నమ్మకాన్ని మించింది మరొకటి లేదు. నమ్మకం అనే మాటను ఎన్నో సంస్థలు తమ ట్యాగ్ లైన్ కింద వాడుకుంటున్నాయి కూడా. అదే నమ్మకం చాలా మందికి పెట్టుబడి కూడా. నమ్మకంతో వ్యాపారం చేసి కోట్లు గడిచిన వాళ్లు ఉన్నారు. అదే నమ్మకం కోసం ప్రాణాలిచ్చిన వాళ్లు కూడా ఉన్నారు. కానీ కొందరు మాత్రం.. నమ్మకం అనే ముసుగులో వ్యాపారం చేసి.. కోట్ల రూపాయలు దోచేసి.. పంగనామాలు పెడుతున్నారు. అలాంటి కోవకు చెందిన వ్యక్తి భీమశంకర్ రావు అలియాస్ చిట్టీల బుజ్జి.
Also Read : గుడివాడకి బైబై చెప్పిన కొడాలి..!
కోనసీమ జిల్లా ఐ పోలవరం మండలం మురమళ్ళకు చెందిన భీమశంకర్ చేసిన మోసం తెలిస్తే ఎవరైనా సరే వామ్మో అనాల్సిందే. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రూ.130 కోట్లు అప్పులు చెల్లించాలని లెక్క తేలినట్లు తెలుస్తోంది. సుమారు 20 ఏళ్ల క్రితం భీమవరం నుంచి మురమళ్ళకు వలస వచ్చిన బుజ్జి.. ఊర్లో వారితో పరిచయం పెంచుకున్నారు. నమ్మకం అనే బలమైన అస్త్రం ఉపయోగించి.. నెమ్మదిగా చిట్టీల వ్యాపారం మొదలుపెట్టారు. ప్రారంభంలో బాగానే చెల్లించారు. చివరికి చిట్టి స్థాయి కోటి రూపాయలకు కూడా చేరుకుంది. 25 మందితో కోటి రూపాయల చిట్టీ కూడా నడిపించాడు బుజ్జి.
చిన్న చిన్న చిట్టీలకు సకాలంలో డబ్బులు తిరిగి చెల్లించడంతో.. బుజ్జి మీద నమ్మకంతో పెద్ద చిటీలు వేశారు. అలాగే బుజ్జి మాటలు నమ్మిన కొందరు పిల్లల పెళ్లిళ్ల కోసం, ఇంటి నిర్మాణం కోసం దాచుకున్న డబ్బులు కూడా వడ్డీకి ఆశపడి అప్పుగా ఇచ్చారు. కొంతకాలం పాటు నమ్మకంగా ప్రతి నెలా వడ్డీ చెల్లించిన బుజ్జి.. ఒక్కసారిగా ఊరు నుంచి పారిపోయాడు. అసలేం జరిగిందో తెలిసే లోపే మొత్తం దుకాణం సర్దేశారు. ఉన్న ఇల్లు, పొలం, కార్లు కూడా సైలెంట్‌గా అమ్మేసి రాత్రికి రాత్రి ఊరి నుంచి కుటుంబం మొత్తం పారిపోయింది.
Also Read : కూటమికి నచ్చేసిన పేర్ని నానీ.. ఒక్క కామెంట్ తో ఫిదా..!
దీంతో లబోదిబోమంటూ బాధితులంతా పోలీస్ స్టేషన్‌కు క్యూ కట్టారు. అప్పుడే తెలిసింది.. మొత్తం అప్పులు 130 కోట్ల వరకు ఉన్నట్లు. అయితే వీటిల్లో సగం వరకు చిట్టీల డబ్బులు కావడంతో బాధితులు నోరెత్తడం లేదు. అప్పు ఇచ్చి నోటు రాయించుకున్న వారు మాత్రం.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో బుజ్జి చేసిన పని చూసి బాధితులు అవాక్కయ్యారు. తనకు అప్పులు ఇచ్చిన వారికి ఐపీ నోటీసులు పంపారు బుజ్జి. తన దగ్గర ఓ కంచం, రెండు జతల బట్టలు, ఒక జత చెప్పులు, ఒక బ్రెష్ మాత్రమే ఉన్నాయని.. మరేం లేవని ఐపీ నోటీసులో తెలిపాడు బుజ్జి.
దీంతో బాధితులంతా ముందు స్థానిక ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత బాధితుల జాబితా పెద్గగా ఉండటంతో పోటు అప్పులు కూడా భారీగానే ఉండటంతో.. నేరుగా హోమ్ మంత్రి వంగలపూడి అనితకే ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. భీమశంకర్ రావు అలియాస్ చిట్టీల బుజ్జిని హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. బుజ్జిని పోలీసులు అరెస్టు చేశారని తెలుసుకున్న బాధితులు.. పెద్ద ఎత్తున స్టేషన్‌కు వస్తున్నారు. అయితే భీమశంకర్ రావు మాత్రం.. తన దగ్గర రూపాయి కూడా లేదని తెగేసి చెబుతున్నాడు. దీంతో ఏం చేయాలో అర్థం కావటం లేదని బాధితులు తలలు పట్టుకుంటున్నారు.