ఏపీలో కొలువుల జాతరకు సమయం ఆసన్నమైంది. ఎప్పుడెప్పుడా అని పార్టీల నేతలు ఎదురు చూస్తున్న నామినేటెడ్ పదవులు మరికొన్ని గంటల్లోనే రానున్నాయి. ఉగాది నాటికి అన్ని పదవులు భర్తీ చేస్తామని గతంలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అందులో భాగంగానే తాజాగా 47 మార్కెట్ కమిటీలకు చైర్మన్‌లను ప్రభుత్వం ప్రకటించింది. 47 మార్కెట్ కమిటీల చైర్మన్‌లతో పాటు డైరెక్టర్ పోస్టులు కూడా భర్తీ చేసింది. దీంతో మొత్తం 705 నామినేటెడ్ పదవులు భర్తీ చేసినటైంది. ప్రకటించిన 47 వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవుల్లో 37 టీడీపీ, 8 జనసేన, 2 బీజేపీ నాయకులకు దక్కాయి. అభ్యర్థుల ఎంపికను ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా చేసినట్లు పార్టీ నేతలు వెల్లడించారు. ఐవీఆర్ఎస్ ద్వారా వచ్చిన ఫీడ్ బ్యాక్‌ను పరిశీలించిన తర్వాతే ఈ పదవులు ఇచ్చినట్లు తెలుస్తోంది.త్వరలోనే మిగిలిన మార్కెట్ కమిటీలకు కూడా చైర్మన్లు, డైరెక్టర్లను ప్రభుత్వం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
Also Read : కాకాని పై గురి.. గవర్నర్ అనుమతి ఇస్తారా..?
ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మూడు జాబితాల్లో నామినేటెడ్ పదవులు విడుదల చేశారు. తొలిసారి కేవలం కార్పొరేషన్‌లకు మాత్రమే చైర్మన్‌లను ప్రకటించగా.. మూడో విడతలో మాత్రం కేవలం మార్కెట్ యార్డులకు మాత్రమే కమిటీలను ప్రకటించారు. అలాగే ఇప్పటి వరకు దేవాదాయ శాఖ పరిధిలోని అన్ని ఆలయాలకు పాలకమండళ్లను ప్రకటించలేదు. కేవలం తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిని మాత్రమే ఇప్పటికి ప్రకటించారు. విజయవాడ దుర్గ గుడి, శ్రీశైలం, అన్నవరం, సింహాచలం, కాణిపాకం, శ్రీకాళహస్తి వంటి ప్రముఖ దేవాలయాలతో పాటు ద్వారకా తిరుమల, అరసవల్లి, మోపిదేవి, పెనుగంచిప్రోలు, యాగంటి, మహానంది వంటి పుణ్యక్షేత్రాలకు కూడా పాలకమండలిని ఖరారు చేయాల్సి ఉంది. వీటికి కూడా ఈ విడతలోనే కమిటీలను ప్రకటిస్తారనే మాట వినిపిస్తోంది.
Also Read : ఏపీ పోలీసుల కొత్త అవినీతి.. వైసీపీ అండదండలతో
వీటితో పాటు ఏపీలో పలు కీలక నామినేటెడ్ పదవులను భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఏపీ ఫైబర్ నెట్, డిజిటల్ కార్పొరేషన్, మహిళా కమిషన్, మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ వంటి కీలక పదవుల కోసం పలువురు పార్టీ నేతలు ఆశగా ఎదురు చూస్తున్నారు. అలాగే పార్టీ పదవులు కూడా భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. తెలుగు మహిళ, బీసీ కమిటీ, రైతు విభాగం, వాణిజ్య విభాగం వంటి పదవులను తెలుగుదేశం పార్టీ భర్తీ చేయాల్సి ఉంది. ఐదేళ్ల పాటు అనుబంధ విభాగాలకు ఛైర్మన్లుగా వ్యవహరించిన వారికి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తామని మంత్రి నారా లోకేష్ గతంలోనే హామీ ఇచ్చారు. అన్నట్లుగానే అనితకు హోమ్ మంత్రి, కొల్లు రవీంద్రకు మంత్రి పదవి, ఎంఎస్ రాజుకు ఎమ్మెల్యే, డూండీ రాకేష్, శ్రీనివాసరెడ్డి, రవినాయుడు వంటి వారికి కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కాయి. అలాగే మిగిలిన వారికి కూడా చైర్మన్ పదవులు ఖాయమనే మాట వినిపిస్తోంది. దీంతో వారు ఖాళీ చేసిన స్థానాలను కొత్త వారితో భర్తీ చేయాలనేది పార్టీ పెద్దల మాట.