుందన్నారు చంద్రబాబు. ఏటా 5 వేల మందికి క్వాంటం కంప్యూటింగ్‌లో నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు. క్వాంటం వ్యాలీలో పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద పెద్ద సంస్థలు ఆసక్తితో ఉన్నాయన్నారు. వ్యాలీలో కనీసం వంద స్టార్టప్‌లు ఏర్పాటు చేసేందుకు రూ.వెయ్యి కోట్ల ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. క్వాంటం వ్యాలీ రాకతో రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు వస్తాయన్నారు.
Also Read : పవన్‌కు ట్రాక్ క్లియర్.. బ్రేక్ లేనట్లే..!
క్వాంటం వ్యాలీ నిర్మాణానికి ఏపీ సీఆర్‌డీఏ ఇప్పటికే 50 ఎకరాలు భూమి కేటాయించినట్లు తెలిపారు. క్వాంటం వ్యాలీలో నిర్మించే భవనంలో 80 నుంచి 90 వేల మంది పని చేసే అవకాశం ఉందన్నారు. ఐబీఎం, ఎల్ అండ్ టీ, టీసీఎస్ సంస్థలు క్వాంటం వ్యాలీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయన్నారు. అమరావతి క్వాంటం కంప్యూటింగ్ కంపెనీ (ఏక్యూసీసీ) ఏర్పాటు చేసి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నియామకాలు కూడా జరిగాయన్నారు. ఈ రంగంలో అపారమైన ఉపాది, ఉద్యోగావకాశాలు రాబోతున్నాయని చెప్పారు. యువత క్వాంటం కంప్యూటింగ్ కోర్సులు చదివేలా అవగాహన కల్పించి ప్రొత్సహించాలని చంద్రబాబు సూచించారు.