ఒక వైపు ఏమో కమ్మ కులం వారిని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ దూరం పెట్టారనే భావనతో ఆ కులం టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రముఖులు ప్రస్తుతం చంద్రబాబు, లోకేష్‌పై కొంత అసహనంతో ఉన్నారనేది బహిరంగ రహస్యం. తమపై సొంత కులం నేతలు గుర్రుగా ఉన్నారని ఇటీవల తన సన్నిహితుల వద్ద చంద్రబాబు వ్యాఖ్యానించారు కూడా. అయితే తనకు కులం ముఖ్యం కాదని.. అన్ని వర్గాలను సమానంగా చూడటమే లక్ష్యమన్నారు. నిజానికి ఇప్పటి వరకు టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో.. తన సొంత కులానికి మాత్రమే చంద్రబాబు అండగా ఉన్నారనే ఆరోపణలు రాలేదు. పార్టీ ప్రారంభం నాటి నుంచి టీడీపీ అంటే అన్ని కులాలకు చెందిన పార్టీ అని అందరికీ తెలుసు. ఇంకా చెప్పాలంటే.. బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది కేవలం టీడీపీ అని గొప్పగా చెప్పుకుంటారు కూడా.
Also Read : ఏ ఒక్కడినీ వదిలిపెట్టం.. చంద్రబాబు ఉగ్రరూపం
అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా టీడీపీపై కులం ముద్ర వేసి కులం కుంపట్లు రాజేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. నాటి రాజశేఖర్ రెడ్డి మొదలు.. నేటి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వరకు టీడీపీని ఒక కులానికే పరిమితం చేసే కుట్రలు చేస్తూనే ఉన్నారనేది టీడీపీ నేతల ఆరోపణ. నిజానికి బీసీ సామాజిక వర్గాలకు చెందిన ఎంతో మంది నేతలను వెలుగులోకి తీసుకువచ్చి.. వారికి కీలక పదవులు ఇచ్చింది టీడీపీ మాత్రమే. ఎర్రన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, యనమల రామకృష్ణుడు వంటి బీసీ నేతలతో పాటు బాలయోగి, ప్రతిభా భారతి వంటి ఎస్సీ నేతలు కేంద్ర మంత్రి పదవులు, అసెంబ్లీ స్పీకర్‌గా పార్లమెంట్ స్పీకర్‌గా వ్యవహరించారంటే.. అది చంద్రబాబు సారధ్యంలోని టీడీపీలో మాత్రమే. కానీ.. కొంత మంది మాత్రం ఇప్పటికీ పని కట్టుకుని టీడీపీని కమ్మ పార్టీ అనే ముద్ర వేస్తూనే ఉన్నారు.
నిజానికి టీడీపీపై తొలి నుంచి కులం ముద్ర వేసింది కడప జిల్లా రెడ్డి సామాజిక వర్గం నేతలే అని చెప్పాలి. టీడీపీ రెడ్డి కులం నేతలు దీనిని సమగ్రంగా తిప్పికొట్టడంలో పూర్తిగా విఫలమయ్యారు. అధికారుల నియామకంలో చంద్రబాబు కులం కంటే కూడా ప్రతిభకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ప్రస్తుతం కడప జిల్లా కలెక్టర్‌గా చెరుకూరి శ్రీధర్, డీఐజీగా కోయ ప్రవీణ్ కొనసాగుతున్నారు. ఈ ఇద్దరు కీలక పదవుల్లో ఉండటంతో కొంత మంది ఆటలు సాగటం లేదు. వారిద్దరు నిజాయతీ పరులే కాకుండా.. ముక్కుసూటిగా వ్యవహరిస్తారు కూడా. దీంతో ఆ ఇద్దరు అధికారుల తీరుపై గుర్రుగా ఉన్న రెడ్డి సామాజిక వర్గం నేతలు.. టార్గెట్ కమ్మ అన్నట్లుగా రాజకీయాలు చేస్తున్నారు.
Also Read : బంగారం–వెండి ధరల ఊగిసలాట వెనుక కథ
ఉమ్మడి కడప జిల్లాలో రాజకీయాలు వేరు, వ్యాపారాలు వేరు అన్నట్లుగా ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే. అన్ని పార్టీల నేతలు కలిసిమెలిసి వ్యాపారాలు చేస్తుంటారు. చాలా వ్యాపారాల్లో టీడీపీ, వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్ అనే భేదం కడప జిల్లా నేతల్లో ఉండదు. బెంగళూరు, హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో నేతలకు వాటాలున్నాయి. జిల్లాలో మాత్రం పైకి ఆరోపణలు చేసినా.. బోర్డర్ దాటితే చెట్టాపట్టాలేసుకుని తిరుగుతారనే పుకార్లు బాగానే ఉన్నాయి. ఇక కడప జిల్లాలో కీలక స్థానాల్లో ఉన్న అధికారులు తమకు ఏ మాత్రం విలువ ఇవ్వటం లేదని.. నేరుగా సచివాలయం పెద్దలకే రిపోర్టులు ఇస్తున్నారని స్థానిక ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అధికారులు తమను కనీసం గౌరవించడం లేదనే అసహనాన్ని నేరుగా కమ్మ కులం పెత్తనం అన్నట్లుగా పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తూ.. తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.
కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పలు వివాదాల్లో ఉన్న వారిలో బీజేపీ ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి ఒకరు. తాజాగా చంద్రబాబు సొంత సామాజిక వర్గం కమ్మ కులంపై పరోక్షంగా ఆరోపణలు చేశారు. నేరుగా చేస్తే.. తన రాజకీయ జీవితం దెబ్బ తింటుందనే “దూరా” లోచనతో ఒక పధకం ప్రకారం వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం “కమ్మ” గా ఉందంటూ బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వెటకారంగా వ్యాఖ్యలు చేశారు. కమ్మటి పరిస్థితి పోవాలని.. అందరం ఒకే కులం, ఎవరు గట్టిగా పనిచేస్తారో వారికి అవకాశం ఇవ్వాలి అంటూ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత “కమ్మగా ఉండటం అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది కదా..” అంటూ ఆ పదం ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ కమ్మతో పాటు అందరం ఉన్నామని.. కూటమిలో బీజేపీ కీలకంగా ఉందన్నారు. బీజేపీ లేకపోతే.. రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన పార్టీలు లేవన్నారు కూడా. ఈ వ్యాఖ్యలు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ సమక్షంలో ఆదినారాయణ చేయడం దుమారం రేపుతోంది.
Also Read : సిగ్గు సిగ్గు.. జగన్ పరామర్శకు ఇవేనా అర్హతలు..?
ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. ఆది నారాయణ రెడ్డి మొదటి నుండి కమ్మ కులం వ్యతిరేకి అని.. కాంగ్రెస్, వైసీపీలో ఉన్నప్పుడు ఆయన వ్యవహార శైలి అలాగే కన్పించేదని విమర్శలు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఏ కులం పెత్తనం చేసిందో అందరికీ తెలుసు. ఐదేళ్ల పాటు కీలక పదవులన్నీ ఏ కులానికి ఇచ్చారో అప్పట్లో టీడీపీ నేతలు ఆన్ రికార్డు రుజువు చేశారు. అయితే అప్పుడు నోరు మెదపని టీడీపీ మాజీ మంత్రి, ప్రస్తుత జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి.. కూటమి ప్రభుత్వం “కమ్మ” కులం ప్రభుత్వం అంటూ పరోక్షంగా వర్ణించారు. కూటమి సర్కార్ పాలన గురించి ప్రస్తావించే క్రమంలో.. ఏకంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావాన్ని కూడా గుర్తు చేశారు. 1983లో టీడీపీ పాల ఎలా ఉందని ఎవరో అడిగితే.. “కమ్మ” గా ఉందని చెప్పారట. ఇప్పుడు కూడా “కమ్మ” గా ఉందన్నారు.
బీజేపీ అండ వల్లే చంద్రబాబు సీఎం అయ్యారని.. బీజేపీ లేకపోతే కూటమి అధికారంలోకి వచ్చేది కాదంటూ ఏడాదిన్నర తర్వాత తన అక్కసు బయటపెట్టారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించాల్సిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్టులో జూనియర్ అయిన రెడ్డి కులానికి చెందిన జవహర్‌రెడ్డిని జగన్ మోహన్ రెడ్డి నియమించారు. డీజీపీగా రాజేంద్రనాథ్ రెడ్డి, టీటీడీ ఈవోగా ధర్మారెడ్డి.. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఎంతో మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్లే కీలక స్థానాల్లో ఉన్నారు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం.. సీఎస్ పోస్టులో కమ్మ కులానికి చెందిన ఐఏఎస్ అధికారి సాయిప్రసాద్‌ను కాదని.. బీసీ అయిన విజయానంద్‌ను చంద్రబాబు నియమించారు. నిజానికి అప్పుడు రెడ్డి కులం అధికారిని జగన్ అందలం ఎక్కిస్తే.. ఇప్పుడు కమ్మ కులం అధికారిని చంద్రబాబు పక్కన పెట్టేశారు.
Also Read : కుల చిచ్చు కోసం కొత్త డ్రామా..?
అలాంటి చంద్రబాబుపై కమ్మ కులం పక్షపాతి అంటూ బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ముద్ర వేస్తున్నారు. కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ నిజాయితీగా, సమర్ధవంతంగా, పైరవీలకు అవకాశం ఇవ్వకుండా ముక్కు సూటిగా పనిచేయటం రెడ్డి కులం నాయకులకు మింగుడు పడటం లేదని తెలుస్తోంది. పగలు టీడీపీ.. రాత్రి వైసీపీ నేతలతో కలిసిపోయే నాయకుల చిట్టా చంద్రబాబు, లోకేష్‌కు చేరినట్లు తెలుస్తోంది. ఆ చిట్టాను జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఇచ్చి ఉంటారని టీడీపీ రెడ్డి నాయకులకు అనుమానం. కొంతమంది టీడీపీ రెడ్డి నాయకులే ఎమ్మెల్యే ఆదినారాయణను రెచ్చగొట్టి కమ్మ కులం పై దాడి చేయిస్తున్నారని జిల్లా నేతల మాట. కడపలో పేరుకే కూటమి ప్రభుత్వం అని, వైసీపీ ప్రభుత్వంలో ఎవరెవరు పెత్తనం చేశారో, వారే తెర వెనక ఉండి పెత్తనం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మాది తెనాలే.. మీది తెనాలే అన్న చందంగా.. కొందరు టీడీపీ రెడ్డి కులం వారు వ్యవహరించటం.. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నట్లుగా లేదు.. వైసీపీ ప్రభుత్వమే అధికారంలో ఉన్నట్లు కనిపిస్తుందని టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆఫ్ ధీ రికార్డు కామెంట్లు చేస్తున్నారు.

