ఏపీలో విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈనెల 22న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మే 9న పోలింగ్ జరగనుంది. వైసీపీకి అలాగే రాజకీయాల నుంచి తప్పకుండా తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. ఇక ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం ఈనెల 22న నోటిఫికేషన్ జారీ చేయగా.. 29 వరకు నామినేషన్ స్వీకరణ ఉంటుంది.
Also Read : ఏఐ వీడియోలు.. పింక్ పార్టీకి మూడిందా..?
30న నామినేషన్ల పరిశీలన ఉండనుంది. మే 2 వరకు నామినేషన్ లో ఉపసంహరణకు గడువు ఇచ్చారు. మే 9 ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి ఓట్లను లెక్కిస్తారు. 13వ తేదీలోపు ఎన్నిక ప్రక్రియ పూర్తికానుంది. ఈ నేపథ్యంలో ఆ స్థానానికి ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా కూటమి పార్టీల నుంచి ప్రధానంగా టిడిపి రేసులో ఉంది. ఇక జనసేన పార్టీ నుంచి కూడా రాజ్యసభ సభ్యత్వానికి పలువురు పోటీ పడుతున్నారు.
Also Read : డ్రామా బయటపడుతుందని వైసీపీ భయపడుతోందా..?
ముందు నాగబాబు పేరు వినపడగా ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. బిజెపి కూడా రాజ్యసభ సభ్యత్వం కోసం ఎదురు చూస్తోంది. అయితే టిడిపి నుంచి పలువురు నేతలు సిద్ధంగా ఉండటంతో వారికే రాజ్యసభ సీటు వరించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. టిడిపి నుంచి ప్రధానంగా గల్లా జయదేవ్ పేరు వినపడుతోంది. అయితే విజయసాయిరెడ్డి రాజకీయాల్లోకి తిరిగి అడుగుపెడుతున్నారని.. ఆయన బిజెపి నుంచి రాజ్యసభకు ఎన్నిక అయ్యే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇటీవల దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఏపీలో బిజెపికి ఆర్థికంగా అండదండలు అందిస్తానని ఆయన హామీ ఇచ్చారని అందుకే ఆయనకు రాజ్యసభ సీటును బిజెపి అధిష్టానం కేటాయించిందని ప్రచారం జరుగుతుంది.




