ఏపీలో కూటమి సర్కార్ అన్ని విధాలుగా పరుగులు పెడుతోంది. ఓ వైపు అనుభవం.. మరో వైపు యువత మేళవింపుతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నారు కూటమి నేతలు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రానికి భారీ స్థాయిలో నిధులు రాబడుతున్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆగిపోయిన ప్రాజెక్టులు తిరిగి ప్రారంభమయ్యాయి. ఏపీకి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ఉపాధి అవకాశాలు మెరుగు పడుతున్నాయి. అదే సమయంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగేలా కూటమి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. దీంతో ప్రస్తుత కూటమి ప్రభుత్వ పెద్దలపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read : అలుపెరగని చంద్రబాబు.. టార్గెట్ యూరప్, గల్ఫ్..!
ఐదేళ్ల పాటు ఏపీ వైపు చూసేందుకు పారిశ్రామిక వేత్తలు భయపడ్డారు. రాజధాని అమరావతి నిర్మాణం ఆగిపోయింది. రాష్ట్ర రహదారులు ఘోరంగా పాడైపోయాయి. అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఉపాధి అవకాశాలు లేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు. వీటితో పాటు లా అండ్ ఆర్డర్ కూడా క్షిణించిందనే కేంద్రం నివేదికలు పరిశ్రమలు రాకపోవడానికి ప్రధాన కారణాలు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమ పథకాల అమలుతో పాటు అభివృద్ధిపై కూడా దృష్టి పెట్టారు. ముందుగా అమరావతి నిర్మాణం ప్రారంభించిన చంద్రబాబు.. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. పారిశ్రామిక వేత్తలతో భేటీ అయ్యారు. రాయితీలు ప్రకటించారు. భూ కేటాయింపులను సరళీకృతం చేశారు. అటు అమరావతిలో, ఇటు విశాఖలో కూడా ఐటీ సంస్థలకు ప్రత్యేక కారిడార్ ప్రకటించారు. దీని వల్ల కొత్తగా యువతకు ఉద్యోగాలు లక్షల్లో వస్తాయని ప్రకటించారు. గూగుల్ వంటి బడా సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేలా చంద్రబాబు చక్రం తిప్పారు.
Also Read : విలువల్లేని బిగ్ బాస్.. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రచ్చ
చంద్రబాబు అంటే ఐటీ అని.. కార్పొరేట్ సంస్థ సీఈఓ అని.. ఆయనకు సామాన్యుల కష్టాలు తెలియవని ప్రతిపక్షాలు తొలి నుంచి ఆరోపణలు చేస్తున్నాయి. ఇప్పుడు కూడా హోటల్స్, మాల్స్, ఐటీ సంస్థలకు భూములు పంచేస్తున్నారని.. దీని వల్ల సామాన్యులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించాయి. దీంతో ఈ విమర్శలకు చెక్ పెట్టేందుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వయంగా రంగంలోకి దిగారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సమస్యల పరిష్కారానికి నడుం బిగించారు. కాకినాడ సెజ్ బాధితులకు భూములు తిరిగి ఇప్పించారు. ఉప్పాడ తీర మత్స్యకారులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. గిరిజన ప్రాంతాల్లో పర్యటించారు. గిరిజనులకు కావాల్సిన కనీస మౌలిక సదుపాయాలు రోడ్డు, రవాణా సౌకర్యం కల్పించేందుకు హామీ ఇచ్చారు. ఇక గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో ఏపీ వ్యాప్తంగా పంచాయతీలకు నిధులు మంజూరు చేశారు. అన్ని పంచాయతీల పరిధిలో కూడా సిమెంట్ రోడ్లు, సైడ్ కాల్వలు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం పై పవన్ దృష్టి సారించారు. దీంతో ఒకరు పూర్తిగా క్లాస్ అంటుంటే.. మరొకరు మాస్ ప్రజల సమస్యలపైన దృష్టి పెట్టారనే మాట ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో అన్నివర్గాల ప్రజల మద్దతు కూటమికి ఉండాలనే లక్ష్యంతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ పని చేస్తున్నారనేది రాజకీయ విశ్లేషకుల మాట.