చైనాలో వ్యాపిస్తున్న హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్ (HMPV) పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఈ వైరస్ గురించి ఆందోళన అవసరం లేదని కేంద్రం పేర్కొంది. కేంద్ర ఆరోగ్య సంస్థ డైరెక్టర్ అతుల్ గోయెల్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ కొత్త వైరస్ దేశంలోకి ప్రవేశించలేదని, అయితే ప్రజలు జాగ్రత్తలు పాటించాలని పలు సూచనలు చేసారు. చైనాలో దీని ప్రభావం ప్రస్తుతం ఎక్కువగా ఉంది. ఆ దేశ ప్రజలు శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల బారిన పడి ప్రస్తుతం ఆస్పత్రుల బాట పట్టారు.
Also Read : హోంమంత్రి పిఏ పై వేటు.. కారణాలు ఇవే..!
ఇప్పటి వరకు దేశంలో ఈ వైరస్ కేసు నమోదు కాలేదన్న ఆయన సాధారణ జలుబుకు కారణమయ్యే శ్వాసకోశ వైరస్ మాదిరిగానే హెచ్‌ఎంపీవీ ఉందని వివరించారు. ఈ వైరస్ వల్ల పిల్లలు, వృద్ధుల్లో ఫ్లూ లాంటి లక్షణాలు కనిపిస్తాయని, సాధారణంగా చలికాలంలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల వ్యాప్తి పెరుగుతుందని, అందుకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దగ్గు లేదా జలుబు వంటి లక్షణాలు ఉంటే, ఇన్‌ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలంటూ ఆయన తెలిపారు. ఇతరులకు దూరంగా ఉండాలన్నారు.
Also Read : యంగ్ టైగర్ ఫ్యాన్స్ కు సంక్రాంతి ట్రీట్ రెడీ..!
జలుబు లేదా జ్వరానికి సాధారణ మందులు తీసుకుంటే సరిపోతుందని, ప్రస్తుతం దేశంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు. ఈ విషయంలో తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని అతుల్ విజ్ఞప్తి చేసారు. సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేస్తున్నారని, దేశంలోకి వైరస్ రాకుండా చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. అయినప్పటికీ ఆసుపత్రులతోపాటు అత్యవసర వైద్య సామాగ్రిని సన్నద్ధం చేస్తున్నామని మీడియాకు తెలిపారు. కరోనా సమయంలో తీసుకున్న జాగ్రత్తలు ఇప్పుడు అవసరం లేదని.. వృద్దులు, పిల్లలు మాత్రం జలుబు ఉన్న వారికి దూరంగా ఉండాలన్నారు.